Bihar Chief Minister
-
సీఎం నితీష్, మాజీ సీఎం లాలుపై అసభ్య పాటలు... గాయకుడు అరెస్ట్
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్‌లను అసభ్యకరంగా వర్ణిస్తూ పాటలు పాడిన భోజ్‌పురి గాయకుడు సూరజ్ సింగ్‌ను నవాడ పోలీసులు అరెస్టు చేశారు.నితీష్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్‌లపై సూరజ్ సింగ్ అభ్యంతరకరమైన రీతిలో పాటలు పాడిన విషయమై సీనియర్ అధికారులకు ఫిర్యాదు అందిన దరిమిలా వారి ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. భోజ్‌పురి పాటలు బీహార్‌లో ఎంతో ఆదరణ పొందుతుంటాయి. అయితే ఈ పాటలు అశ్లీలంగా ఉంటున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాగా భోజ్‌పురి సింగర్ సూరజ్ సింగ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌లపై అభ్యంతరకరంగా పాడిన పాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వైరల్ వీడియోను పోలీసులు గుర్తించారు. ప్రముఖ నేతలను అవమానించిన ఆ గాయకునిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ పాటపై జేడీయూ, ఆర్జేడీ పార్టీలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కేసు గురించి సైబర్ డీఎస్పీ ప్రియా జ్యోతి మాట్లాడుతూ ఈ కేసులో సూరజ్ సింగ్ అనే గాయకుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం -
NITI Aayog: నితీశ్ అసంతృప్తి?
నీతిఆయోగ్ భేటీకి విపక్ష ఇండియా కూటమి సీఎంలతో పాటు పాలక ఎన్డీఏ సంకీర్ణంలో కీలక భాగస్వామి అయిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్ కూడా డుమ్మా కొట్టడం విశేషం. ఆయన బదులు ఉప ముఖ్యమంత్రులు సమర్థ్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా పాల్గొన్నారు. ఆయన కోరుతున్నట్టుగా బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం ఇటీవలే స్పష్టం చేయడం తెలిసిందే. దీనిపై అసంతృప్తితోనే భేటీకి నితీశ్ దూరంగా ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే ఆయన గైర్హాజరుకు పెద్ద ప్రాధాన్యమేమీ లేదని జేడీ(యూ) పేర్కొంది. గతంలో కూడా నితీశ్ పలుమార్లు నీతిఆయోగ్ భేటీకి గైర్హాజరయ్యారని గుర్తు చేసింది. కేంద్ర బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపారని ఆరోపిస్తూ తెలంగాణ, కర్నాటక తమిళనాడు, కేరళ, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, పాండిచ్చేరి సీఎంలు కూడా భేటీకి దూరంగా ఉన్నారు. ‘‘10 రాష్ట్రాల సీఎంలు భేటీకి రాలేదు. అది ఆయా రాష్ట్రాలకే నష్టం’’ అని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం అన్నారు. ‘‘మమత సమయం పూర్తవగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మైక్‌పై తట్టారు. వెంటనే ఆమె మాట్లాడటం ఆపేసి వాకౌట్ చేశారు’’ అని ఆయన వివరించారు. బిహార్ అసెంబ్లీ సమావేశాల కారణంగా నితీశ్ రాలేకపోయారన్నారు. -
బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వాలి
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా ఉన్న జనతాదళ్(యునైటెడ్) ఎగ్జిక్యూటివ్ సమావేశం శనివారం జరిగింది. పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ ‡ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఆ పార్టీ కీలక తీర్మానాలు చేసింది. బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా స్పెషల్ ప్యాకేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పేపర్ లీకేజీ ఘటనల్లో బాధ్యులపై తీవ్ర చర్యలు తీసుకోవడం ద్వారా వీటిని పునరావృతం కాకుండా చేయవచ్చని పేర్కొంది. ఈ సమావేశం నితీశ్‌కి నమ్మకస్తుడిగా, బీజేపీతో మంచి సంబంధాలున్న రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంది. -
Patna high court: రిజర్వేషన్ల పెంపు చెల్లదు
పాట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విద్యా, ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు పెంచుతూ 2023 నవంబర్‌లో ప్రభుత్వం తీసుకొచి్చన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. రిజర్వేషన్లు పెంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది. రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 16ని ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రితికా రాణి చెప్పారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో తీర్పును రిజర్వ్ చేసిందని, గురువారం తుది తీర్పు ఇచి్చందని వెల్లడించారు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు పౌరులంతా సమానమే. ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగం, ఉపాధి విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు కలి్పంచాలి. కుల గణన ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచినట్లు బిహార్ ప్రభుత్వం న్యాయస్థానంలో వాదించిందని పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది నిర్భయ్ ప్రశాంత్ తెలిపారు. ఇంద్ర సహానీ కేసుతోపాటు మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో కోటాను 50 శాతానికి మించి పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు తేలి్చచెప్పిందని గుర్తుచేశారు. 75 శాతానికి చేరిన రిజర్వేషన్లు బిహార్ ప్రభుత్వం కుల గణన నిర్వహించింది. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ) 63 శాతం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఎస్సీ, ఎస్టీలు కలిపి 21 శాతానిపైగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్రభుత్వం గతంలోనే ఈబీసీలకు 10 రిజర్వేషన్లు కలి్పంచింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదు కాబట్టి రిజర్వేషన్ చట్టాల్లో సవరణలు చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. 50 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల కోటాను 65 శాతానికి పెంచేసింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బిహార్‌లో ఈబీసీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకున్నాయి. సవరించిన రిజర్వేషన్ చట్టాలను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి బిహార్ సర్కారు విజ్ఞప్తి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల జాబితా తొమ్మిదో షెడ్యూల్లో ఉంది. ఈ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కోర్టుల్లో సవాలు చేసేందుకు అవకాశం ఉండదు. సుప్రీంకోర్టు 1992లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బిహార్ సర్కారు రిజర్వేషన్లు పెంచడాన్ని సవాలు చేస్తూ పలువురు పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. -
సమన్వయ కమిటీ! నితీశ్ సారథ్యంలో సీఎంపీ: జేడీయూ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కారు మనుగడకు కీలకంగా మారిన భాగస్వామ్య పక్షాలు బీజేపీ ముందు పలు డిమాండ్లు పెడుతున్నాయి. అందులో భాగంగా ఎన్డీఏ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని జేడీ(యూ) డిమాండ్ చేస్తోంది. దాని కనీ్వనర్‌గా పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఉండాలని కోరుతోంది. అంతేగాక ఎన్డీఏకు కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) ఉండాలని, దాని అమలు కమిటీ సారథ్యాన్ని కూడా నితీశ్‌కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి అదనంగా నాలుగు కేబినెట్ బెర్తులు, బిహార్‌కు ప్రత్యేక హోదా తదితరాలను నితీశ్ ఇప్పటికే బీజేపీ పెద్దల ముందుంచారు. టీడీపీ కూడా నాలుగైదు కేబినెట్, ఒక సహాయ మంత్రి, లోక్‌సభ స్పీకర్ పదవి డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. టీడీపీ, జేడీ(యూ) డిమాండ్లకు బీజేపీ అంగీకరించడం లేదని తెలుస్తోంది. టీడీపీకి ఒకకేబినెట్, ఒకట్రెండు సహాయ పదవులను ఆఫర్ చేసినట్టు చేసినట్టు సమాచారం. జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల డిమాండ్లపై వాటితో చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. -
ఒకే వేదికపై పీఎం మోదీ, సీఎం నితీష్!
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బీహార్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ ఇక్కడకు రావడం ఇదే తొలిసారి. బీహార్‌లోని ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమానాశ్రయానికి వెళ్లనున్నారు. దాదాపు 18 నెలల తర్వాత ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ కలిసి వేదికపై కనిపించనున్నారు. ప్రధాని మోదీతో పాటు సీఎం నితీశ్ కుమార్ ఔరంగాబాద్, బెగుసరాయ్‌లకు వెళ్లనున్నారు. గయ విమానాశ్రయం నుంచి నితీశ్ కుమార్ ముందుగా ప్రధాని మోదీతో కలిసి హెలికాప్టర్లో ఔరంగాబాద్‌కు బయలుదేరుతారు. ఔరంగాబాద్‌లో రూ. 21,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రధానమంత్రి బెగుసరాయ్‌లో ర్యాలీలో ప్రసంగించనున్నారు. గ్యాస్‌కు సంబంధించిన రూ.1.48 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ బెగుసరాయ్‌లో ప్రారంభించనున్నారు. ఈ ఇద్దరు ప్రముఖులు చివరిసారిగా 2022, జూలై 12న శాసనసభ శతాబ్ది ఉత్సవాల్లో ఒకే వేదికపై కనిపించారు. -
‘హీ నితీష్డ్ మీ’
న్యూఢిల్లీ: బిహార్ సీఎం నితీశ్ కుమార్ పదేపదే కూటములు మార్చడంపై సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీమ్స్, జోకులు పేలుతున్నాయి. మోసానికి సిసలైన పేరు నితీశ్ అంటూ కొత్త విశేషణాన్ని ఖరారుచేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్‌లో కొన్ని... ‘అతను నన్ను మోసం చేశాడు’ అనడానికి ‘హీ నితీష్డ్ మీ’ అంటూ పలువురు ట్యాగ్ చేస్తున్నారు. ‘‘బీసీసీఐ కొత్త తరహా క్రికెట్ టోర్నమెంట్ ఫార్మాట్ తేనుంది. అదేంటంటే మ్యాచ్ మధ్యలో కెప్టెన్లు మారిపోతారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠ. ఆదాయానికి ఆదాయం. వరల్డ్ కప్ లాగా అది ‘నితీశ్ కప్’ అని ఒక పాత్రికేయుడు ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. కార్పోరేట్ ప్రపంచంలో సీఈవోలకు నితీశ్ కుమార్ ఒక ఆదర్శనీయుడు. తొమ్మిదిసార్లు ‘కంపెనీ’ల విలీనాలు, టేకోవర్ల తర్వాత కూడా ఈయనే సీఈవోగా కొనసాగడం అద్భుతం’ అని మరో యూజర్ ట్వీట్‌చేశారు. కూటముల మధ్య తెగ ‘పల్టీలు కొట్టే పుత్రుడు’ని కన్నందుకు ‘పాటలీపుత్ర’కు ఆ పేరు వచ్చిందని మరొకరు కొత్త భాష్యమిచ్చారు. ‘‘జాతీయ రహదారులపై యూటర్న్ గుర్తు తీసేసి అక్కడ నితీశ్ ఫొటో పెట్టాలని కేంద్ర రహదారుల మంత్రి ఆదేశించారు’’ అని మరొకరు ట్వీట్‌చేశారు. బిహార్‌లో మహాఘట్బంధన్ కూటమికి చరమగీతం పాడి బీజేపీతో నితీశ్ జట్టు కట్టిన విధానాన్ని ఐదు అంశాల్లో నెటిజన్లు సరికొత్తగా నిర్వచించారు. 1. ఎటంటే అటు మారేలా అనువుగా ఉండాలి. 2. సరిగ్గా సరైన సమయం చూసి అటువైపు దూకేయాలి. 3. అదే సమయంలో పాత మిత్రులతో సత్సంబంధాలు కొనసాగించాలి. 4. చెడిపోయిన స్నేహాన్ని చిగురింపజేయాలి. 5. కొత్త అవకాశం చేతికొచ్చాకే పాత మిత్రుల చేయి వదిలేయాలి. గవర్నర్ బిత్తరపోయిన వేళ! ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి వెళ్లిన నితీశ్, 15 నిమిషాల్లోపే తిరిగి రాజ్‌భవన్‌కు రావడం చూసి గవర్నర్ షాకయ్యారంటూ సరదా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అదేమంటే, రాజ్‌భవన్‌లో మర్చిపోయిన తన మఫ్లర్(స్కార్ఫ్)ను తీసుకోవడం కోసం నితీశ్ వెనుదిరిగి వస్తారు. అది చూసి గవర్నర్ బిత్తరపోతారు. ‘ఈసారి కూటమికి గుడ్‌బై చెప్పడానికి నితీశ్‌కు 18 నెలలు టైమ్ పట్టింది. ఇప్పుడేమిటి మరీ 15 నిమిషాల్లోపే మళ్లీ వచ్చారా?’ అని గవర్నర్ షాక్‌కు గురయ్యారంటూ కాంగ్రెస్ వ్యంగ్యంగా ట్వీట్‌చేసింది. ‘‘వెంటవెంటనే రాజీనామాలు, ప్రమాణాలతో నితీశ్ రాజకీయ రంగు మారుస్తున్నారు. ఈయనను చూసి ఊసరవెల్లి కూడా కొత్త రంగును వెతుక్కోవాల్సి వస్తోంది. ఆయారామ్ గయారామ్ బదులు ఇక ఆయా నితీశ్ గయా నితీశ్ అనుకోవాలి’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. -
Bihar political crisis: మళ్లీ కూటమి మారిన నితీశ్
పట్నా: బిహార్ రాజకీయ రగడకు ఊహించిన విధంగానే తెర పడింది. గోడదూకుళ్లకు పెట్టింది పేరైన జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మళ్లీ కూటమి మారారు. ఆదివారం ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు చరమగీతం పాడారు. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తద్వారా 72 ఏళ్ల నితీశ్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ బీజేపీ చీఫ్ సమ్రాట్ చౌధరి, పార్టీ నేత విజయ్‌కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. నితీశ్ చర్యపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పారీ్టలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల ని్రష్కమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘ఆయన ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. ఎన్డీఏలోకి వెళ్లడం ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలు, ఆయన కుమారుడు తేజస్వి కూడా నాకు చెప్పారు. కానీ ఇండియా కూటమి చెదిరిపోకుండా ఉండాలని నేను బయటికి చెప్పలేదు’’ అన్నారు. ఆట ఇప్పుడే ఆరంభమైందని తేజస్వి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) మట్టి కరవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు. నితీశ్‌ది ద్రోహమంటూ సీపీఐ (ఎంఎల్) దుయ్యబట్టింది. గోడ దూకుడుకు పర్యాయపదంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్సీపీ (శరద్ పవార్) ఎద్దేవా చేసింది. ‘‘స్నోలీగోస్టర్ (విలువల్లేని వ్యక్తి) పదం నితీశ్‌కు బాగా సరిపోతుంది. ఇదే వర్డ్ ఆఫ్ ద డే’’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చమత్కరించారు. పదేపదే కూటములు మార్చడం నితీశ్‌కు పరిపాటేనని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. జేడీ(యూ) మాత్రం కాంగ్రెస్ స్వార్థపూరిత వైఖరి వల్లే నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని చెప్పుకొచి్చంది. కొత్త సర్కారుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహారీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక ఎటూ వెళ్లను: నితీశ్ అంతకుముందు ఆదివారం రోజంతా పట్నాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఉదయమే జేడీ(యూ) శాసనసభా పక్షం నితీశ్ నివాసంలో భేటీ అయింది. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కును ఆయనకు కట్టుబెడుతూ తీర్మానించింది. వెంటనే నితీశ్ రాజ్‌భవన్‌కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా సమరి్పంచారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మహాఘట్బంధన్లో పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్లే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్‌కు మద్దతిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఆ వెంటనే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాల్సిందిగా గవర్నర్‌ను నితీశ్ కోరడం, సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత నితీశ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏను వీడి ఇకపై ఎటూ వెళ్లేది లేదని చెప్పుకొచ్చారు. ఆయన తమ సహజ భాగస్వామి అని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. జేడీ(యూ)తో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో మొత్తం 40 సీట్లనూ స్వీప్ చేస్తామని అన్నారు ఇండియా కూటమికి చావుదెబ్బ! తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇచి్చన ఇటీవలి షాక్‌లకు ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి నితీశ్ తాజా ని్రష్కమణతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో అన్ని స్థానాల్లోనూ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడం తెలిసిందే. పంజాబ్‌లోనూ ఆప్‌ది ఒంటరిపోరేనని రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కూడా అదే రోజు స్పష్టం చేశారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
కూటమిని కాపాడుకుంటాం: ఖర్గే
కలబురిగి(కర్ణాటక): బిహార్‌లో సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీ(యూ) ఇండియా కూటమిని వీడి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరనుందన్న వార్తలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే తపన ఉన్నవారు కచ్చితంగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరని తమ పార్టీ భావిస్తోందని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమిని ఐక్యంగా నిలిపి ఉంచేందుకు కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
Bihar Politics: రేపే ఎన్డీఏలోకి నితీశ్?
పట్నా/న్యూఢిల్లీ: బిహార్ రాజకీయం రసకందాయంలో పడింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్బంధన్ సంకీర్ణానికి జేడీ(యూ) సారథి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుడ్‌బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి ఆయన కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారమే నితీశ్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చని జేడీ(యూ) వర్గాలంటున్నాయి. రాష్ట్ర బీజేపీ అగ్ర నేత సుశీల్‌కుమార్ మోదీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందని సమాచారం. ‘‘(నితీశ్‌కు ఇంతకాలంగా బీజేపీలోకి) మూసుకుపోయిన తలుపులు తెరుచుకోవచ్చు. రాజకీయాంటేనే అవకాశాల ఆటస్థలి. కనుక ఏదైనా సాధ్యమే’’ అంటూ శుక్రవారం సుశీల్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. బిహార్ తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, సుశీల్‌కుమార్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి వచ్చారు. ఈ నేపథ్యంలో జేడీ(యూ)ను ఎన్డీఏలోకి తీసుకోవడంపై శని, ఆదివారాల్లో బిహార్ బీజేపీ రెండు రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఆదివారమే పొత్తు నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. ఆ రోజు ఉదయమే జేడీ(యూ) ఎమ్మెల్యేలతో నితీశ్ సమావేశం కానుండటం విశేషం! మరోవైపు 10 మంది దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో కలకలం రేపుతున్నాయి. నితీశ్ స్పష్టత ఇవ్వాలి: ఆర్జేడీ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామి అయిన ఆర్జేడీతో నితీశ్‌కు విభేదాల నేపథ్యంలో బిహార్‌లో రెండు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఎన్డీఏలో చేరతారన్న వార్తలు గురువారం కలకలం రేపాయి. జేడీ(యూ) ని్రష్కమిస్తే సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. దాన్ని కాపాడుకునేందుకు అవసరమైన 8 మంది ఎమ్మెల్యేల కోసం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలున్న ఎన్డీఏ భాగస్వామి హిందూస్తానీ అవామ్ మోర్చా చీఫ్ జితిన్‌రామ్ మాంఝీతో శుక్రవారం మంతనాలు జరిపారు. మాంఝీ మాత్రం నితీశ్ కూడా త్వరలో ఎన్డీఏలోకి వస్తారని మీడియాతో చెప్పుకొచ్చారు! ఘట్బంధన్ సర్కారు ఒకట్రెండు రోజుల్లోనే కుప్పకూలడం ఖాయమని ఆయన కుమారుడు సంతోష్ జోస్యం చెప్పారు. మొత్తం ఉదంతంపై నితీశ్ తక్షణం స్పష్టమైన ప్రకటన చేసి ఊహాగానాలకు తెర దించాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కోరడం విశేషం. -
Lok Sabha polls 2024: బీజేపీ వైపు... నితీశ్ చూపు!
పట్నా/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి రెండు రోజుల్లోనే మూడో భారీ ఎదురుదెబ్బ! కీలక భాగస్వామి అయిన జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కూటమికి కటీఫ్ చెప్పేలా కని్పస్తున్నారు. అవసరార్థపు గోడ దూకుళ్లకు పెట్టింది పేరైన ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట యూ టర్న్ తీసుకుని మళ్లీ బీజేపీతో జట్టు కట్టే దిశగా సాగుతున్నారు. ఈ దిశగా బుధవారం నుంచీ జరుగుతున్న వరుస పరిణామాలతో బిహార్‌లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్, వామపక్షాల మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు కూడా కుప్పకూలేలా కన్పిస్తోంది. ఘట్‌బంధన్‌తో 18 నెలల కలహాల కాపురానికి ఫుల్స్టాప్ పెట్టి బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం కాపాడుకునే ప్రయత్నాలకు నితీశ్ పదును పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రతిగా ఆర్జేడీ కూడా జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా మెజారిటీ సాధనకు ప్రయత్నాలకు పదును పెట్టింది. ఈ దిశగా జేడీ(యూ) సీనియర్ నేతలతో నితీశ్ ఇంట్లో, ఘట్‌బంధన్‌లోని ఇతర పక్షాలతో ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ నివాసంలో పోటాపోటీ సమావేశాలతో గురువారం బిహార్ రాజధాని పట్నాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నితీశ్ నివాసంలో భేటీలో జేడీ(యూ) ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. ఇక లాలు ఒకవైపు తన నివాసంలో భేటీ జరుగుండగానే మరోవైపు ఆర్జేడీకే చెందిన అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరితో కూడా ఫోన్లో మంతనాలు జరిపారు. దాంతో నితీశ్ మరింత అప్రమత్తయ్యారు. ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకు చాన్సివ్వకుండా అవసరమైతే అసెంబ్లీని రద్దు చేయాలని కూడా ఆయన యోచిస్తున్నట్టు చెబుతున్నారు! లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని, ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్‌లో ఆప్‌దీ ఒంటరి పోరేనని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ బుధవారం ప్రకటించడం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా డీలా పడ్డ ఇండియా కూటమిలో బిహార్ తాజా పరిణామాలు మరింత కలవరం రేపుతున్నాయి. నితీశ్ బీజేపీ గూటికి చేరితే విపక్ష కూటమి దాదాపుగా విచి్ఛన్నమైనట్టేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు రెండు రోజుల విరామమిచ్చి ఢిల్లీ చేరిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఈ పరిణామాలన్నింటిపై పార్టీ నేతలతో మంతనాల్లో మునిగిపోయారు. మరోవైపు బిహార్ బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అశ్వినీ చౌబేతో పాటు జేడీ(యూ) రాజకీయ సలహాదారు కేసీ త్యాగి కూడా ఒకే విమానంలో హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. దాంతో హస్తినలోనూ రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. ఆదినుంచీ కలహాల కాపురమే... బిహార్‌లో 2020లో ఏర్పాటైన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు నిత్యం కలహాలమయంగానే సాగుతూ వస్తోంది. ముఖ్యంగా తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలని లాలు కొంతకాలంగా పట్టుబడుతుండటంపై నితీశ్ గుర్రుగా ఉన్నారు. జేడీ(యూ) తాజా మాజీ అధ్యక్షుడు లలన్ సింగ్ సాయంతో ఆ పార్టీ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసేందుకు లాలు ఇటీవల గట్టి ప్రయత్నమే చేశారు. దాన్ని సకాలంలో పసిగట్టిన నితీశ్ లలన్‌కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ ఉదంతంతో ఆర్జేడీతో విభేదాలు తారస్థాయికి చేరాయి. లాలు, నితీశ్‌లిద్దరికీ రాజకీయ గురువైన బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం నితీశ్ చేసిన వ్యాఖ్యలు విభేదాలకు మరింతగా ఆజ్యం పోశాయి. పారీ్టల్లో కుటుంబాల పెత్తనాన్ని కర్పూరి తీవ్రంగా వ్యతిరేకించేశారన్న నితీశ్ వ్యాఖ్యలు ఆర్జేడీని ఉద్దేశించినవేనంటూ లాలు కుటుంబం మండిపడింది. నితీశ్ అవకాశవాది అని తూర్పారబడుతూ లాలు కుమార్తె రోహిణీ ఆచార్య ఎక్స్‌లో పెట్టిన పోస్టులతో పరిస్థితి రసకందాయంలో పడింది. నితీశ్‌పై ఆమె విమర్శలను రాష్ట్ర బీజేపీ అగ్ర నేతలు తీవ్రంగా ఖండించడం, ఆ వెంటనే ఆ పారీ్టతో జేడీ(యూ) దోస్తీ అంటూ వార్తలు రావడం... నితీశ్, లాలు నివాసాల్లో పోటాపోటీ సమావేశాల తదితర పరిణామా లు వెంటవెంటనే జరిగిపోయాయి. గిరిరాజ్ చెణుకులు పదేపదే ఆర్జేడీపై అలగడం నితీశ్‌కు పరిపాటేనంటూ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నేత గిరిరాజ్‌సింగ్ విసిరిన చెణుకులు గురువారం వైరల్‌గా మారాయి. ‘‘నే పుట్టింటికి వెళ్లిపోతా. నువ్వు చూస్తూ ఉండిపోతావ్ అని పాడుతూ లాలును నితీశ్ చీటికీమాటికీ బెదిరిస్తుంటారు. కానీ పుట్టింటి (బీజేపీ) తలుపులు తనకు శాశ్వతంగా మూసుకుపోయాయన్న వాస్తవాన్ని మాత్రం దాస్తుంటారు’’ అంటూ తాజా పరిణామాలపై గిరిరాజ్ స్పందించారు. గోడదూకుళ్లలో ఘనాపాఠి రాజకీయ గాలికి స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా మంచినీళ్ల ప్రాయంగా కూటములను మార్చడంలో నితీశ్‌కుమార్ సిద్ధహస్తుడు. దాంతో ఆయన్ను పల్టూ (పిల్లిమొగ్గల) కుమార్‌గా పిలవడం పరిపాటిగా మారింది. బీజేపీ వాజ్‌పేయీ, అడ్వాణీల సారథ్యంలో సాగినంత కాలం ఆ పారీ్టతో నితీశ్ బంధం అవిచి్ఛన్నంగా సాగింది. వారి శకం ముగిసి నరేంద్ర మోదీ తెరపైకి రావడంతో పొరపొచ్ఛాలు మొదలయ్యాయి. ఆయన్ను ప్రధాని అభ్యరి్థగా ప్రకటించడంతో బీజేపీతో 17 ఏళ్ల బంధానికి 2013లో తొలిసారిగా గుడ్‌బై చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత బిహార్ సీఎంగా తప్పుకుని జితిన్‌రాం మాంఝీని గద్దెనెక్కించారు. తన బద్ధ విరోధి అయిన లాలు సారథ్యంలోని ఆర్జేడీతో పొత్తు ద్వారా సర్కారును కాపాడుకున్నారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాఘట్‌బంధన్‌గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు. కానీ సంఖ్యాబలంలో ఆర్జేడీ పెద్ద పారీ్టగా అవతరించడంతో నితీశ్ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. లాలు కుమారుడు తేజస్విని అయిష్టంగానే డిప్యూటీ సీఎం చేయాల్సి వచి్చంది. రెండేళ్లలోపే కూటమిలో పొరపొచ్ఛాలు పెద్దవయ్యాయి. సరిగ్గా అదే సమయంలో లాలు, తేజస్విలపై సీబీఐ కేసులు నితీశ్‌కు అందివచ్చాయి. డిప్యూటీ సీఎం పోస్టుకు రాజీనామా చేసేందుకు తేజస్వి ససేమిరా అనడంతో తానే సీఎం పదవికి రాజీనామా చేసి 2017లో కూటమి సర్కారును కుప్పకూల్చారు. గంటల వ్యవధిలోనే బీజేపీ మద్దతుతో మళ్లీ గద్దెనెక్కి ఔరా అనిపించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంతో నితీశ్ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఈసారి బీజేపీ పెద్ద పారీ్టగా అవతరించడంతో ఏ విషయంలోనూ తన మాట సాగక ఉక్కపోతకు గురయ్యారు. చివరికి జేడీ(యూ)ను చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022 ఆగస్టులో దానికి గుడ్‌బై చెప్పారు. మర్నాడే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాఘట్బంధన్ సర్కారు ఏర్పాటు చేసి సీఎం పీఠం కాపాడుకున్నారు. తాజాగా నితీశ్ మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు నిజమైతే ఇది ఆయనకు ఐదో పిల్లిమొగ్గ అవుతుంది! తెరపైకి మెజారిటీ లెక్కలు... నితీశ్ బీజేపీ గూటికి చేరతారన్న వార్తల నేపథ్యంలో బిహార్ అసెంబ్లీలో బలాబలాలు మరోసారి తెరపైకొచ్చాయి. 243 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 122. మహాఘట్బంధన్ ప్రస్తుత బలం 159. 45 మంది ఎమ్మెల్యేలున్న జేడీ(యూ) ని్రష్కమిస్తే ఆర్జేడీ (79), కాంగ్రెస్ (19), వామపక్షాల (16)తో కూటమి బలం 114కు పడిపోతుంది. అప్పుడు మెజారిటీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హెచ్ఏఎం (4), మజ్లిస్ (1), స్వతంత్ర ఎమ్మెల్యే (1) మద్దతు కూడగట్టినా 120కే చేరుతుంది. మెజారిటీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి. ఈ నేపథ్యంలో మాంఝీ తదితరులతో పాటు జేడీ(యూ) అసంతృప్త ఎమ్మెల్యేలతో కూడా ఆర్జేడీ చీఫ్ లాలు జోరుగా మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీకి చెందిన స్పీకర్ పాత్ర కూడా కీలకంగా మారేలా కన్పిస్తోంది. మరోవైపు బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కును అలవోకగా దాటేస్తాయి. తద్వారా తానే సీఎంగా కొనసాగాలని నితీశ్ భావిస్తున్నట్టు సమాచారం. కానీ అందుకు బీజేపీ సుముఖంగా లేదని, తమకే సీఎం చాన్సివ్వాలని భావిస్తోందని చెబుతున్నారు. అందుకు నితీశ్ అంగీకరించే పక్షంలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
పెద్ద పదవులు కోరుకోవడం లేదు: నితీశ్
పాట్నా: గత వారం ఢిల్లీలో జరిగిన విపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పట్ల తాను అసంతృప్తితో ఉన్నానంటూ వెలువడిన వార్తలను బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ ఖండించారు. తమ కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యరి్థగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్ సోమవారం పాటా్నలో మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా తనకు పెద్ద కోరికలేవీ లేవని తెలిపారు. పెద్ద పదవులను తాను ఆశించడం లేదన్నారు. ‘ఇండియా’ కూటమి నిర్ణయాలపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఉద్ఘాటించారు. జేడీ(యూ) నేతల మధ్య తీవ్ర విభేదాలున్నాయన్న ప్రచారాన్ని నితీశ్ కొట్టిపారేశారు. పారీ్టలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. -
నితీశ్ సిగ్గుపడాలి: ప్రధాని నరేంద్ర మోదీ
దమోహ్/గుణ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సాక్షాత్తూ అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మహిళలను దారుణంగా అగౌరవపర్చినా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరు విప్పడం లేదని, కనీసం ఖండించడం లేదని తప్పుపట్టారు. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పట్ల నితీశ్ సిగ్గుపడాలని అన్నారు. తల్లులు, అక్కచెల్లెమ్మల పట్ల ఏమాత్రం గౌరవం లేని నాయకులతో ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. మహిళలను చిన్నచూపు చూసే వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు మోదీ సూచించారు. మహిళల గౌరవాన్ని కాపాడడానికి తాను చేయాల్సిందంతా చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని దమోహ్, గుణ పట్టణాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తనకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఏ కోర్టుకు వెళ్లినా సరే ఉచిత రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. ప్రతి ఇంట్లోనూ సౌర విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇంట్లో వాడుకున్న తర్వాత మిగిలిన కరెంటును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో ప్రతి పౌరుడూ విద్యుత్ ఉత్పత్తిదారుడే అవుతారని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడంతో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ రూ.80 వేల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. ‘ఉచిత రేషన్’ పొడిగింపుపై కాంగ్రెస్ అక్కసు పేదల ప్రజలకు ఉచిత రేషన్ సరుకుల పంపిణీ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తామంటూ తాను హామీ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జీరి్ణంచుకోలేకపోతున్నారని, అందుకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. వారిని ఆ పాపం చేయనిద్దామని అన్నారు. తాను మాత్రం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటానని చెప్పారు. 80 కోట్ల మందికి వచ్చే ఏదేళ్లపాటు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వబోతున్నామని తెలిపారు. తనను చాలామంది ఇష్టానుసారంగా దూషిస్తున్నారని, అయిప్పటికీ అవినీతిపై పోరాటం ఆపబోనని తేల్చిచెప్పారు. ఎవరెంత తిట్టుకున్నా తాను లెక్కచేయనని అన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రులు బెట్టింగ్‌ల్లో భాగస్వాములవుతున్నారని, నల్లధనం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం తాము 2014లో అధికారంలోకి వచ్చాక ఐదో స్థానానికి చేరుకుందని, 200 ఏళ్లపాటు మన దేశాన్ని పరిపాలించిన ఇంగ్లాండ్‌ను వెనక్కి నెట్టేశామని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచమంతా సంభ్రమాశ్చర్యాలతో మనవైపు చూస్తోందని అన్నారు. తాను మూడోసారి ప్రధానమంత్రి కావడం తథ్యమని, భారత్‌ను ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘85 శాతం కమిషన్ వ్యవస్థ’ మళ్లీ అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్ వల్లే ‘ఇండియా’లో వేడి తగ్గింది: నితీశ్ కుమార్
పట్నా: విపక్ష ‘ఇండియా’ కూటమి స్తబ్ధుగా మారిపోయిందని, ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ పారీ్టయే అందుకు కారణమని జేడీ(యూ) సీనియ ర్ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మునిగిపోయిందని, దాంతో ఇండియా కూటమిలో వేడి తగ్గిందని అన్నా రు. గురువారం బిహార్ రాజధాని పట్నాలో సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన సభలో నితీశ్ ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ పాలనను వ్యతిరేకించే పారీ్టలు ఒకే వేదికపైకి వచ్చాయని, ఆ కూటమిలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. -
ముందస్తును కొట్టిపారేయలేం: నితీశ్
పట్నా: దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఏకమవుతుండడం అధికార బీజేపీకి కలవరం కలిగిస్తోందని చెప్పారు. విపక్ష కూటమి పూర్తిగా బలం పుంజుకోకముందే ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో అధికార పక్షం ఉండొచ్చని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఐచ్ఛికం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని గుర్తుచేశారు. -
23న విపక్ష పార్టీల భేటీ.. కేసీఆర్‌కు అందని ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే కార్యాచరణ సిధ్దం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఏర్పాటు చేసిన ప్రతిపక్ష అగ్రనేతల సమావేశం ఈ నెల 23న పాట్నాలో జరుగనుంది. ఈ నెల 12నే విపక్ష నేతల సమావేశం జరగాల్సి ఉన్నా, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ముఖ్య నేతలు అందుబాటులో లేకపోవడంతో ఈ భేటీని 23న నిర్వహించనున్నట్లు జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ ప్రకటించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ–ఎంఎల్ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్యలు హాజరు కానున్నారు. కాగా ఈ భేటీకి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు జేడీయూ నేతలు ఆహ్వానం పంపలేదు. గత ఏడాది ఆగస్టులో బిహార్‌లో నితీశ్‌కుమార్‌తో భేటీ నిర్వహించిన కేసీఆర్, బీజేపీ ముక్త్ భారత్ౖMðకలిసి పోరాడతామని ప్రకటించారు. అయితే అనంతరం వివిధ కారణాలతో రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరుగలేదు. తాజా భేటీకి ఆహ్వానం పంపలేదు. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ తీసుకునే అంశంపై చర్చించనున్నారు. హాజరవుతున్నా: శరద్ పవార్ బిహార్ సీఎం నితీశ్‌కుమార్ బుధవారం తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని, విపక్షాల భేటీకి తాను హాజరవుతానని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ గురువారం తెలిపారు. పలు జాతీయ అంశాలపై కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అది విపక్షాల బాధ్యతని పవార్ అన్నారు. -
12న పట్నాలో విపక్షాల కీలక భేటీ!
పట్నా/కోల్‌కతా: కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అగ్రనేత నితీశ్ కుమార్ తన కార్యాచరణను వేగవంతంగా చేశారు. తమతో కలిసివచ్చే పార్టీల ముఖ్యనాయకులతో రాజధాని పట్నాలో కీలక భేటీ నిర్వహించాలని ఆయన ఇప్పటికే నిర్ణయించారు. ప్రతిపక్షాల సమావేశం వచ్చే నెల 12న జరిగే అవకాశం ఉందని నితీశ్ కుమార్‌కు సన్నిహితుడైన బిహార్ మంత్రి విజయ్‌కుమార్ చౌదరి సోమవారం చెప్పారు. భేటీ తేదీ దాదాపు ఖరారైనట్లేనని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ హాజరవుతాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడం చాలా తేలిక అని అభిప్రాయపడ్డారు. విపక్ష కూటమి ఏర్పాటుకు నితీశ్ కుమార్ చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. హాజరుకానున్న మమతా బెనర్జీ ఈ భేటీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత హాజరయ్యే అవకాశం ఉందని టీఎంసీ నేత చెప్పారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటుతోపాటు బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఆమె సలహాలు సూచనలు ఇస్తారని వెల్లడించారు. పట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశం ఏర్పాటు చేయాలన్న సూచన తొలుత మమత నుంచి రావడం విశేషం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నచోట తాము ఆ పార్టీకే మద్దతు ఇస్తామని మమత గతంలో అన్నారు. -
మిడ్ డే మీల్లో పాము.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత
పాట్నా: బిహార్‌లోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం స్థానికంగా కలకలం సృస్టించింది. అప్పటికే ఆహారాన్ని తిన్న పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అరారియాలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలందరికీ సిబ్బంది కిచిడీ వడ్డించారు. ఈ క్రమంలో ఓ అబ్బాయికి వడ్డించిన ప్లేట్లో పాము కనిపించింది. వెంటనే ఆ ఆహారాన్ని పడవేయగా.. అప్పటికే భోజనం చేసిన పిల్లల ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. కొందరు పిల్లలు వాంతులు చేసుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆహారం తిన్న తర్వాత 100 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. వీరిలో ఆరోగ్యం విషమంగా ఉన్న 25 మంది పిల్లల్ని ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ పిల్లల ఆరోగ్యం కూడా నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. చదవండి:శునకాన్ని చిన్నపాటి కొమ్మతో అదిలించాడు..అంతే అది రెచ్చిపోయి... స్థానిక సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం భోజనం పాఠశాల బయట వంట చేసి దానికి ఓ సప్లయర్ తీసుకువస్తాడు. పాఠశాల యాజమాన్యం తప్పిదం ఏమీ లేదని స్థానిక నాయకులు తెలిపారు. కాగా ఛప్రాలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మే18న బల్లి కనిపించిన ఘటన మరవకముందే ఈ ఘటన జరగడం గమనార్హం చదవండి:బోగీలను వదిలి రైలింజన్ పరుగులు! -
కేంద్రంతో వివాదంలో మా మద్దతు మీకే
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రభుత్వాధికారుల అజమాయిషీ విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ భరోసా ఇచ్చారు. ఆదివారం నితీశ్ ఢిల్లీలో కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఆయన వెంట బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు. ఢిల్లీలోని ప్రభుత్వాధికారులపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ ఈనెల 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం, ఆ తీర్పును పూర్వపక్షం చేసేలా కేంద్రం శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేయడం తెలిసిందే. నితీశ్‌తో చర్చల అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును రాజ్యసభలో తిప్పికొట్టేందుకు మద్దతివ్వాలంటూ అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి కోరుతానన్నారు. రెండు, మూడు రోజుల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్లను కలుస్తానన్నారు. ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడాలంటూ నితీశ్ కుమార్‌కు కూడా విజ్ఞప్తి చేశానన్నారు. -
కూటమిపై విపక్షాల భేటీలో చర్చిస్తాం: నితీశ్
పాట్నా: 2024లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు చేతులు కలిపి, బలమైన కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉందని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అగ్రనేత నితీశ్ కుమార్ శనివారం చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక విపక్ష నేతల భేటీ జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా విపక్షాల ఐక్యత, కూటమి ఏర్పాటుపై విస్తృతంగా చర్చించనున్నట్లు వివరించారు. కొన్ని పార్టీల నాయకులు ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారని, ప్రతిపక్షాల సమావేశ వేదికను ఇంకా ఖరారు చేయలేదని, బిహార్ రాజధాని పాట్నాలో ఈ భేటీ జరిగితే తాను సంతోషిస్తానని అన్నారు. పాట్నాలో నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు సూచించారని గుర్తుచేశారు. విపక్షాలకు ఏకం చేయడమే ధ్యేయంగా ఇప్పటికే వివిధ పార్టీల ముఖ్య నేతలతో మాట్లాడానని, త్వరలో మరికొన్ని బీజేపీయేతర పార్టీల నాయకులను కలిసి చర్చిస్తానని వెల్లడించారు. -
Bihar: నితీశ్ కుమార్‌పై దాడికి యత్నం!
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సోమవారం దాడికి యత్నం జరిగింది. ఔరంగాబాద్ జిల్లాలో సమాధాన్ యాత్ర సందర్బంగా సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. విరిగిన కుర్చీ ముక్కను సీఎం నితీశ్‌పైకి విసిరేశాడు ఓ యువకుడు. అయితే టైంకి ఆయన ఆగిపోవడంతో.. అది పక్కన పడింది. వెంటనే అది గమనించిన ఆయన పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తమై ఆయన్ని రౌండప్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పరుగులు అందుకున్నాడు. ప్రజలతో ఆయన మమేకమై మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓ యువకుడు ఈ దాడికి పాల్పడగా.. పారిపోయిన ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ఉల్లంఘనలకు గానూ అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడి యత్నానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. #WATCH | Bihar: A part of a broken chair was hurled towards Bihar CM Nitish Kumar during Samadhan Yatra in Aurangabad. pic.twitter.com/MqeR6MLnFR — ANI (@ANI) February 13, 2023 -
చావనైనా చస్తా.. కానీ బీజేపీతో మాత్రం చేతులు కలపను..
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తా గానీ, మరోసారి బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వాళ్లది బోగస్ పార్టీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తేజస్వీ యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై కేసు పెట్టి కమలం పార్టీ ఏం సాధించిందని నీతిశ్ నిలదీశారు. 'మేం అటల్ బిహారీ వాజ్‌పేయీ ఫాలోవర్లం. ఆయనతో అంతా బాగుండేది. 2017లో బీజేపీతో జట్టుకట్టాం. తర్వాత విడిపోయాం. నేను సీఎం కావాలనుకోలేదు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టి వాళ్లనే సీఎం పదవి చేపట్టమన్నా. కానీ నన్ను బలవంతంగా ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో మేం ఎలా ఓడిపోయామో మా పార్టీ నేతలు వివరించారు. మా ప్రజల ఓట్లతో వాళ్లు గెలిచారు. మళ్లీ ఎన్నికలు జరిగితే అప్పుడు బీహార్ ప్రజలంటే ఏంటో వాళ్లకు తెలుస్తుంది.' అని నితీశ్ అన్నారు. '2005లో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఎన్ని సీట్లు గెలిచింది. 2010లో ఎన్ని గెలిచింది. అప్పుడు ముస్లిం ఓటర్లు కూడా ఆ పార్టీకి ఓటు వేశారు. 2015లో మాతో విడిపోయాక ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచింది? ఈసారి మా ఓట్లు వేయించుకుని మమ్మల్నే ఓడించింది.' అని నితీశ్ పేర్కొన్నారు. తమకు అటల్ జీ, అద్వానీ అంటే అభిమానమేనని, కానీ ఇప్పుడున్న బీజేపీ పూర్తిగా వేరు అని నితీశ్ వివరించారు. ఈ నాయకులు వచ్చాక మొత్తం మారిందన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన వారిని మర్చిపోవడం తగునా? అని నితీశ్ వ్యాఖ్యానించారు. 2024లో బిహార్‌లో 34 ఎంపీ సీట్లు గెలుస్తామని చెబుతున్న బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని నితీశ్ జోస్యం చెప్పారు. మరోవైపు తాము మరోసారి జేడీయూతో పొత్తు పెట్టకోవద్దని బిహార్ బీజేపీ తీర్మానించింది. నితీశ్‌కు మరోసారి మోసం చేసే అవకాశం ఇవ్వమని చెప్పింది. చదవండి: భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరింది.. మంచులోనే రాహుల్ ప్రసంగం -
జనాభాను నియంత్రించలేం
పాట్నా: జనాభా పెరుగుదలను అరికట్టే విషయంలో బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమ రాష్ట్రంలో స్త్రీలు నిరక్షరాస్యులని, పురుషుల్లో నిర్లక్ష్యం ఎక్కువని, అందుకే జనాభా పెరుగుదలను నియంత్రించలేమని తేల్చిచెప్పారు. సమాధాన్ యాత్రలో భాగంగా ఆయన ఆదివారం వైశాలీలో బహిరంగ సభలో ప్రసంగించారు. మహిళలు చదువుకుంటే జనాభా తగ్గుతుందని, ఇదే వాస్తవమని అన్నారు. గర్భం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అక్షరాస్యులైన మహిళలకు తెలుస్తుందని వెల్లడించారు. జనాభా నియంత్రణపై పురుషులు సైతం దృష్టి పెట్టడం లేదని ఆక్షేపించారు. ఎక్కువ మంది పిల్లలను కనొద్దన్న ఆలోచన వారిలో ఉండడం లేదన్నారు. నితీశ్ కుమార్ వ్యాఖ్యలను ప్రతిపక్ష బీజేపీ నేత సామ్రాట్ చౌదరి తప్పుపపట్టారు. బిహార్ ప్రతిష్టను దెబ్బతీసేలా నితీశ్ మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించారని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
బిహార్ కులకలం
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏ ఇతర పార్టీ చేయని సాహసానికి పూనుకున్నారు. రాష్ట్రంలో కులగణనకి శ్రీకారం చుట్టారు. బడుగు, బలహీన వర్గాలకు శాస్త్రీయ విధానంలో సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే కులాలు లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు. రెండు దశలుగా సాగే ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించారు. దేశ ప్రయోజనాల కోసమే కులగణనను చేపడుతున్నామని, ఓబీసీల అసలు లెక్కలు ఎంతో తేల్చాలన్నదే తమ ఉద్దేశమని నితీశ్ కుమార్ బయటకి చెబుతున్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఈ సంక్లిష్ట ప్రక్రియను మొదలు పెట్టారన్న విమర్శలు మొదలయ్యాయి. కులగణనపై వివిధ వర్గాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. దేశంలో సామాజిక న్యాయం జరగాలంటే, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాల్సిందేనని ఒక వర్గం గట్టిగా పట్టుబడుతోంది. ఓబీసీలకు కేటాయించిన కోటా వారికి సమానంగా పంపిణీ చేయడం కోసం నియమించిన రోహిణి కమిషన్ ఓబీసీల్లో 2,633 కులాలు ఉన్నాయని తేల్చింది. అయితే ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న ఓబీసీల రిజర్వేషన్లలో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వార్డ్ కేస్ట్స్ (ఈబీసీ)లకే అమలవుతున్నాయి. మరోవైపు 21 శతాబ్దంలో కూడా కులాల వారీగా జనాభా లెక్కిస్తే సమాజంలో మరిన్ని చీలికలు వస్తాయని మరో వర్గం వాదనగా ఉంది. ఇంకా కులాల కుంపట్లలోనే మగ్గిపోతూ ఉంటే గ్లోబల్ సూపర్ పవర్‌గా భారత్ ఎదిగే అవకాశాలకు గండిపడుతుందనే అభిప్రాయాలున్నాయి. ఎందుకీ కులగణన? స్వాతంత్య్రానంతరం ఇప్పటివరకు కులాలవారీగా జనాభా లెక్కింపు చేపట్టలేదు. 1990లో కేంద్రంలో జనతాదళ్ ఆధ్వర్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది. జనాభా ప్రాతిపదిక అంటూ ఏమీ లేకుండా 27% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం 1992 నుంచి అమలవుతోంది. ఇప్పటివరకు మన దగ్గరున్న కులాల లెక్కలకు 1931 నాటి గణాంకాలే ఆధారం. వాటి ప్రకారం జనాభాలో ఓబీసీలు 52 శాతం! పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లున్నాయి. అందుకే తమకూ అలాగే రిజర్వేషన్లను పెంచాలని ఓబీసీలు డిమాండ్ చేస్తున్నారు. కుల సమీకరణలు అధికంగా ఉన్న బిహార్‌లో ఓబీసీలే కీలకం. ఓబీసీ నాయకుడైన నితీశ్ మొదట్నుంచి కులగణనకు మద్దతుగా ఉన్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక దాన్ని ఆచరణలో పెట్టి రాజకీయ వేడిని పెంచారు. ఒక్కసారి చరిత్రలోకి చూస్తే.. భారత దేశంలో మొట్టమొదటి సారిగా బ్రిటిష్ ప్రభుత్వం 1871లో కులగణన చేపట్టింది. మన దేశంలో ఉన్న విభిన్న వర్గాల ప్రజల్ని అర్థం చేసుకోవడానికే ఈ ప్రక్రియ మొదలు పెట్టింది. అప్పట్లో సేకరించిన సమాచారం ఆధారంగా కులాలకు ప్రాధాన్యతా క్రమాలను నిర్దేశించింది. అలా మొదలు పెట్టిన కులగణన 1931లో చివరిసారిగా చేశారు. ఆ నాటి జనాభా గణాంకాల ప్రాతిపదికగానే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. స్వాంతంత్య్రానంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ కులగణనకు దూరంగా ఉన్నాయి. పదేళ్లకి ఒకసారి చేసే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల డేటా సేకరణకు మాత్రమే పరిమితమయ్యారు. 2011లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన కులాల వివరాలను కూడా సేకరించింది. కానీ వాటిని విడుదల చేయలేదు. ప్రస్తుతం కేంద్రంలో సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భూమిక యూపీఏ హయాంలో జరిగిన కులగణన సరిగా జరగలేదని, అదంతా తప్పులతడకగా సాగిందని చెబుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులకు ఆ డేటా పాతబడిపోయిందని వివరించారు. లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం ఎంత ? బిహార్‌లో కులగణన పూర్తయి లోక్‌సభ ఎన్నికల కంటే ముందే నివేదిక వస్తే నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్లకే అత్యధికంగా లాభం చేకూరే అవకాశాలే కనిపిస్తున్నాయి. బిహార్‌లో ఓబీసీల్లో మరింతగా వెనుకబడిన వారైన అత్యంత వెనకబడిన తరగతులు(ఈబీసీ), దళితుల్లో మరింత అణగారిన మహాదళితుల కార్డుతో కొత్త సామాజిక సమీకరణలకి తెరతీసిన నితీశ్ రాజకీయంగా లబ్ధి పొందుతూ వస్తున్నారు. వీరి వాస్తవ సంఖ్య వెల్లడైతే ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఆయన పై చేయి సాధించవచ్చు. మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలు, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే వంటి పార్టీలు కులగణనకు మద్దతుగా ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టాలన్న స్వరం పెరుగుతుంది. ఇప్పుడు బిహార్‌లో ఓబీసీ జనాభా ఎంత ఉందో వాస్తవాలు వెల్లడైతే వారి ఓటు బ్యాంకే ప్రధానంగా కలిగిన ప్రాంతీయ పార్టీలు బలపడతాయి. ఇది జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీలైన బీజేపీకి, కాంగ్రెస్‌కు కూడా ఎదురు దెబ్బగా పరిణమిస్తుంది. అంతే కాకుండా దేశంలో మరోసారి మండల్ వర్సెస్ కమండల్ రాజకీయాలకు తెరలేవచ్చు. 1990 దశకంలో బీజేపీ నేత అద్వానీ రథయాత్రకు కౌంటర్‌గా మండల్ కమిషన్ నివేదికతో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం దేశవ్యాప్తంగా హింసకు దారి తీసింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను మినహాయించి మిగిలిన కులాల జనగణన సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇప్పుడు నితీశ్ కుమార్ చేపట్టిన ప్రక్రియ జాతీయ రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్‌డెస్క్ -
‘మీ నవ భారత జాతిపిత దేశానికి ఏం చేశారో చెప్పండి?’
పట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నవ భారత జాతిపితగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ అభివర్ణించిన విషయం తెలిసింది. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. నవీన భారత జాతి పిత దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. ‘వారు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడలేదు. ఆర్ఎస్ఎస్ కూడా స్వాతంత్య్ర పోరాటం చేయలేదు. అయినా, నవీన భారత జాతిపితగా పేర్కొన్నట్లు విన్నాం. అసలు నవీన భారత్‌కు సరికొత్త జాతి పిత ఏం చేశారు? ’ అనిఘాటుగా స్పందించారు నితీశ్ కుమార్. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే తనకు ఎటువంటి సమస్య లేదని పేర్కొన్నారు నితీశ్. తాను ప్రధాని కావాలని కోరుకోవడం లేదని పునరుద్ఘాటించారు. అన్ని మిత్ర పక్షాలతో మాట్లాడి వారు ఈ అంశాన్ని ప్రకటించాలని, ప్రస్తుతం నేతలంతా భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారని గుర్తు చేశారు. బిహార్ విద్యాశాఖలో ఉద్యోగులకు నియామక పత్రాలు అంద జేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మరోవైపు.. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సైతం అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీతో ఎవరినీ పోల్చలేమని స్పష్టం చేశారు. ‘జాతిపితతో ఎవరినీ పోల్చలేం. వారి(బీజేపీ) సరికొత్త భారత్ కేవలం కొద్ది మంది ధనవంతుల కోసం మాత్రమే ఏర్పడింది. మిగిలిన ప్రజలు ఇంకా పేదరికంలోకి వెళ్లారు. క్షుద్భాతతో అలమటిస్తున్నారు. ఇలాంటి సరికొత్త ఇండియా మాకు అవసరం లేదు’అని స్పష్టం చేశారు. #WATCH | They had nothing to do with the fight for Independence. RSS didn't have any contribution towards the fight for Independence...we read about the remark of 'New father of nation'...what has the 'new father' of 'new India' done for nation?: Bihar CM Nitish Kumar (31.12) pic.twitter.com/5RdJmrasIP — ANI (@ANI) January 1, 2023 ఇదీ చదవండి: ఆ వ్యాఖ్య ప్రధాని మోదీని అవమానించడమే: సంజయ్ రౌత్ ధ్వజం -
బిహార్ సీఎం నితీశ్ దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసా?
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన ఆస్తుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరిచారు. వీటి ప్రకారం ఆయన వద్ద మొత్తం రూ.75.53 లక్షలు విలువ చేసే స్థిరాస్థులు చరాస్థులు ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈ మొత్తం రూ.18,000 పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం నితీశ్ కుమార్ వద్ద రూ.28,135 క్యాష్ ఉంది. బ్యాంకుల్లో మరో రూ.51,586 డిపాజిట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను ప్రతి ఏటా డిసెంబర్ చివర్లో ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరచాలని సీఎం నితీశ్ కొత్త రూల్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మంత్రులంతా తమ ఆస్తుల వివరాలను డిసెంబర్ 31న పొందుపరిచారు. అయితే సీఎం కంటే చాలా మంది మంత్రులు సంపన్నులుగా ఉన్నారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వద్ద రూ.75వేల నగదు(మార్చి 31,2022 వరకు) ఉంది. ఆయన భార్య రాజశ్రీ వద్ద రూ.1.25లక్షల నగదు ఉంది. తేజస్వీ సోదరుడు, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ వద్ద రూ.1.7 లక్షల క్యాష్ ఉంది. ఆయన స్థిరాస్థులు, చరాస్థుల విలువ మాత్రం రూ.3.2కోట్లుగా ఉంది. చదవండి: హై రిస్క్ దేశాల నుంచి వచ్చినవారికి అక్కడ వారం రోజుల క్వారంటైన్ -
తాగి చనిపోతే పరిహారం ఇవ్వాలా?: సీఎం నితీశ్
పాట్నా: బిహార్ సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 60కి పెరిగింది. ఈ విషయంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. కల్తీ మద్యం తాగి చనిపోయిన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. అలాంటి వారిపట్ల సానుభూతి చూపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మద్యం తాగితే చనిపోతారని, తాగాలని ప్రోత్సాహించే వారు మీకు ఎలాంటి మేలు చేయరని సీఎం సభలో అన్నారు. #WATCH | "No compensation will be given to people who died after drinking...We have been appealing- if you drink, you will die...those who talk in favour of drinking will not bring any good to you...", said CM Nitish Kumar in assembly earlier today. (Source: Bihar Assembly) pic.twitter.com/zquukNtRIA — ANI (@ANI) December 16, 2022 అయితే నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిహార్‌లో కల్తీ మద్యం కారణంగా పదుల సంఖ్యలో చనిపోతున్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం 2016 నుంచి అమలు అవుతున్నప్పటికీ.. అక్రమంగా కొందరు సారా విక్రయిస్తున్నారు. ఇది తాగి అమాయకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం తాగితే చస్తారని సీఎం వ్యాఖ్యానించారు. చదవండి: షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి.. -
‘సారా తాగితే చస్తారు’.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్
పట్నా: మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో కల్తీ సారా మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. శరన్ జిల్లాలో బుధవారం కల్తీ సారా కాటుకు 21 మంది బలవగా.. మరో 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయారు. వారంతా మంగళవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఈ అంశం రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. సారాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష బీజేపీ సభ్యులు ఆరోపించారు. వారిపై సీఎం నితీశ్ కుమార్ మండిపడ్డారు. తాగిన వారు చస్తారు.. జాగ్రత్త కల్తీసారా అంశంపై అసెంబ్లీ వేదికగా విపక్షాలపై మడ్డిపడ్డ సీఎం నితీశ్ కుమార్ తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే మద్యం తాగుతారో వారు చనిపోతారు అంటూ పేర్కొన్నారు. ఛాప్రా కల్తీ సారా ఘటనపై మీడియాతో మాట్లాడారు నితీశ్. ‘లిక్కర్ తాగే వారు చనిపోతారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మేము పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాపు(మహాత్మా గాంధీ) ఏం చెప్పారో మీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఏం చెబుతున్నాయి? మద్యం ప్రమాదకరమని ఇంటింటికి తెలియజేస్తున్నాం. చాలా కాలంగా కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతోంది. ప్రజలే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. నిషేధం ఉన్న చోట లిక్కర్ అమ్ముతున్నారంటే.. అందులో ఏదో ఉన్నట్లు అర్థం. కొందరు తెలిసి తప్పులు చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు నితీశ్ కుమార్. ఇదీ చదవండి: మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం -
మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయారు. సభలో ఆందోళనలు చేపట్టిన ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరంతా తాగొచ్చారని గట్టిగా అరిచారు. దీంతో అసెంబ్లీలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిహార్‌లో 2016లోనే మద్యాన్ని నిషేధించారు. అయితే కల్తీ మద్యం మాత్రం విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇది తాగి ఛప్రా సరన్ జిల్లాలో 17 మంది చనిపోయారు. ఇందులో ఆరుగురు మంగళవారమే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపైనే ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంపై విమర్శలు గుప్పించారు. కల్తీ మద్యాన్ని అరికట్టలేకోయిన సీఎం అసెంబ్లీ ద్వారం వద్ద నిల్చొని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో నితీశ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేతల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగింది? కాస్త శాంతియుతంగా ఉండండి. మీరంతా తాగి వచ్చినట్లు ఉన్నారు. అని ఫైర్ అయ్యారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు మళ్లీ నిరసనకు దిగారు. Liquor Ban isn't working... Illegal trader's are selling it Openly... Accept it or Not But Mr. Nitish Kumar is Pushing Bihar Back into JungleRaj.#NitishKumar #Bihar #GOAT𓃵 #NewHigh4TNSports#Messi𓃵 pic.twitter.com/oZ0hC97BhW — Suhani Anand (@SuhaniAnand17) December 14, 2022 ఛప్రా సరన్ జిల్లాలో మంగళవారం చనిపోయిన ఆరుగురి మరణానికి ఇంకా కారణం తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. వీరంతా కల్తీ మద్యం తాగే చనిపోయారనే విషయాన్ని మాత్రం ధ్రువీకరించలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కేబినెట్ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం -
నితీష్ కుమార్ రాజకీయ వారసుడు అతడే! హింట్ ఇచ్చిన బిహార్ సీఎం
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ వారసుడు ఎవరో సూత్రప్రాయంగా తెలిపారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిని ముందుండి నడిపిస్తారని స్పష్టం చేశారు. అధికార ఎమ్మెల్యేలతో మంగళవారం జరిగిన సమావేశంలో ఈమేరకు వ్యాఖ్యానించారు. నేను ప్రధాని అభ్యర్థిని కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థినీ కాదు. బీజేపీని ఓడించడమే నా లక్ష్యం. అని నితీశ్ అన్నారు. తేజస్వీ యాదవ్‌ను ప్రోత్సహించాలని అధికార కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు. సోమవారం కూడా నితీశ్ ఈ విషయంపై పలుమార్లు హింట్ ఇచ్చారు. తేజస్వీ యాదవ్‌తో కలిసి నలందలో డెంటల్ కాలేజీ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ.. మా ప్రభుత్వం చాలా చేస్తోంది. భవిష్యత్తులో ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉంటే వాటిని తేజస్వీ యాదవ్ పూర్తి చేస్తారు. మమ్మల్ని విడదీయాలనుకుంటున్న వారు ఆ ప్రయత్నాలు మానుకోండి. మేం కలిసే ఉంటాం. ఎలాంటి విభేదాలు ఉండవు. అని వ్యాఖ్యానించారు. దీంతో తేజస్వీ యాదవ్‌ను నితీశ్ తన రాజకీయ వారసుడిగా ప్రకటించారని ప్రచారం ఊపందుకుంది. ఆ మరునాడే ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో నితీశ్ మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది నితీశ్ వ్యాఖ్యలపై తేజస్వీ స్పందించారు. ప్రస్తుతం తన దృష్టంతా 2024 సార్వత్రిక ఎన్నికలపైనే అని, ఆ తర్వాతే మిగతా విషయాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. చదవండి: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు బెదిరింపులు.. మళ్లీ అతడే..! -
‘రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేయాలి’
పట్నా: దేశంలో రిజర్వేషన్లపైనున్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% కోటాను సమర్థించడంపై నితీశ్ హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు తాము ఎప్పుడూ అనుకూలమేనని ప్రకటించారు. ‘సుప్రీం కోర్టు తీర్పు చాలా న్యాయంగా ఉంది. రిజర్వేషన్లకు మేము ఎప్పుడూ అనుకూలమే. అయితే రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయడానికి ఇదే సరైన సమయం. ఈ పరిమితి వల్ల ఓబీసీ, ఈబీసీలకు వారి జనాభాకి అనుగుణంగా అవకాశాలు రావడం లేదు’ అని అన్నారు. దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా గణన చేపట్టాలని ఆయన పునరుద్ఘాటించారు. కుల గణన జాతీయ స్థాయిలో జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇదీ చదవండి: షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా! -
సీఎం నితీశ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బోటు వంతెన పిల్లర్‌ను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. సీఎంతో పాటు ఆయనతో బోటులో ఉన్నవారంతా సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పారు. పాట్నా సమీపంలోని గంగానదిలో బోటు ప్రయాణం చేస్తున్న క్రమంలో శనివారం ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. పాట్నాలోని ఛత్‌గట్‌ను పరిశీలించేందుకు బోటులో ప్రయాణించారు సీఎం నితీశ్. ఆయనతో పాటు పలువురు పార్టీ నేతలు, అధికారులు సైతం బోటులో ఉన్నారు. ఈ క్రమంలో జేపీ సేతు పిల్లర్‌ను బోటు ఢీకొట్టింది. అయితే, బోటు వేగం తక్కువగా ఉండటం వల్ల భారీ స్థాయిలో ఎలాంటి పగుళ్లు ఏర్పడలేదు. దీంతో నీటిలో మునిగిపోయే ప్రమాదం తప్పింది. బోటులో ఉన్న సీఎం నితీశ్‌తో పాటు మిగితా వారంతా క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. Patna | Bihar CM Nitish Kumar's boat collided with a pillar of JP Setu during the inspection of Chhath Ghat situated on the bank of river Ganga today. All onboard the boat including the CM are safe. pic.twitter.com/ga8vusRtjH — ANI (@ANI) October 15, 2022 ఇదీ చదవండి: కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఒకరు మృతి -
మా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలట
సితాబ్ దియారా: తమ జేడీ(యూ) పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చాడని జేడీ(యూ) చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. సామాజికవేత్త జయప్రకాశ్ నారాయణ్ జన్మస్థలి సితాబ్ దియారాలో పర్యటించిన నితీశ్ శనివారం అక్కడి మీడియాతో మాట్లాడారు. ‘ రెండు వారాల క్రితం ప్రశాంత్ కిశోర్ నా వద్దకు వచ్చారు. నేనేం అతడిని పిలవలేదు. జేడీయూను కాంగ్రెస్‌లో కలిపేస్తే మంచిదని నాలుగైదేళ్ల క్రితమే నాకు సలహా ఇచ్చాడు. ఇప్పడేమో చాలాసేపు ఏవోవో అంశాలు మాట్లాడుతున్నాడు. నాకప్పుడే అర్థమైంది ప్రశాంత్ బీజేపీ తరఫున పనిచేస్తున్నాడని ’ అని నితీశ్ చెప్పారు. ‘10–15 రోజుల క్రితం నితీశే నన్ను పిలిచారు. తన జేడీయూ పార్టీకి సారథ్యం వహించాలని కోరారు. నేను తిరస్కరించా. మళ్లీ జేడీయూలో చేరలేనని చెప్పా’ అని మంగళవారం ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించిన నాలుగు రోజులకే నితీశ్ స్పందించడం గమనార్హం. ఐ–ప్యాక్‌కు సారథ్యం వహిస్తూ 2018లో జేడీయూలో చేరిన ప్రశాంత్‌కు జాతీయ పౌరసత్వం సవరణ చట్టంపై నితీశ్‌తో అభిప్రాయ భేదాలొచ్చాయి. దీంతో పార్టీ నుంచి ప్రశాంత్‌ను బహిష్కరించారు. -
‘ప్రధాని’ ఆసక్తి లేదు: నితీశ్
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్ మంగళవారం ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాంలతో భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన సోమవారం దేశ రాజధానికి చేరుకోవడం తెలిసిందే. విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగానే వారితో సమావేశమైనట్టు అనంతరం నితీశ్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకమై విపక్షాల సమష్టి శక్తిని చాటాల్సిన సమయం వచ్చిందన్నారు. అనంతరం సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్ యాదవ్, పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఐఎన్ఎల్డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా తదితరులను కూడా నితీశ్ కలిశారు. తనకు ప్రధాని కావాలని ఉందన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ‘‘ఆ పదవికి నేను పోటీదారు కాను. దానిపై నాకు ఆసక్తీ లేదు’’ అని చెప్పుకొచ్చారు. విపక్షాలన్నింటినీ ఏకం చేయడమే తమ తొలి అజెండా తప్ప ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడం కాదని ఏచూరి చెప్పారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది సమయం వచ్చినప్పుడు తేలుతుందన్నారు. బీజేపీపై పోరులో నితీశ్ కలిసి రావడం దేశ రాజకీయాలకు గొప్ప శుభ సంకేతమని అభిప్రాయపడ్డారు. నితీశ్, కేజ్రీవాల్ భేటీ గంటన్నర పాటు సాగింది. విద్య, వైద్యం తదితర అంశాలతో పాటు ఆపరేషన్ లోటస్, విపక్షాల ఎమ్మెల్యేల కొనుగోలు తదితరాలపై చర్చించినట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం బీజేపీపై పోరాటానికి వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందని రాజా అన్నారు. సోమవారం రాహుల్‌గాంధీతోనూ నితీశ్ భేటీ కావడం తెలిసిందే. 25న ‘బల ప్రదర్శన’ ర్యాలీ నితీశ్, కేసీఆర్, మమత హాజరు! సెప్టెంబర్ 25న హరియాణాలో ఐఎన్ఎల్డీ తలపెట్టిన ర్యాలీని విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మార్చాలని నితీశ్ భావిస్తున్నారు. దానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, అఖిలేశ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, అకాలీదళ్ నేత ప్రకాశ్‌సింగ్ బాదల్ తదితరులను ఐఎన్ఎల్డీ ఆహ్వానించింది. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తదితరులకు కూడా ఆహ్వానాలు పంపుతామని పేర్కొంది. ఈ ర్యాలీలో విపక్ష నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి పలు అంశాలపై లోతుగా చర్చిస్తారని చెప్పుకొచ్చింది. బీజేపీతో జనం విసిగిపోయారని చౌతాలా అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక వాతావరణం స్పష్టంగా కన్పిస్తోందని చెప్పారు. -
ప్రధాని అభ్యర్థి కావాలని ఆశించడంలేదు : బీహార్ సీఎం నితీష్
-
బీజేపీని ఓడిద్దాం రండి
పట్నా: కేంద్రంలో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలని జనతాదళ్(యునైటెడ్) సీనియర్ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. పార్టీలన్నీ తమ మధ్యనున్న విభేదాలను పక్కనపెట్టి, ప్రజా సంక్షేమం కోసం చేతులు కలపాలని అన్నారు. శనివారం బిహార్ రాజధాని పాట్నాలో జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ ప్రసంగించారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం పనిచేయాలన్నదే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. బీజేపీయేతర పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. విపక్షాలన్నీ కలిసి పోరాడితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కేవలం 50 సీట్లకే పరిమితం చేయొచ్చని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయాల్సిన బాధ్యతను నితీశ్‌కు అప్పగిస్తూ జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అలాగే కాషాయ పార్టీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే అసమ్మతి తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని తీర్మానంలో ఉద్ఘాటించారు. అసమ్మతి తెలిపినవారిపై దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సమాజంలో అసహనం, తీవ్రవాదం పెరిగిపోతున్నాయి. దళితులు, గిరిజనులు వేధింపులకు గురవుతున్నారు’’ అని జేడీ(యూ) ఆందోళన వ్యక్తం చేసింది. మోదీకి ప్రత్యామ్నాయం నితీశ్ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నేతగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు బిహార్‌లో అధికార కూటమిలోని జేడీ(యూ) ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ, జాతీయ మండలి సమావేశాలు శనివారం పాట్నాలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరుగున్న ఈ భేటీల్లో తొలిరోజు కీలక అంశాలపై చర్చించారు. నితీశ్‌ను ప్రధాని అభ్యర్థిగా అభివర్ణిస్తూ వేదిక వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘దేశ్ కా నేత కైసా హో.. నితీశ్ కుమార్ జైసా హో’ అంటూ జేడీ(యూ) కార్యకర్తలు నినదించారు. రేపటి నుంచి నితీశ్ ఢిల్లీ పర్యటన! 2024 ఎన్నికల్లో బీజేపీ ఢీకొట్టడానికి విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా నితీశ్ ఈ నెల 5 నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించే అవకాశముంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష నాయకులతో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలాతోపాటు కమ్యూనిస్ట్ నేతలతోనూ ఆయన సమావేశమవుతారని జేడీ(యూ) వర్గాలు తెలిపాయి. బిహార్‌లో బీజేపీతో తెగతెంపుల తర్వాత నితీశ్‌కు ఇదే తొలి ఢిల్లీ పర్యటన. మణిపూర్‌లో జేడీ(యూ)కు షాక్ బీజేపీలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ పట్నా/ఇంఫాల్: జేడీ(యూ)కు మణిపూర్‌లో పెద్ద షాక్ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను, ఏకంగా ఐదుగురు శుక్రవారం అధికార బీజేపీలో చేరారు. వారి విలీనానికి స్పీకర్ ఆమోదం కూడా తెలిపారని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఆ ఎమ్మెల్యేలకు సాదర స్వాగతం పలుకుతున్నట్టు ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎన్.శారదాదేవి సాదర పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో విందు కార్యక్రమంలో సదరు ఎమ్మెలోయేలతో వారు భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పట్ల ప్రజల విశ్వాసానికి, ప్రేమకు ఎమ్మెల్యేల చేరిక సూచిక అని బీరేన్‌సింగ్ ఫేస్బుక్లో పోస్టు చేశారు. 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో తాజా చేరికలతో బీజేపీ బలం 37కు పెరిగింది. ఎమ్మెల్యేలను కొనడమే పనా: నితీశ్ తాజా పరిణామాలపై జేడీ(యూ) నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనేయడం రాజ్యాంగబద్ధమేనా అని బీజేపీని నిలదీశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకోవడమే పనిగా పెట్టుకుందని బీజేపీపై ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలూ బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీలో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మణిపూర్ జేడీ(యూ) అధ్యక్షుడు కుశ్ బీరేన్ చెప్పారు. వారి తీరు రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. -
‘అదే జరిగితే 2024లో పిక్చర్ వేరేలా ఉంటుంది’
పాట్నా: మణిపూర్‌లో జేడీయూకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరటంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. ఈ క్రమంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ప్రతిపక్షాలు ఏకమైతే 2024లో పరిస్థితులు మరోస్థాయిలో ఉంటాయన్నారు. శనివారం సాయంత్రం తలపెట్టిన జేడీయూ రాష్ట్ర ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యేందుకు మణిపుర్ జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారని, అయితే, ఆకస్మికంగా ఆ మరుసటి రోజునే బీజేపీలో చేరటం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ‘ఇది రాజ్యాంగబద్ధమేనా? కొద్ది నెలల క్రితం వారంతా బిహార్‌కు వచ్చారు. బీజేపీ ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. వారు అనుసరించిన తీరు ఎలాంటిది? దానర్థం ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుంటున్నారు. ’ అని ఆరోపించారు. మరోవైపు.. జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ అలియాస్ లలన్ సింగ్ సైతం బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ స్వభావం మరోమారు బయపడిందన్నారు. ‘వారితో మేము కలిసి ఉన్నప్పటికీ అరుణాచల్ ప్రదేశ్‌లోనూ ఇదే చేశారు. ఇప్పుడు మేము కూటమి నుంచి బయటకి వచ్చేశాం. మరోమారు అలాగే చేశారు. 2024లోనే వారికి సరైన గుణపాఠం లభిస్తుంది. 2024 ఎన్నికలపై భయంతోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు. కానీ, ప్రజలు వారిని గమనిస్తూనే ఉన్నారు. బిహార్‌లోనూ ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. ’అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: నితీశ్‌కు ఊహించని షాక్.. బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మెల్యేలు.. -
అందుకే సీట్లు తక్కువొచ్చినా సీఎం పదవి: నితీశ్ కుమార్
పాట్నా: బిహార్‌లో బీజేపీకి టాటా చెప్పి తన పాత స్నేహితులతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. ఈ క్రమంలో బీజేపీ, జేడీయూ మధ్య మాటల యుద్ధం మొదలైంది. నితీశ్ కుమార్ అసలు సీఎం పదవికి తగిన వ్యక్తి కాదంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో 2020లో బీజేపీతో పోలిస్తే తనకు తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం వెనుకున్న కారణాలను బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ వేదికగా వెల్లడించారు నితీశ్ కుమార్. విపక్ష నేతలతో చేతులు కలిపి నితీశ్ ద్రోహం చేశారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ పలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. ‘ 2020 ఎన్నికల్లో బీజేపీతో పోలిస్తే తక్కువ సీట్లు వచ్చినా.. నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాను. కానీ, సీఎం పదవిలో కొనసాగేందుకు నాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. నేనే ముఖ్యమంత్రినని వారు చెప్పారు. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దని చెప్పాను. మీరు ఎక్కువ సీట్లు గెలిచారు.. మీ పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఉండాలని సూచించాను. చివరకు అంగీకరించాను. కానీ, ఆ పదవిని ఒత్తిడిలో చేపట్టాను. నంద్ కిషోర్ యాదవ్‌ను స్పీకర్‌గా చేస్తారని నాకు చెప్పారు. పాత మిత్రుడని.. బావుంటుందని చెప్పాను. కానీ, అతను కాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఓ వ్యక్తిని కింది స్థాయి నుంచి తీసుకొచ్చి కేంద్రంలోకి పంపిస్తే నాకే ద్రోహం చేశాడు.’ అని పేర్కొన్నారు నితీశ్. ముఖ్యమంత్రి రేసులో ఉన్న బీజేపీ నేతలు సుశీల్ కుమార్ మోదీ, ప్రేమ్ కుమార్ పేర్లను సైతం వెల్లడించారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటంపై బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు నితీశ్ కుమార్. 2017లో ఆర్జేడీని వీడి బీజేపీతో చేతులు కలిపిన అంశాన్ని లేవనెత్తుతూ విమర్శలు చేయటంపై స్పష్టత ఇచ్చారు. ‘2017లో వారి నుంచి విడిపోయాను. మీరు చాలా ఆరోపణలు చేశారు. కానీ ఐదేళ్ల గడిచినా వారికి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదు.’ అని స్పష్టం చేశారు నితీశ్. ఇదీ చదవండి: Bihar Floor Test: బల పరీక్షలో నెగ్గిన నితీష్ ప్రభుత్వం.. బీజేపీపై అటాక్ -
బలపరీక్ష రోజే తేజస్వీకి షాక్.. ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు
పాట్నా: బిహార్‌లో నితీశ్ కూమార్ నేతృత్వంలోని మహా గట్బంధన్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న కొన్ని గంటల ముందు ఆర్జేడీ సీనియర్ నేతల ఇళ్లపై దాడులు జరగటం సంచలనంగా మారింది. ముగ్గురు సీనియర్ నేతల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం తనిఖీలు చేపట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా లాలూప్రసాద్ ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పాట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ నివాసం సహా ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ అహ్మద్ అష్ఫాఖ్ కరీమ్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ సుబోధ్ రాయ్ నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. ‘ఈ సోదాలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. అందులో ఎలాంటి అర్థం లేదు. భయంతో మా ఎమ్మెల్యేలు వారితో చేరతారనే కారణంగా చేస్తున్నారు.’అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ సునీల్ సింగ్. ముందే ట్వీట్.. దాడులకు కొన్ని గంటల ముందు ఆర్జేడీ అధికార ప్రతినిధి సీబీఐ దాడులపై ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్‌లో అధికారం కోల్పోవటంపై బీజేపీ కోపంగా ఉందని, అందుకే సీబీఐ, కేంద్ర ఏజెన్సీలతో దాడులు చేపట్టేందుకు సిద్ధమైందన్నారు. బుధవారం కీలకమైన రోజుగా ఆయన పేర్కొనటం గమనార్హం. ఇదీ చదవండి: అవిశ్వాస తీర్మానం పెట్టినా.. రాజీనామా చెయ్యను! బీహార్ స్పీకర్ మొండిపట్టు -
‘అలా జరిగితే బలమైన ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్’
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదుగుతారనే వాదనల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్జేడీ నేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. విపక్షాలు పరిగణనలోకి తీసుకుంటే జేడీయూ నేత నితీశ్ కుమార్ తన సద్భావనతో బలమైన ప్రధాని అభ్యర్థిగా ఎదగగలరని పేర్కొన్నారు. బిహార్‌లో మహాకూటమి అధికారంలోకి రావటాన్ని జంగిల్ రాజ్యం తిరిగి వచ్చిందనే బీజేపీ వాదనలను తిప్పికొట్టారు తేజస్వీ యాదవ్. అలసిపోయి, నక్క ఏడుపులు ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేయటం ఐక్యతకు నిదర్శనమన్నారు. ‘చాలా ప్రతిపక్ష పార్టీలు దేశం ముందున్న పెద్ద సవాలును గుర్తించాయి. అది బీజెపీ ఆధిపత్యం. డబ్బు, మీడియా, ప్రభుత్వ ఏజెన్సీల బలంతో చలాయించే ఆధిపత్యాన్ని భారతీయ సమాజం, రాజకీయాల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నారు. వారు సహకార సమాఖ్య విధానంపై మాట్లాడుతున్నారు. ప్రాంతీయ అసమానతలను బీజేపీ విస్మరిస్తోంది. ఈ విషయంపై బీహార్ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ’ అని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా నితీశ్ సరైన వ్యక్తి అని మీరు అనుకుంటున్నారా? అని అడగగా తనదైన శైలీలో సమాధానమిచ్చారు తేజస్వీ యాదవ్. ‘ఈ ప్రశ్నను గౌరవ నితీశ్ జీకే వదిలేస్తున్నాను. మొత్తం విపక్షాల తరఫున నేను మాట్లాడలేను. కానీ, వారు పరిగణనలోకి తీసుకుంటే నితీశ్ జీ కచ్చితంగా బలమైన అభ్యర్థి అవుతారు. ఆయనకు 37ఏళ్ల పార్లమెంటరీ, పరిపాలన అనుభవం ఉంది. క్షేత్రస్థాయిలో మంచి పేరు ఉంది.’ అని తెలిపారు. ఇదీ చదవండి: ‘2014లో మాదిరిగా 2024లో గెలుస్తారా?’.. ప్రధాని మోదీకి నితీశ్ సవాల్! -
బిహార్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 31 మంది ప్రమాణం
పాట్నా: ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకుని పాత మిత్రులతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. సీఎంగా నితీశ్, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. తాజాగా కేబినెట్ విస్తరణ చేపట్టారు సీఎం నితీశ్ కుమార్. 31 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన మంత్రుల చేత ప్రమాణం చేయించారు గవర్నర్ ఫాగు చౌహాన్. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సైతం ఉన్నారు. బిహార్ కేబినెట్లో మొత్తం 36 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ తరుణంలో కేబినెట్లో తేజస్వియాదవ్ ఆర్జేడీకి 16, నితీశ్ కుమార్ జేడీయూకు 11 స్థానాలు కేటాయించారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా జితిన్ రామ్ మాంఝీకి, మరో ఇండిపెండెట్ అభ్యర్థికి సైతం కేబినెట్ బెర్త్‌లు ఇచ్చారు. Tej Pratap Yadav, RJD leader and brother of Deputy CM Tejashwi Yadav, takes oath as a minister in the Bihar cabinet. #BiharCabinetExpansion pic.twitter.com/68zpjRUuPO — ANI (@ANI) August 16, 2022 ఇదీ చదవండి: బీహార్‌లోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్??.. షిండేలాగే నితీశ్ కూడా.. -
విపక్షాలకు నితీష్ కుమార్ రూపంలో ప్రత్యామ్నాయం దొరికిందా?
బీహార్ తాజా రాజకీయా పరిణామాల ప్రభావం దేశంపైన, తెలుగు రాష్ట్రాలపైన ఏ మేరకు పడుతుంది? బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ పక్షం బీజేపీకి గుడ్ బై చెప్పి మళ్లీ ఆర్జేడి, కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమిలో భాగం అయింది. ఎన్డిఎలో ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ ఇప్పుడు ప్రత్యర్ధి కూటమిలో కూడా సీఎం అయి మరోసారి తన ప్రత్యేకత నిరూపించుకున్నారు. పలు ఆటుపోట్లను చవిచూసిన నితీష్ రాజకీయ చాతుర్యం ఒక విధంగా అసాధారణమైనదే అని చెప్పాలి. చదవండి: గోరంట్ల మాధవ్ వీడియో అంశం: చెత్త వ్యూహంతో టీడీపీ దెబ్బ తిందా? 2024లో నరేంద్ర మోదీ తిరిగి ప్రధాన మంత్రిగా ఎన్నిక కాలేరని చెబుతున్న ఆయన 2014లో కూడా తప్పుడు అంచనాతో బీజేపీకి దూరం అయ్యారు. అయినా బీహారు ప్రజలు ఆయన ఏ కూటమిలో ఉంటే దానికి జై కొట్టారు. మహాకూటమిలో భాగంగా ఉండి 2015లో అధికారంలోకి వచ్చిన నితీష్ , ఆ తర్వాత ఆ కూటమిని వీడి తిరిగి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్.డి.ఎ.కూటమిలో భాగస్వామి అయ్యారు. ఒకప్పుడు మోదీని తీవ్రంగా వ్యతిరేకించినా, తదుపరి ఆయన దగ్గరయ్యారు. 2020 లో బీజేపీతో కలిసి అధికారం సాధించిన నితీష్ ఈసారి ఎన్.డి.ఎ.ని వదలిపెట్టి మహాకూటమిలో భాగస్వామి అయ్యారు. 2025లో సాధారణ ఎన్నికలు వచ్చేవరకు ఇదే కూటమిలో ఉంటారా? మరోసారి కూటమి మారతారా అన్నది అప్పుడే చెప్పలేం. మామూలుగా అయితే ఇన్నిసార్లు కూటములు మార్చే నేతలపై ప్రజలలో, ఇతర రాజకీయ పార్టీలలో వ్యతిరేకత వస్తుంటుంది. కాని నితీష్ రెండు కూటములవారిని ఆకర్షించడం ఆయన ప్రత్యేకత. దానికి కారణం ప్రధానంగా ఆయన వ్యక్తిత్వమే అని చెప్పాలి. అవినీతి ముద్ర లేకుండా పోవడం, బీహార్‌లో సంక్షేమ కార్యక్రమాలకు తగు ప్రాధాన్యం ఇవ్వడం, వీలైనంత అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపించడం వంటి కారణాల వల్ల ఆయనపై ప్రజలలో మరీ ఏవగింపు లేదు. నితీష్ కుమార్ దేశంలో మరే నేత సాధించలేని విధంగా ఎనిమిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. ఒకప్పుడు బలం లేకపోయినా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం అతి కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉండి, మెజార్టీ కొరవడి పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. కాని ఆ తదుపరి కేంద్ర మంత్రిగా ఉంటూ పేరు తెచ్చుకున్నారు. బీజేపీతో కలిసి బీహారులో 2005 లో అధికారంలోకి వచ్చింది మొదలు, మధ్యలో కొద్ది నెలలు మినహా ఇప్పటివరకు ఆయనే సీఎంగా ఉన్నారు. ఆయన ఏ కూటమిలో ఉన్నా, తన సొంత పార్టీ అయిన జేడీయూ ఇతర పార్టీలకన్నా తక్కువ సీట్లే సాధించినా, నితీష్ కుమార్ నే ఆయా కూటములు సీఎంగా ఎన్నుకోవడం విశిష్ట పరిణామం. అదే సమయంలో నితీష్ కుమార్ పై అవకాశవాద రాజకీయాలు చేస్తారన్న విమర్శ కూడా ఉంది. గతంలో మహాకూటమిని వదలి ఎన్డీఏ కూటమిలోకి వచ్చినప్పుడు ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈయనను పాముతో పోల్చారు. సరిగ్గా ఇప్పుడు అదే పద ప్రయోగాన్ని బిజెపి నేతలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, దేశ వ్యాప్తంగా ప్రతిపక్షానికి నితీష్ లో కొద్ది ఆశారేఖలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్దిగా ఫోకస్ చేయడానికి కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్న తరుణంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న తీరుతో నితీష్ ప్రధాని అభ్యర్ధి కావచ్చనే ప్రచారం ఆరంభం అయింది. నితీష్ మనసులో ఇదే ఉద్దేశం గత కొన్నేళ్లుగా ఉన్పప్పటికీ, మోదీ హవా ముందు తలవంచుకుని కామ్ తన పని తాను చేసుకుపోయారు. మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరగనున్నందున ఇప్పుడు మళ్లీ తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మోదీని నితీష్ ఎదుర్కోగలుగుతారా ?లేదా అన్న ప్రశ్న ఉన్నప్పటికీ, స్తూలంగా నితీష్ అభ్యర్ధిత్వాన్ని బీజేపీని వ్యతిరేకించే వివిధ రాజకీయ పక్షాలు ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఈ విషయంలో ఏమి జరుగుతుందో జోస్యం చెప్పలేకపోయినా, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర రాజకీయ పక్షాలలో నితీష్‌కే ఎక్కువగా గుడ్ విల్ ఉన్నట్లు భావించవచ్చు. కాగా నితీష్ రాజకీయ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండవచ్చు అన్న చర్చ కూడా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి కాలంలో బీజేపీపై ఫైట్ చేస్తున్న మొనగాడుగా గుర్తింపు తెచ్చుకునే యత్నం చేస్తున్నారు. ఒక దశలో జాతీయ పార్టీని పెట్టుకుని ప్రధాని రేసులో ఉండాలని కూడా ఆయన ఆశించారు. కాని ప్రాక్టికల్ రాజకీయాలలో అది చాలా కష్టమైనదిగా కనిపిస్తుంది. నితీష్ ఉత్తరాది రాజకీయ నేత అవడం ఒక అడ్వాంటేజ్ కాగా, కేసీఆర్ దక్షిణాది నేత కావడం, తెలంగాణలో కేవలం 17 లోక్ సభ స్థానాలే ఉండడం డిజడ్వాంటేజ్ గా భావించవచ్చు. బీహార్‌లో 40 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. అయితే కేసీఆర్ బీజేపీపై చేస్తున్న పోరాటానికి నితీష్ కుమార్ తాజా నిర్ణయం నైతికంగా బలం చేకూర్చుతుంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో బీజేపీ అనుసరించిన వ్యూహానికి ప్రతిగా బీహార్‌లో నితీష్ ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. తద్వారా ప్రస్తుతానికి తన పార్టీని చీల్చే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడగలిగారు. బీహార్‌లో ఎదురుదెబ్బ తినడంతో తెలంగాణలో బీజేపీ తన గేమ్‌ను చాలా జాగ్రత్తగా ఆడవలసి ఉంటుంది. ప్రధానంగా సీబిఐ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించడంలో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. అది టీఆర్ఎస్కు ధైర్యం ఇచ్చే అంశం అవుతుంది. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్నందున, టీఆర్ఎస్ బీహార్ రాజకీయాలను ప్రచారంలో వాడుకోవచ్చు. బీజేపీని ప్రజా వ్యతిరేకిగా చూపించడానికి ఈ పరిణామాన్ని వాడుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం నితీ ఆయోగ్ సమావేశానికి వెళ్లకుండా కేసీఆర్ బహిష్కరించారు. కేసీఆర్‌తో పాటు నితీష్ కూడా ఆ సమావేశానికి వెళ్లలేదు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో ఇప్పటికే కేసీఆర్ సంబంధాలు పెట్టుకున్నారు. ఇప్పుడు వారితో కలిసి కేసీఆర్ రాజకీయం చేసే అవకాశం ఉంటుంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక రాజకీయంపై పెద్దగా ప్రభావం చూపదుకాని, ఢిల్లీ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు, ముఖ్యమంత్రి జగన్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడవచ్చు. జేడీయూ నిష్క్రమణతో రాజ్యసభలో బీజేపీకి అవసరమైన మెజార్టీకి కొంత తక్కువ సీట్లు ఉన్నాయి. కీలకమైన బిల్లులపై ఓటింగ్ వస్తే వైసీపీపైన, ఒడిషాలోని బీజేడీపైన బీజేపీ ఆధారపడవలసి వస్తుందని ఇప్పటికే విశ్లేషణలు వచ్చాయి. బీహార్‌లో ఈ సారి మెజార్టీ లోక్ సభ సీట్లు బీజేపీకి ఎంతవరకు వస్తాయన్నది చెప్పలేం. ఒకవేళ బీజేపీ కూటమికి గత మాదిరి 39 సీట్లు రాకపోతే, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కొంత ఇబ్బంది రావచ్చు. యూపి. ఎంపీ, కర్ణాటక వంటి రాష్ట్రాలలో కూడా లోక్ సభ ఎన్నికలలో గతంలో వచ్చినట్లుగా ఓవర్ హెల్మింగ్ గా సీట్లు రాకపోవచ్చు. ఆయా రాష్ట్రాలలో సీట్ల సాధనలో వెనుకబడితే, అప్పుడు వైసీపీ వంటి పార్టీలు సాధించే సీట్లకు గిరాకి ఏర్పడుతుంది. అలాగే ఎలాగైనా బీజేపీతో అంటకాగాలని ఆరాటపడుతున్న తెలుగుదేశం పార్టీకి కూడా ఈ పరిణామం కాస్త ఆశ కలిగించవచ్చు. కానీ బీజేపీ ఏపీకి సంబంధించి వైసీపీపైన ఆధారపడాలా? టీడీపీతో జత కలవాలా అన్నదానిపై ఎన్నికల తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత ప్రబలితే ,అప్పుడు విపక్షాల కూటమికి కాస్త మెరుగైన ఫలితాలు రావచ్చు. అప్పుడు మోదీ అభ్యర్ధిత్వంపై చర్చ జరగవచ్చు. మోదీ ప్రధాని కాకుండా ఉంటే మద్దతు ఇస్తామని కొన్ని పార్టీలు ప్రతిపాదించవచ్చు. ఇలా రకరకాల పరిణామాలు వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలపై దూకుడుగా వెళుతున్న బీజేపీ కొంత తగ్గవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించే పనిలో పడవచ్చు. ఏది ఏమైనా ఇంతవరకు మోదీకి ప్రత్యామ్నాయం లేరనుకుంటున్న తరుణంలో నితీష్ కుమార్ రూపంలో విపక్షాలకు ఒక ప్రత్యామ్నాయం దొరికిందని భావించవచ్చేమో! -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
2 వారాల తర్వాతే ‘నితీశ్’ బల నిరూపణ.. కారణమేంటి?
పాట్నా: బిహార్‌లో బీజేపీతో సంబంధాలు తెంచుకుని ఆర్జేడీతో కలిసి మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు నితీశ్ కుమార్. ఆయన సీఎంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వత తొలిసారి నిర్వహించే అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్‌లోనే జేడీయూ-ఆర్జేడీ ప్లస్ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం స్పీకర్ పదవీలో బీజేపీ నేత ఉండటంతో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా స్పీకర్‌ను మార్చాలని అధికార కూటమి భావిస్తోంది. అవసరమైన బలం ఉన్నప్పటికీ అనవసర రిస్క్ తీసుకోకూడదని నేతలు భావిస్తున్నారు. సాంకేతికంగా గవర్నర్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఆదేశించాలి. కానీ, ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు నడుచుకుంటారు. ఇప్పటికే.. స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాపై అవిశ్వాస తీర్మానాన్ని 55 మంది మహాకూటమి ఎమ్మెల్యేలు ఇచ్చారు. అయితే.. నిబంధనల ప్రకారం ఈ తీర్మానం ఇచ్చిన రెండు వారాల తర్వాతే అసెంబ్లీ ముందుకు వస్తుంది. అందుకే ఆగస్టు 24 వరకు వేచి చూడాల్సిన అవసరం ఏర్పడింది. మహాగడ్బంధన్ కూటమికి ప్రస్తుతం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 243 సభ్యుల అసెంబ్లీలో 122 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. అయితే, ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ధోరణి కనిపిస్తోంది. ఆగస్టు 25న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు నితీశ్. ఆగస్టు 24న అసెంబ్లీ సమావేశాల తొలిరోజున అవిశ్వాస తీర్మానంతో స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాను తొలగించి కొత్తవారిని ఎన్నుకోనున్నారు. మరోవైపు.. ఆలోపే స్పీకర్ సిన్హా రాజీనామా చేసే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. అయితే, ఆయన బీజేపీ నాయకత్వం చెప్పినట్లు నడుచుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త స్పీకర్ ఆర్జేడీ నుంచి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: ఉచితాలు, సంక్షేమ పథకాలు రెండు వేరు వేరు: సుప్రీం కోర్టు -
ప్రధాని మోదీకి బిహార్ సీఎం నితీశ్ కుమార్ 2024 సవాల్!
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా 8వ సారి ప్రమాణ స్వీకారం చేశారు నితీశ్ కుమార్. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీయే వర్గానికి విపక్ష నేతగా మారిన ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. 2014లో గెలుపొందిన ప్రధాని మోదీ.. 2024 ఎన్నికల్లో గెలుపొందటంపై ఆందోళనపడాలన్నారు. 2014 మాదిరిగా 2024లో గెలుస్తారా? అని ప్రశ్నించారు. ‘బీజేపీని వీడాలని పార్టీ మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయం. 2024 వరకు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్లు ఏం కావాలో చెప్పగలరు. కానీ, 2014 ఏడాదిలో జీవించలేను. 2014లో అధికారంలోకి వచ్చిన వారు.. 2024లోనూ విజయం సాధిస్తారా? 2024 ఎన్నికల్లో విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుకుంటున్నా. 2020లో ముఖ్యమంత్రిగా ఉండాలనుకోలేదు. ఒత్తడి చేసి సీఎంను చేశారు. అందుకే మీతో మాట్లాడలేకపోయాను. 2015లో మాకు ఎన్ని సీట్లు వచ్చాయి. అదే బీజేపీతో కలిసి ఉండటం వల్ల 2020లో ఎన్ని తగ్గాయి.’ అని పేర్కొన్నారు నితీశ్. మరోవైపు.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఉండే అంశాన్ని తోసిపుచ్చారు నితీశ్. ఇదీ చదవండి: బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ ప్రమాణం.. డిప్యూటీగా ఆర్జేడీ నేత తేజస్వి -
బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం
పాట్నా: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్(యునైటెడ్)కు చెందిన నితీశ్ కుమార్ ప్రమాణం చేశారు. బుధవారం మధ్యాహ్నాం రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ఆయన బీహార్‌కు సీఎంగా ఎనిమిదో సారి బాధ్యతలు చేపట్టారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్ బై చెబుతూ.. ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు మంగళశారం సాయంత్రం సమర్పించారు. అయితే.. ఆ వెంటనే ఆర్జేడీ సహా విపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎంగా నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. #WATCH Bihar CM Nitish Kumar and Deputy CM Tejashwi Yadav greet each other after the oath-taking ceremony, in Patna pic.twitter.com/fUlTz9nGHS — ANI (@ANI) August 10, 2022 ఈ ప్రమాణ కార్యక్రమానికి బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, తేజస్వి యాదవ్ భార్య రాజశ్రీ తదితర ప్రముఖులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. బుధవారం ఈ ఇద్దరు మాత్రమే ప్రమాణం చేయడం విశేషం. మిగతా కేబినెట్ కూర్పు తర్వాత ఉండే ఛాన్స్ ఉంది. Patna | RJD leader Tejashwi Yadav takes oath as Deputy CM of Bihar pic.twitter.com/mvhweGd1zt — ANI (@ANI) August 10, 2022 #WATCH | Bihar: CM-designate Nitish Kumar, RJD's Tejashwi Yadav and his wife Rajshri, former CM Rabri Devi and RJD leader Tej Pratap Yadav at the swearing-in ceremony at Raj Bhavan in Patna. pic.twitter.com/bdxHBNSiyh — ANI (@ANI) August 10, 2022 ఇదీ చదవండి: ఎన్డీయే నుంచి జేడీయూ నిష్క్రమణపై బీజేపీ స్పందన -
బిహార్‌లో ఏం జరుగుతోంది? సీఎం నితీశ్‌పై విరుచుకుపడ్డ బీజేపీ ఎమ్మెల్యే
పట్నా: బిహార్ బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహరీ సీఎం నితీశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిలిం సీటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వంటి ప్రాజెక్టులు రాజ్‌గిరికే ఎందుకు తరలివెళ్తున్నాయని ప్రశ్నించారు. రాజ్గిరి సీఎం నితీశ్ కుమార్ సొంత జిల్లా నలందలో ఉండటం గమనార్హం. దీంతో వినయ్ బిహారీ సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. తాను కళలు, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్ర రాజధాని పట్నాలో నిర్మించాలనుకున్నట్లు వినయ్ చెప్పారు. కానీ ఆ ప్రాజెక్టును రాజ్‌గిరికి తరలించారని ఆరోపించారు. అలాగే ఫిలిం సిటీని కూడా వాల్మీకి నగర్లో నిర్మించాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ దాన్ని కూడా రాజ్‌గిరికి మార్చారాని ఆరోపించారు. భోజ్‌పురి ఫిలిం మేకర్ అయిన వినయ్ బిహారీ.. తనకంటే ఎక్కువ నితీశ్ కుమార్‌కు ఏమీ తెలియదన్నారు. అక్కడైతే ఫిల్మ్ మేకింగ్‌కి అనువైన వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండవని పేర్కొన్నారు. అసలు ఈ రెండు ప్రాజెక్టులను రాజ్‌గిరికి ఎందుకు మార్చారో సీఎం, సంబంధిత మంత్రి, బీజేపీ డిప్యూటీ సీఎంలే చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఫిలిం సిటీ, క్రికెట్ స్టేడియం పనులు నత్తనడకన సాగుతున్నాయని సీఎంపై వినయ్ బిహారీ విమర్శలు గుప్పించారు. 2014లో మొదలైన ఈ ప్రాజెక్టులు సగం కూడా పూర్తి కాలేదన్నారు. బిహార్‌లో అధికార జేడీయూ, బీజేపీ మిత్రపక్షాలు. అలాంటిది సీఎంపై బీజేపీ ఎమ్మెల్యే ఈ స్థాయిలో విరుచుకుపడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. చదవండి: బీజేపీ నేతలపై ఈడీ చర్యలు ఉంటాయా?.. చర్చనీయాంశంగా ఎన్సీపీ బ్యానర్! -
Nitish Kumar: బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా సోకింది. గత నాలుగు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్‌కు వెళ్లినట్లు పేర్కొంది. గత నాలుగు రోజులుగా నితీశ్ కుమార్ అనారోగ్యానికి గురైనట్లు ఆరోగ్య శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీ ప్రత్యాయ అమృత్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: MK Stalin Covid Positive: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కరోనా.. ట్విటర్ ద్వారా ప్రకటన -
అలా రాసిస్తేనే పెళ్లిళ్లకు వస్తానని చెప్పా: సీఎం
పట్నా: వర కట్నానికి వ్యతిరేకంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కట్నం తీసుకోలేదని వరుడి తరపు వారు చెబితేనే తాను పెళ్లికి హాజరవుతానని ఆయన అన్నారు. పట్నాలో కొత్తగా నిర్మించిన బాలికల హాస్టల్‌ను ఈనెల 23న ప్రారంభించిన సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. పెళ్లికొడుకు కట్నం తీసుకోలేదని రాతపూర్వకంగా తెలిపితేనే పెళ్లికి హాజరవుతానని అందరికీ చెప్పినట్టు వెల్లడించారు. పెళ్లి చేసుకోవడానికి కట్నం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘పెళ్లి కోసం కట్నం తీసుకోవడం దారుణం. మీరు పెళ్లి చేసుకుంటే మీకు పిల్లలు పుడతారు. ఇక్కడ ఉన్న మనమంతా తల్లులకు పుట్టాము. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారా?’ అంటూ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. (క్లిక్: 54% మహిళలకే సొంత సెల్‌ఫోన్) ప్రచార కార్యక్రమాలతో వరకట్నం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. అబ్బాయిలతో సమానంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో అమ్మాయిలు కూడా రాణిస్తున్నారని తెలిపారు. మహిళల డిమాండ్ మేరకే తమ ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించిందని నితీశ్ కుమార్ అన్నారు. (క్లిక్: కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ రాజీనామా) -
పూజలకు హింసతో సంబంధం ఏంటి?: సీఎం నితీశ్‌కుమార్
పాట్నా: తాజా మత ఘర్షణల మీద బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఘర్షణలను ప్రతీ వర్గం పక్కనపెట్టాలని, అసలు దేవుడి ప్రార్థనలకు హింసతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు. శ్రీ రామ నవమి సందర్భంగా దేశంలో పలు చోట్ల అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిపై స్పందించాల్సిందిగా మీడియా.. సోమవారం సీఎం నితీశ్‌కుమార్‌ను కోరింది. ‘‘వర్గాల మధ్య శాంతి, సామరస్యం వెల్లివిరియాలి. దేవుళ్లను ఆరాధించడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అంతేగానీ మనలో మనం కొట్టుకోవడం కాదు. పూజించడం మీద అంత నమ్మకం ఉంటే.. సరిగ్గా పూజలు చేసుకోవాలి. అంతేగానీ పూజల పేరుతో ఘర్షణలకు పాల్పడడం ఏంటి? ప్రార్థనలకు హింసకు ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటివి బీహార్‌లో జరిగితే ఊరుకునేదే లేదు’’ అని సీఎం నితీశ్ కామెంట్ చేశారు. एक दूसरे से झग़ड़ा का पूजा से कोई सम्बंध हैं ??आपको पूजा करना हैं तो पूजा कीजिएगा ना कि झगड़ा ये कहना हैं @NitishKumar का @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/LA4xWtMKG0 — manish (@manishndtv) April 18, 2022 మరోవైపు మసీదుల వద్ద ఆజాన్, లౌడ్ స్పీకర్ల చుట్టూ వివాదాలు సృష్టిస్తున్న వారికి మతంతో సంబంధం లేదని, ప్రజలు తమ మతాన్ని అనుసరించాలని, వారిని అడ్డుకోవద్దని నితీష్ కుమార్ అన్నారు. ప్రతి మతానికి దాని స్వంత మార్గాలు ఉన్నాయి. దీని గురించి మనలో మనం గొడవ పడకూడదు. ప్రతి ఒక్కరూ తమ మతాన్ని అనుసరించాలి. ఎవరైనా ఈ విషయాలపై వివాదాలు సృష్టిస్తే, అతనికి మతంతో సంబంధం లేదు అని అన్నారాయన. ఇదిలా ఉండగా.. రామ నవమి సందర్భంగా రాళ్లు రువ్విన వాళ్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయాలంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారడంతో పాటు సుప్రీం కోర్టుకు చేరాయి. ఈ తరుణంలో బీజేపీ మిత్రపక్షం హిందుస్థాన్ అవామ్ మోర్చా చీఫ్, బీహార్ మాజీ సీఎం జతిన్ రామ్ మాంఝీ.. శ్రీ రాముడిపై ప్రతికూల కామెంట్లు చేయగా, ఇప్పుడు మరో మిత్రపక్ష నేత, సీఎం నితీశ్ సైతం పూజల పేరుతో అల్లర్లకు పాల్పడుతున్న వాళ్లపై విమర్శలు గుప్పించడం గమనార్హం. -
ఎవ్వరినీ వదలడం లేదు.. కరోనా బారిన పడ్డ మరో ఇద్దరు సీఎంలు
బెంగుళూరు/పాట్నా! భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. లక్షల్లో రోజువారీ కేసులు వెలుగు చూస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు సాధారణ పౌరులపై కోవిడ్ పంజా విసురుతుంటే మరోవైపు ప్రజాప్రతినిధులను కూడా విడిచి పెట్టడం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా మంది నాయులు కరోనా బారిన పడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పాటు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు కరోనా సోకగా.. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మె కోవిడ్ బారిన పడ్డారు. ఈ మేరకు సీఎం తన అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగేఉందని, వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తననుకలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకొని హోం ఐసోలేషన్‌లో ఉండాలని విజ్జప్తి చేశారు. చదవండి: కాశీ విశ్వనాథ్ ధామ్ సిబ్బందికి మోదీ ఊహించని బహుమతి I have tested positive for COVID -19 today with mild symptoms. My health is fine, I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested. — Basavaraj S Bommai (@BSBommai) January 10, 2022 మరోవైపు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సీఎం ఆఫీస్ అధికారులు వెల్లడించారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ ఇంట్లోనే ఐసోలేట్ అయి చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తున్నారని వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. చదవండి: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా.. జేపీ నడ్డాకు కరోనా బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపిన నడ్డా.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేసుకోవాలని సూచించారు. माननीय मुख्यमंत्री श्री नीतीश कुमार कोरोना जाँच में पॉज़िटिव पाये गए हैं। चिकित्सकों की सलाह पर वह होम आइसोलेशन में हैं। उन्होंने सभी से कोविड अनुकूल सावधानियां बरतने की अपील की है। — CMO Bihar (@officecmbihar) January 10, 2022 -
కుల ఆధారిత జనగణన చేపట్టాలి: నితీశ్
పట్నా: దేశంలో ఎస్సీ, ఎస్టీలు తప్ప ఇతర కులాల జనాభాను లెక్కించే ప్రసక్తే లేదంటూ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై బిహార్ ముఖ్యమంత్రి, ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ భిన్నస్వరం వినిపించారు. దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనగణన చేపట్టాలని శనివారం డిమాండ్ చేశారు. సంక్షేమ ఫథకాలకు రూపకల్పన చేయడానికి ఈ గణాంకాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. దేశంలో దళితేతర పేదలు ఎంతమంది ఉన్నారో తేల్చడానికి కుల ఆధారిత జనగణనే మార్గమని పేర్కొన్నారు. 2010లో కులాలవారీగా జనాభా లెక్కింపు ప్రారంభించారని, 2013లో నివేదిక సిద్ధమయ్యిందని, దాన్ని విడుదల చేయలేదని ఆక్షేపించారు. ఒక్కసారైనా కులాలవారీగా జనాభాను లెక్కించాలని కోరారు. -
పొలిటికల్ మిషన్
నవీన్ చంద్ర హీరోగా హనీ బన్నీ క్రియేషన్స్, శ్రీ మిత్ర, మై విలేజ్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘మిషన్ 2020’. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రేరణతో వాస్తవ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. కరణం బాబ్జీ దర్శకత్వంలో కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కేవీఎస్‌ఎస్‌ఎల్ రమేష్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 5న సినిమా విడుదల కానుంది. ‘‘ఈ సినిమాను చూసి ఏషియన్ ఫిలిమ్స్ విడుదల చేయడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న కథతో సినిమా తీయడం అంటే డేరింగ్ స్టెప్ అనుకోవచ్చు. సినిమా బాగా నచ్చింది కాబట్టి నైజాంలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్. ‘‘పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు కరణం బాబ్జీ. ‘‘ఇప్పటికే విడుదలైన పాటలు ఘనవిజయం సాధించాయి. సినిమా కూడా పెద్ద హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు కేవీఎస్‌ఎస్‌ఎల్ రమేష్ రాజు. ఎగ్జిబిటర్ శ్రీధర్, సంగీతదర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతిలో భీష్ముడంతటి వాడు..
పాట్నా: సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలను సైబర్ నేరంగా పరిగణించే విధంగా గ్యాగ్ ఆర్డర్‌ను తీసుకొచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టడాన్ని సైబర్ నేరంగా పరిగణించమని సీఎం నితీష్ కుమార్ బీహార్ ఆర్థిక నేరాల విభాగానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ప్రజల హక్కులను కాలరాయడంలో నితీష్ హిట్లర్‌తో సమానమని విమర్శించారు. సీఎం నితీష్ కుమార్ 60కిపైగా కుంభకోణాలకు పాల్పడ్డారని.. ఆయన అవినీతిలో భీష్ముడంతటివాడని ఆయన ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకునేందుకు ఆయన నేరస్తులకు కొమ్ము కాస్తూ.. అనైతిక, రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. బీహార్ పోలీసులు మద్యం అమ్ముతున్నారని హిందీలో ట్వీట్ చేసిన తేజస్వి.. ఈ చట్టం కింద తనను అరెస్ట్ చేయాలని ఛాలెంజ్ చేశారు. ప్రజాస్వామ్యానికి తల్లి లాంటి రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని తేజస్వి విమర్శించారు. నితీష్ తన ఆదర్శాలను తాకట్టుపెట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు అమ్ముడుపోయారని, ఆయన సంఘ్ పరివార్‌కు చెందిన ముఖ్యమంత్రిగా తయారయ్యారన్నారు. -
నితీశ్ కేబినెట్లో 57% మంది నేరచరితులే
పట్నా: బిహార్‌లో నితీశ్‌కుమార్ సర్కార్ ప్రమాణ స్వీకారం చేసిందో లేదో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరచరిత కలిగిన వారికి నితీశ్ కేబినెట్లో చోటు దక్కడంతో విపక్షాలు దాడికి దిగాయి. విద్యాశాఖ మంత్రిగా జేడీ(యూ)కి చెందిన మేవాలాల్ చౌధురిని నియమించడంతో రగడ మొదలైంది. గతంలో వ్యవసాయ యూనివ ర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా మేవాలాల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయనకు విద్యాశాఖ మంత్రి పదవి కట్టబెట్టడంతో విపక్ష ఆర్జేడీ కూటమికి ఒక ఆయుధం దొరికింది. కేబినెట్లో మరో ఏడుగురు నేర చరిత కలిగిన వారు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. నితీశ్ కేబినెట్లో బెర్త్ సంపాదించిన 14 మంది ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన వివరాలను విశ్లేషించిన ఆ సంస్థ ఎనిమిది మంది (57%) నేరచరిత్ర కలిగినవారని పేర్కొంది. వారిలో ఆరుగురు (43%)అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఎనిమిది మంది కళంకిత మంత్రుల్లో బీజేపీ నుంచి నలుగురు, జేడీ(యూ) నుంచి ఇద్దరు కాగా మిగతా ఇద్దరు కూటమి పార్టీలకు చెందినవారు. -
బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం నితీశ్‌కు ఇది ఏడోసారి. 2005 నవంబర్ నుంచి, మధ్యలో స్వల్పకాలం మినహాయించి, నితీశ్ బిహార్ సీఎంగా కొనసాగుతున్నారు. 2014 మే నుంచి 2015 ఫిబ్రవరి వరకు జితన్ రామ్ మాంఝీ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఎన్డీయే మిత్రపక్ష నాయకుల సమక్షంలో రాజ్‌భవన్‌లో నితీశ్‌తో గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన విషయం తెలిసిందే. నితీశ్‌తో పాటు 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో బీజేపీకి చెందిన తార్కిషోర్ ప్రసాద్, రేణుదేవి ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ నుంచి ఏడుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, హెచ్ఏఎం, వీఐపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున తాజా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. హెచ్ఏఎం నుంచి మాజీ సీఎం జితన్‌రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్(ఎంఎల్సీ), వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) నుంచి ఆ పార్టీ చీఫ్ ముకేశ్ సాహ్నీ మంత్రులుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ స్పీకర్‌గా ఈసారి బీజేపీ నేత నందకిషోర్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. 2000లో తొలిసారి నితీశ్‌కుమార్ బిహార్ సీఎంగా తొలిసారి 2000లో బాధ్యతలు చేపట్టారు. మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల్లోపే రాజీనామా చేశారు. ఐదేళ్ల తరువాత, జేడీయూ– బీజేపీ కూటమి మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎం అయ్యారు. 2010లో అదే కూటమి ఘన విజయంతో మూడో సారి సీఎం పీఠం అధిష్టించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత, 2015 ఫిబ్రవరిలో మళ్లీ సీఎం అయ్యారు. 2015 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి జేడీయూ పోటీ చేసి విజయం సాధించడంతో నితీశ్ మరోసారి సీఎం అయ్యారు. అయితే, ఆర్జేడీతో విభేదాల కారణంగా 2017లో సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం, 24 గంటల్లోపే బీజేపీతో మరోసారి జట్టు కట్టి ఆరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. బిహార్ సీఎంగా అత్యధిక కాలం కొనసాగిన ఘనత శ్రీకృష్ణ సింగ్ పేరిట ఉంది. స్వాతంత్య్ర పూర్వం నుంచి 1961లో చనిపోయేవరకు ఆయన సీఎంగా ఉన్నారు. ఇలా ఉండగా, కొత్త సీఎం నితీశ్‌కు అభినందనలు తెలుపుతూనే.. ఐదేళ్లు ఎన్డీయే ముఖ్యమంత్రిగానే నితీశ్ కొనసాగుతారని ఆశిస్తున్నట్లు లోక్‌జనశక్తి పార్టీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నితీశ్‌కుమార్ బీజేపీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అని కొత్త సీఎం నితీశ్‌కు మాజీ సహచరుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చురకలంటించారు. రాజకీయంగా అలసి పోయిన నేత ముఖ్యమంత్రిత్వంలో ప్రజలు నీరసపాలన అనుభవించక తప్పదన్నారు. ప్రధాని అభినందనలు న్యూఢిల్లీ: బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయే కుటుంబం కలసికట్టుగా కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం కేంద్రం తరఫున సాధ్యమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రులుగా ప్రమాణం చేసిన నాయకులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. -
బిహార్ సీఎంగా మళ్లీ నితీశ్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో నెగ్గిన ఎన్డీయే కూటమి ముందే ప్రకటించినట్టుగా సీఎం పగ్గాలు నితీశ్‌కే అప్పగించింది. ఆదివారం పట్నాలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా నితీశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 243 సీట్లున్న అసెంబ్లీలో 125 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సుపరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్న నితీశ్‌కుమార్ కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల సమస్యను ఎదుర్కోవడంలో విఫలం కావడంతో చాలా మంది ఆయనకు వ్యతిరేకమయ్యారు. గత అసెంబ్లీతో పోల్చి చూస్తే నితీశ్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీ–యూ) బలం 71 నుంచి 43కి పడిపోయింది. అయినప్పటికీ ముందుగా చేసిన నిర్ణయానికి కట్టుబడి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మిస్టర్ క్లీన్ ముద్ర ఉన్న నితీశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. గవర్నర్‌ని కలుసుకున్న నితీశ్ ఎన్డీయే శాసనసభా పక్షనాయకుడిగా ఎన్నికైన వెంటనే నితీశ్ కుమార్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఫాగూ చౌహాన్‌ను కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనని కోరారు. ఎన్డీయే పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం నితీశ్ విలేకరులతో మాట్లాడుతూ సోమవారమే తాను పదవీ ప్రమాణం చేయనున్నట్టుగా చెప్పారు. ‘‘ఎన్డీయే కూటమిలో నాలుగు పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖని గవర్నర్‌కి సమర్పించాను. గవర్నర్ ఆదేశం మేరకు సోమవారం సాయంత్రం 4–4:30 మధ్య రాజ్‌భవన్‌లో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాను’’అని చెప్పారు. ఎన్డీయే కూటమి సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ భూపేంద్ర యాదవ్, ఎన్నికల ఇన్చార్జ్ ఫడ్నవీస్ హాజరయ్యారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా తార్ కిశోర్ బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి ఈసారి ఇద్దరిని వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కతిహర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తార్ కిశోర్ ప్రసాద్, బెత్తాహ్ ఎమ్మెల్యే రేణుదేవిలను డిప్యూటీ సీఎంలుగా దాదాపు ఖరారు అయినట్టే. అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నాయకునిగా తార్ కిశోర్ ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయనే డిప్యూటీ సీఎం పగ్గాలు చేపడతారని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సుశీల్ కుమార్ మోదీకి కేంద్రంలో పదవి అప్పగించే అవకాశాలున్నాయి. బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఆయనే ప్రసాద్ పేరు ప్రతిపాదించారు. బీజేపీఎల్పీ ఉప నేతగా రేణు దేవిని ఎన్నుకోవడంతో ఆమెకు కూడా డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరీ తార్కిశోర్ ప్రసాద్ ? రాజకీయవర్గాల్లో పెద్దగా పరిచయం లేని ప్రసాద్ (52) ఎంపికపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రసాద్ వెనుకబడిన కల్వార్ సామాజిక వర్గానికి చెందినవారు. కతిహర్ నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. తార్ కిశోర్, రేణు దేవి -
బిహార్ మంత్రివర్గం రాజీనామా
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఫగూ చౌహాన్ని కలిశారు. తన మంత్రివర్గ రాజీనామాను సమర్పించి, అసెంబ్లీని రద్దుచేయాలని సిఫారసు చేశారు. దీంతో బిహార్‌లో నితీశ్ నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నితీశ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించి, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. అంతకుముందు సీఎం అధికార నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీల నాయకులు భేటీ అయ్యారు. కొత్త ఎన్నికైన ఎన్డీయే ఎమ్మెల్యేలంతా ఆదివారం మధ్యాహ్నం సమావేశమై నితీశ్‌ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. బిహార్‌లో జేడీయూ కన్నా బీజేపీ 31 స్థానాలు అధికంగా గెలుపొందినప్పటికీ, ప్రధాని, బీజేపీ అధిష్టానం నితీశ్ కుమార్‌నే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించడం విశేషం. ఉప ముఖ్యమంత్రిగా దళిత వర్గానికి చెందిన బీజేపీ నేత కామేశ్వర్ చౌపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనకు సంఘ్‌పరివార్‌తో అనుబంధం ఉంది. ఇలా ఉండగా, స్వతంత్ర ఎమ్మెల్యే చకాయ్ సుమిత్ సింగ్ ఎన్డీయేకి మద్దతు ప్రకటించారు. -
నితీష్ కుమారే బీహార్ సీఎం: ఎన్డీయే
బిహార్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(73) కంటే జేడీ(యూ) (43) తక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా అనే ఊహగానాలకు తెరపడింది. బిహార్ పగ్గాలు మరోసారి జేడీయూ అధినేత నితీష్ కుమారే చేపడతారని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. దీపావళి తరువాత నితీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు జేడీయూ ఎంపీ కెసి త్యాగి తెలిపారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారా..లేరా... అనే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. నితీష్ కుమార్‌ను జాతీయ రాజకీయాల వైపు రావాలని సెక్యులర్ నాయకులతో కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలని చూస్తున్న వారికి వ్యతిరేకంగా పని చెయ్యాలని, బీహార్ నితీష్ స్థాయికి చిన్నదైపోయిందంటూ ట్వీట్ చేశారు. (చదవండి : నితీష్ సీఎం అయితే మాదే క్రెడిట్: శివసేన) దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్ బీజేపీ నాయకుడని, గెలుపోటములు ఆయన స్థాయిని దిగజార్చవని, ఆయనపై విమర్శలు చేసిన ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ను ప్రజలు తిరస్కరించారని, దిగ్విజయ్ తన రాష్ట్రంలో తన పార్టీ రాజకీయాలను చూసుకోవాలని విమర్శించారు. ఇదే అంశంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌మోదీ మాట్లాడుతూ.. బిహార్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించిందని, ఇది ఏ ఒక్క పార్టీ గెలుపు కాదని, సమిష్టి విజయమన్నారు. బిహార్ ప్రజలు ఎన్డీయే కూటమిపై నమ్మకముంచి పట్టం కట్టారన్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. -
ఇవే నా చివరి ఎన్నికలు: నితీశ్
పట్నా: ఈ అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని పూర్ణియాలో గురువారం ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేశారు. ‘ఇవే నా చివరి ఎన్నికలు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేయను. పదవీ విరమణ చేస్తాను. అంతా బాగున్నప్పుడే మనం తప్పుకోవాలి’అని ఎన్నికల సభలో అనూహ్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. నితీశ్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సంక్లిష్టమైన ఎన్నికల్ని ఈ సారి ఎదుర్కొంటున్నారు. దీంతో ఓటర్లను ఆకర్షించడానికే చివరి ఎన్నికలంటూ ఒక కొత్త స్టంట్‌కు తెరతీశారని ప్రత్యర్థులు వ్యాఖ్యానించారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిన యోగి ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ చొరబాటుదారుల సమస్యను పరిష్కరించడానికి ప్రధాని మోదీ సీఏఏని తీసుకువచ్చారంటూ వివాదాన్ని రేపారు. ఈ వ్యాఖ్యలపై నితీశ్ ధ్వజమెత్తారు. ఏమిటీ నాన్సెన్స్ ? ఎవరీ చెత్త మాట్లాడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. బిహార్‌లో ముస్లిం మైనార్టీలు నితీశ్ పక్షానే ఉన్నారు. యోగి వ్యాఖ్యలతో వారెక్కడ దూరం అవుతారోనన్న భయం ఆయనని వెంటాడుతోంది. బిహార్ అభివృద్ధికి నితీశే ఉండాలి: మోదీ బిహార్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు నితీశ్ కుమార్ ప్రభుత్వం అవసరం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రజలకు ఎన్డీఏయేపై మాత్రమే పూర్తి నమ్మకం ఉందన్నారు. అరాచక వాతావరణాన్ని సృష్టించిన 2005 ముందు నాటి పాలన పరిస్థితుల నుంచి రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తేరుకుంటోందనీ, సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైందని ఆయన అన్నారు. -
రెబల్స్‌కు ఫడ్నవీస్ వార్నింగ్ !
బిహార్: లోక్ జన్‌శక్తి పార్టీ తరపున ఎవరైనా పోటీ చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని మహారాష్త్ర మాజీ ముఖ్యమంత్రి, బిహార్ ఎన్నికల ఇన్‌ఛార్జి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చారించారు. భాజపా నుంచి కొందరు రెబల్స్ ఎల్జేపీ తరుపున పోటీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా ఎవరి పేర్లు బయటకు చెప్పనప్పటికీ ఈ హెచ్చరిక రెబల్స్‌కే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఫడ్నవీస్, బిహార్‌లో ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమారే అని వెల్లడించారు. ఎన్నికల తర్వాత భాజపా- ఎల్జేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఆరోపణలను ఆయన కొట్టిపడేసారు. ముఖ్యమంత్రి కావాలని చిరాగ్ పస్వాన్ ఆశిస్తున్నాడని, అది సాధ్యమయ్యే పని కాదని ఫడ్నవీస్ తెలిపారు. మోది పేరు వాడొద్దు... భాజపా రాష్త్ర అధ్యక్షుడు సంజయ జైశ్వాల్, బిహార్ ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ... బిహార్‌లో ఎన్డీయే తరపున పోటీ చేసే అభ్యుర్థులు కచ్చితంగా నితీశ్ కుమార్ నాయకత్వాన్ని ఆహ్వానించాలన్నారు. ఎన్డేయేతర అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోది పేరును వాడుకొని ఓట్లు అడిగే హక్కు లేదని, అలా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రైలు టిక్కెట్లకు డబ్బులు ఇవ్వొద్దు: సీఎం
పట్నా: కేంద్ర ప్రభుత్వానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న బిహారీలను తరలించడానికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలన్న తన సూచనను పాటించినందుకు సంతోషంగా ఉందన్నారు. శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో బిహార్ వచ్చే వారు టిక్కెట్లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారి కోసం క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు క్వారంటైన్లో 21 రోజులు పాటు ఉండాల్సివుంటుందని సీఎం నితీశ్ స్పష్టం చేశారు. క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరికి బిహార్ ప్రభుత్వం వెయ్యి రూపాయల సహాయం అందజేస్తుందని చెప్పారు. ఈ పథకంలో కింద బిహార్‌లో ఇప్పటికే 19 లక్షల మందికి వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బిహారీలకు ఎటువంటి సమస్యలు రాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. (వామ్మో.. ఇంత పేద్ద ‘బారా’) యూపీని చూసి నేర్చుకోండి: బీజేపీ కాగా, సొంత ప్రభుత్వంపై బీజేపీ నాయకుడు సంజయ్ జైశ్వాల్ విమర్శలు గుప్పించారు. లాక్డౌన్ 3.0 అమలు, వలసదారులను తిరిగి తీసుకువచ్చే రైళ్ల వివరాలపై నితీశ్ సర్కారుకు స్పష్టత లేదని ఫేస్బుక్లో విమర్శించారు. ఉత్తరప్రదేశ్ నుంచి బిహార్ పాఠాలు నేర్చుకోవాలని సలహాయిచ్చారు. బిహార్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కొవడం జేడీ(యూ) సర్కారు తలనొప్పిగా మారింది. (బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు..) -
పోర్న్ సైట్ల వల్లే రేప్‌లు: నితీశ్
గోపాల్‌గంజ్: పోర్న్ సైట్ల కారణంగానే మహిళలపై లైంగిక నేరాలు పెరుగుతు న్నాయని బిహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యా నించారు. పోర్న్సైట్లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ‘దిశ’ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా, సాంకేతికత పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వల్లే మహిళలు, చిన్నారులపై దేశమంతటా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. నేరగాళ్లు వీటిని చిత్రీకరించి, ఇంటర్నెట్లో పెడుతున్నారు. వీటిని చూసి ఇతరులు దారుణాలకు పాల్పడుతున్నారు. అందుకే ఈ పోర్న్ సైట్లపై దేశంలో పూర్తి నిషేధం విధించాలని కేంద్రానికి లేఖ రాస్తా’ అని వెల్లడించారు. -
'15ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలు నిషేధం'
పాట్నా : బీహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 15 సంవత్సరాలకు పైబడిన ప్రభుత్వ వాహనాలను సోమవారం నుంచే పూర్తిగా నిషేదించినట్లు నిర్ణయం తోసుకుంది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణపై ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దీపక్ కుమార్ విలేకరులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇటివలే పండుగ సీజన్లో నమోదైన కాలుష్య స్థాయిని గమనిస్తే అందులో ఈ వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకే పాట్నా మెట్రో పాలిటన్ ఏరియాలో 15 ఏళ్లకు పైబడిన ప్రభుత్వ వాహనాలను నిషేదించామని తెలిపారు. అయితే ప్రైవేటు వాహనాలను ఈ నిషేధం నుంచి మినహాయించామని, కానీ యజమానులు తమ వాహనాలకు కొత్తగా కాలుష్య పరీక్షలు చేయించి ధృవీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుదన్నారు. దీని కోసం ప్రత్యేకంగా మంగళవారం నుంచి ఇంటెన్సివ్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం జారీ చేస్తామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అలాగే కిరోసిన్‌తో నడుస్తూ అధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆటో రిక్షాలు కొత్తగా పొల్యుషన్ టెస్ట్‌ను చేయించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో డీజిల్‌తో నడుస్తున్న ఆటో రిక్షాలను త్వరలోనే పూర్తిస్థాయి సీఎన్జీ లేదా ఎలక్ట్రిక్‌తో నడిచే విధంగా రూపొందించనున్నట్లు తెలిపారు. వీటిని మార్చుకోవడానికి ఆటో యజమానులకు ప్రోత్సాహం కింద సబ్సిడీలు కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రాధిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ స్థలాల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. అదే విధంగా ప్రైవేట్ భవనాలకు సంబంధించి మునిసిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో సౌండ్‌లెస్ జనరేటర్లను మాత్రమే ఉపయోగించుకునేలా సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. చెత్తను పారవేసే ట్రక్కులు, ఇతర వ్యాన్లు డంపింగ్ యార్డుకు తీసుకెళ్లే మార్గంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చెత్తను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచాలని ఆదేశించినట్లు తెలిపారు. -
సీఎం నితీశ్‌కు నిరసన సెగ
ముజఫర్‌పూర్/పట్నా: మెదడువాపు వ్యాధితో తమ పిల్లలను కోల్పోయిన బాధలో ఉన్న తల్లిదండ్రులు ఆస్పత్రిని సందర్శించిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముజఫర్‌పూర్ జిల్లాలో ఇప్పటి వరకూ 100 మందికి పైగా పిల్లలు మెదడువాపు వ్యాధితో మరణించడం తెల్సిందే. వ్యాధి వ్యాప్తిపై పట్నాలో అధికారులతో భేటీ తర్వాత నితీశ్ ముజఫర్‌పూర్‌లోని ఆస్పత్రి ఐసీయూలోకి వెళ్లారు. దీంతో అక్కడ కొందరు ‘నితీశ్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. నితీశ్ ఐసీయూలోకి రాగానే పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మా బిడ్డలను కాపాడండి సారూ అంటూ భోరున విలపించారు. నితీశ్ వారిని పరామర్శించి బిడ్డల పరిస్థితిని గురించి డాక్టర్ల వద్ద వాకబు చేశారు. త్వరలోనే కృష్ణా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను 600 పడకల స్థాయి నుంచి 2,500 పడకల స్థాయికి చేరుస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ చెప్పారు. -
చిన్నారుల మృతికి కారణాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో వందకు పైగా చిన్నారులు ఎక్యూట్ ఎన్ఫలైటిస్ సిండ్రోమ్ (ఏఈఎస్)తో బాధపడుతూ మరణించిన ఘటనపై స్ధానిక ఎంపీ అజయ్ నిషాద్ స్పందించారు. చిన్నారుల మృతులను తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. వడగాడ్పులతో పాటు అపరిశుభ్ర వాతావరణం, పేదరికం, మారుమూల ప్రాంతాల్లో నివసించడం చిన్నారులు ఈ వ్యాధితో మృత్యువాత పడటానికి ప్రధాన కారణాలని ఎంపీ విశ్లేషించారు. రోగులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, వారు ఉంటున్న ప్రాంతాల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతోందని ఈ పరిస్ధితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు. మరోవైపు చిన్నారులు చికిత్స పొందుతున్న ముజఫర్‌పూర్‌లోని కృష్ణ మెడికల్ కాలేజి ఆస్పత్రిని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సందర్శించి చిన్నారుల ఆరోగ్య పరిస్ధితిని సమీక్షించారు. ముజఫర్‌పూర్‌లో ఏఈఎస్ వ్యాప్తి ప్రబలిన రెండు వారాల తర్వాత సీఎం ఆస్పత్రిని సందర్శించడం పట్ల రోగుల బంధువులు బిహార్ సీఎం నితీష్ కుమార్ రాకను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. -
ఈబీసీ కోటా అమలుకు రెడీ
పట్నా : అగ్రవర్ణ పేదలకు జనరల్ కోటాలో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అవసరమైన న్యాయ సలహా తీసుకుంటున్నామని, త్వరలోనే దీని అమలుకు పూనుకుంటామని బిహార్ సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. అగ్రవర్ణ పేదలకు జనరల్ కోటాలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యాంగ సవరణను చేపట్టిన సంగతి తెలిసిందే. అత్యంత వెనుకబడిన కులాల వారికి జాతీయ స్దాయిలో ప్రత్యేక రిజర్వేషన్‌ను కల్పించాలని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. కాగా తమ పార్టీ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకమని ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. బిహార్‌లో ఇటీవల చోటుచేసుకున్న మూక హత్యలను ప్రస్తావిస్తూ ఇవి శాంతి భద్రతల సమస్యకు సంబంధించినవి కావని, వీటిని నియంత్రించేందుకు సామాజిక చైతన్యం పెరిగేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. -
మళ్లీ ఆయనే సీఎం కావాలంటున్నారు!
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్ కుమార్‌కు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని బిహార్ ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో జతకట్టి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ఇండియాటుడే సర్వే నిర్వహించింది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 46 శాతం మంది మద్దతు ప్రకటించారు. బీజేపీతో కలవడం వల్ల ఆయన విశ్వసనీయత కోల్పోలేదని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. నితీశ్ ప్రభుత్వం నుంచి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను వెళ్లగొట్టిన తర్వాత రాష్ట్రంలో అవినీతి తగ్గిందా? అని ప్రశ్నించగా 49 శాతం మంది అవునని సమాధానం ఇచ్చారు. 40 శాతం కాదని చెప్పారు. 11 శాతం మంది తటస్థంగా ఉండిపోయారు. ఈనెల 22 నుంచి 26 వరకు 40 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా సర్వే నిర్వహించినట్టు ఇండియా టుడే వెల్లడించింది. 2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2017, జూలైలో మహాకూటమి నుంచి నితీశ్ కుమార్ బయటకు వచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి 2015 ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత.. నితీశ్ ఈ రెండు పార్టీలను వదిలేసి బీజేపీతో జత కట్టడాన్ని అప్పట్లో చాలా మంది తప్పుబట్టారు. కమలం పార్టీతో పొత్తు అనైతికమని దుయ్యబట్టారు. అయితే తాజా సర్వేలో నితీశ్‌కు ప్రజలు జై కొట్టడం విశేషం. -
బీజేపీతో నితీష్ కటీఫ్..?
సాక్షి, పట్నా : బీజేపీతో మరోసారి తెగదెంపులకు బిహార్ సీఎం నితీష్ కుమార్ సంసిద్ధమవుతున్నారా అనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీతో నితీష్ అసౌకర్యంగా ఉన్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. జేడీ(యూ)-బీజేపీ మధ్య సంబంధాలు గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలతో బెడిసికొట్టాయనే ప్రచారం సాగుతోంది. బీజేపీ పెద్దన్న తీరుతో నితీష్ విసిగిపోయారని, ఇటీవల నాలుగు సందర్భాల్లో బీజేపీ వ్యవహరశైలిపై ఆయన గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. నోట్ల రద్దుపై నితీష్ యూటర్న్ సైతం ఇవే సంకేతాలు పంపుతోంది. పట్నాలో జరిగిన ఓ బ్యాంకింగ్ సదస్సులో పాల్గొన్న నితీష్ నోట్ల రద్దును తాను గట్టిగా సమర్ధించానని, అయితే దీనివల్ల ఎంతమంది ప్రజలు లబ్ధిపొందారని ఆయన ప్రశ్నించారు. పలుకుబడి కలిగిన కొందరు సంపన్నులు పెద్దమొత్తంలో సొమ్మును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించారని, పేదలు మాత్రం నగదు అందుబాటులో లేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. విపక్షాలు సైతం ఇదే తరహాలో మోదీ సర్కార్ నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టాయి. మరోవైపు వరద సాయంపై బిహార్‌కు రూ 7,363 కోట్లు ప్రకటించిన కేంద్రం తాజాగా కేవలం రూ 1750 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకోవడం సైతం నితీష్‌కు ఆగ్రహం తెప్పించినట్టు చెబుతున్నారు. అసమ్మతి బాహాటంగా వ్యక్తం చేసే క్రమంలోనే నితీష్ కుమార్ బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజ్ డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు.2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న నేపథ్యంలో నితీష్ వైఖరి ఆసక్తికరంగా మారింది. -
బిహార్ బుక్లెట్పై పాకిస్తాన్ బాలిక
పట్నా: బిహార్‌లో ‘స్వచ్ఛ్ జమయి, స్వస్థ్ జమయి ప్రచారానికి ముద్రించిన బుక్లెట్ కవర్‌పేజీపై పాకిస్తాన్ బాలిక చిత్రం ఉండటం విమర్శలకు దారితీసింది. ఐదేళ్ల ఆ బాలిక కుర్చీలో కూర్చుని పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని గీస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. పాకిస్తాన్లో బాలికా విద్యపై అవగాహన పెంచేందుకు యూనిసెఫ్ ఆ ఫొటోను గతంలో వాడింది. పొరపాటున ఆ ఫొటో స్వచ్ఛ్ బుక్లెట్లోకి వచ్చిందని జముయి జిల్లా అధికారులు చెప్పారు. సుమారు 5 వేల బుక్లెట్లపై పాక్ బాలిక చిత్రం ముద్రితం కావడంపై బిహార్ సీఎం నితీశ్ స్వతంత్ర విచారణకు ఆదేశించారు. ఆ ప్రతులను జముయి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పంపిణీ చేశారు. -
ఐశ్వర్య రాయ్‌తో తేజూ పెళ్లి: వైరల్
పట్నా : తేజ్ ప్రతాప్ యాదవ్- ఐశ్వర్య రాయ్‌ల పెళ్లి వార్త దేశమంతటా ఆసక్తి రేపుతున్నది. లక్షల మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహుర్తం ఖరారైంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట పెళ్లి సందడి మొదలుకానుంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ మనుమరాలు, ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని ఐశ్వర్యా రాయ్‌తో తేజ్ ప్రతాప్ పెళ్లి ఫిక్స్ అయినట్లు యాదవ్ పరివారం వెల్లడించింది. ఏప్రిల్ 18న నిశ్చితార్థం, వచ్చే నెలలో పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలూ అంగీకరించినట్లు సన్నిహితులు తెలిపారు. పట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్‌లో పెళ్లి వేడుకలు జరుగుతాయని సమాచారం. ఐశ్వర్యదీ పెద్ద కుటుంబమే: లాలూ ఇంటి కోడలిగా రానున్న ఐశ్వర్యరాయ్దీ పెద్ద కుటుంబమే. ఆమె తాత దరోగా ప్రసాద్ రాయ్ బీహర్‌లో యాదవ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి వ్యక్తి. ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్ బిహార్ మంత్రిగానూ పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించిన ఐశ్వర్యకు ఎన్నో సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభించినప్పటికీ తిరస్కరించిందని ఆమె బంధువులు తెలిపారు. పెళ్లి ఖరారు కావడంతో లాలూ సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి ‘కోడళ్ల అన్వేషణ’ సగం ఫలించినట్లైంది. తేజ్ ప్రతాప్ సోదరుడు తేజస్వీ యాదవ్‌కు ఇప్పటికే 40వేల పెండ్లి ప్రపోజల్స్ వచ్చాయి. చిన్న కొడుకు పెళ్లి కూడా చేసేస్తే తన అన్వేషణ పూర్తవుతుందని రబ్రీ పలు మార్లు చమత్కరించిన సంగతి తెలిసిందే. గతంలో ‘పెద్దవాళ్లను గౌరవిస్తూ, ఇంటిని చక్కగా నడిపించే కోడలు దొరికితే చాలు’ అంటూ రబ్రీ దేవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. ‘సంస్కారమున్న కోడలు అంటే గృహిణిగా ఉండటమే కాదని.. ప్రేమ, ఆప్యాయతలు కురిపించి కుటుంబాన్ని తీర్చిదిద్దే లక్షణాలున్న గృహిణి అయినా, ఉద్యోగస్తురాలైనా కావచ్చు’ అంటూ లాలూ ట్వీట్ చేశారు. -
‘నితీష్ పిరికిపంద’
సాక్షి,పాట్నా : బిహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. నితీష్ కుమార్‌ను పిరికిపందగా అభివర్ణించారు. రాష్ట్రంలోని అరారియా, భాగల్పూర్, దర్భంగాల్లో ఇటీవల చెలరేగిన హింసకు నితీషే బాధ్యత వహించాలని అన్నారు. నితీష్ భయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. హింసకు ప్రేరేపించింది బీజేపీ వారే అయినా సీఎం నితీష్ కుమార్ దీనికి బాధ్యత వహించాలని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్ పైనా ఆరోపణలు చేశారు. దళితుల భూములను గిరిరాజ్ సింగ్ ఆక్రమించిని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. హింసకు పాల్పడుతున్న నిందితులు ఎలాంటి భయం లేకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నితీష్ పిరికిపందలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గిరిరాజ్ సింగ్ బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నా నితీష్ కుమార్ చోద్యం చూస్తున్నారని అన్నారు. -
28 ఏళ్ల బచ్చాను.. నితీశ్ దుమ్ము దులిపా!
సాక్షి, పట్నా: ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓ లోక్‌సభ స్థానాన్ని, ఓ అసెంబ్లీ సీటును ఆర్జేడీ సొంతం చేసుకుంది. ఓ స్థానంలో మాత్రం బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొలుపొందారు. అయితే ఎన్నికలకు ముందు తాను ఏం చెప్పానో గుర్తుచేసుకోవాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఆర్జేడీ నేత, మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ సూచించారు. ఉప ఎన్నికల విజయాన్ని ఆస్వాదించే సమయం తన వద్ద లేదని రైతులు, రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై పోరాడాల్సి ఉందన్నారు తేజస్వీ. తాను 28 ఏళ్ల బచ్చానని, చాచా(నితీశ్) మీరు 67 ఏళ్ల వ్యక్తి అయినా ఎన్నికల్లో సత్తా చాటి చూపిస్తానని సీఎం నితీశ్‌కు వారం రోజుల ముందే చెప్పానన్నారు తేజస్వీ. బిహార్ మాజీ సీఎం, తేజస్వీ తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లిన తర్వాత జరిగే ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ధీమాగా ఉన్నారు. కానీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నితీశ్ వెనుకంజ వేస్తున్నారని ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని తేజస్వీ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో బీజేపీ బిహార్ రైతులకిచ్చిన ఇచ్చిన హామీల అమలుపై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ఎన్డీయేతర పార్టీల సీనియర్ నేతలు చర్చించుకుని 2019 ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహాలు రచించాలని లాలు తనయుడు ఆకాంక్షించారు. 'ఎన్డీఏ కూటమి నుంచి నేడు టీడీపీ వైదొలగింది. నితీశ్ ఇంకా ఏం విషయం తేల్చుకోలేక పోతున్నారు. మహా కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నితీశ్ తప్పిదం చేశారు. టీడీపీ బాటలో పయనించి మీరు ఎన్డీఏ నుంచి ఎప్పుడు బయటకొస్తారో చెప్పాలంటూ' నితీశ్‌ను తేజస్వీ ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు ఎన్డీఏ నుంచి వైదొలగే అంశంపై కామెంట్ చేసేంతే వరకూ తాను ప్రశ్నిస్తూనే ఉంటానని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. -
‘అతను పప్పు కాదు’
పట్నా: బిహార్‌లో లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ విజయం వెనుక కనిపించని శక్తి తేజస్వీ యాదవ్‌పై ప్రశంసలుకురుస్తున్నాయి. తండ్రి లాలూ ప్రసాద్ జైలుకెళ్లిన తరువాత ఎదుర్కొన్న మొదటి ఎన్నికల్లోనే ఆర్జేడీ ఘనవిజయం సాధించిన దరిమిలా.. ‘మా నాయకుడు పప్పు కాదు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని నడిపించగల సమర్థుడు’అంటూ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. అరారీయా , జహనాబాద్ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. అరారియా లోక్‌సభ స్థానంలో బీజేపీ ప్రత్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్‌పై 61 వేల పైచిలుకు ఓట్ల భారీ ఆధిక్యంతో ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలం గెలుపొందారు. సర్ఫరాజ్‌కు 5,09,334 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ప్రదీప్ కుమార్‌కు 4,47,346 ఓట్లు పోలయ్యాయి. ఆర్జేడీ ఎంపీ మహమ్మద్ తస్లిముద్దీన్ మృతితో ఈ అరారియాకకు ఉప ఎన్నిక జరుగగా.. తస్లిముద్దీన్ తనయుడు అలాంను ఆర్జేడీ బరిలోకి దింపింది. తండ్రి తర్వాత ఆయన తనయుడే అరారియాలో (ఆర్జేడీ) ఘనవిజయం సాధించింది. ఇక జహనాబాద్ అసెంబ్లీ స్థానాన్ని కూడా ఆర్జేడీ గెలుచుకుంది. ఆర్జేడీ అభ్యర్థి కృష్ణమోహన్ యాదవ్ ఇక్కడ విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి, జేడీయూకు చెందిన అభిరామ్ శర్మపై 35,000 ఓట్ల మెజార్టీతో కృష్ణమోహన్ గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లో ఆర్జేడీ విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు తేజస్వీపై ప్రశంసలు కురిపిస్తూ ప్రకటనలు చేస్తున్నారు.మహాకూటమి నుంచి జేడీయూ వైదొలిగిన తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నిక ఆ పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్‌కు పరీక్షగా నిలిచాయన్న సంగతి విదితమే. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల్లో తప్పేముంది..?
సాక్షి, పాట్నా: సరిహద్దులను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ సంస్థ చెబుతున్న మాటలపై వివాదం రేపడం సరికాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను బీహార్ సీఎం నితీష్ కుమార్ సమర్ధించారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు వివాదాస్పదమైనవా అంటూ ఎదురు ప్రశ్నించారు. అయితే మొత్తం వ్యవహారంపై తనకు అవగాహన లేదని అన్నారు. బీహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. సైనికులను తయారుచేసేందుకు సైన్యం ఆరేడు నెలలు తర్ఫీదు ఇస్తుంటే రాజ్యాంగం అనుమతిస్తే తాము మూడు రోజుల్లోనే సైనికులను సుశిక్షితులుగా తీర్చిదిద్దుతామని ఆయన వ్యాఖ్యానించారు. -
బిహార్ సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి
పట్నా/బక్సార్: బిహార్ సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. వికాస్ సమీక్షా యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం బక్సార్ జిల్లా డుమ్రావ్ వైపు వెళ్తుండగా నందన్ గ్రామం దగ్గర్లో దళితవాడలో తాము పడుతున్న ఇబ్బందులను గమనించేందుకు రావాలని కేకలు వేస్తూ కొందరు సీఎం వాహన శ్రేణిపైకి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎంసహా ఎవరూ గాయపడలేదు. రాళ్లను ఎవరు, ఎందుకు విసిరారో తెలియాల్సి ఉంది. కొందరు కావాలనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటూ అధికార జేడీయూ.. ఆర్జేడీపై విమర్శలు చేసింది. -
నితీశ్ కుమార్‌దే జేడీ(యూ): ఈసీ
న్యూఢిల్లీ: జేడీ(యూ)పై ఆధిపత్య పోరులో బిహర్ సీఎం నితీశ్ కుమార్ విజయం సాధించారు. పార్టీని, ‘బాణం’ గుర్తును ఆయనకే కేటాయిస్తున్నట్లు శుక్రవారం ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. జేడీ(యూ) పార్టీలోని మెజారిటీ శాసనసభ్యులు, జాతీయ కౌన్సిల్ నితీశ్‌కే మద్దతు తెలిపినట్లు పేర్కొంది. పార్టీని, గుర్తును తమకే కేటాయించాలంటూ శరద్ యాదవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ ఈసీ తిరస్కరించింది. బీజేపీకి మద్దతు, ఆర్జేడీతో తెగదెంపుల విషయంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు రావడంతో పార్టీ రెండుగా చీలింది. దీంతో జేయూ(యూ) అధ్యక్షుడిగా సీనియర్ నేత, ఎమ్మెల్యే చోటుభాయ్ అమర్సాంగ్ వాసవను శరద్ నియమించారు. తమదే అసలైన జేడీ(యూ) అని ఈసీని అమర్సాంగ్ కోరగా ఈసీ శుక్రవారం తన నిర్ణయం వెలువరించింది. -
'లాలూజీ.. మీరో విషయం అర్థం చేసుకోవాలి'
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ నిరుద్యోగి(పరోక్షంగా పని పాట లేని వ్యక్తి) అని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. అందుకే మరో పనిలేక తనపై కట్టుకథలు అల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించడం తప్ప మరో పని గురించి ఆలోచించే తీరికే లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకునే ప్రయత్నాల్లో నితీశ్ కుమార్ ఉన్నారంటూ ఆర్జేడీ అధినేత లాలూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. 'లాలూజీ మీరో విషయం అర్థం చేసుకోవాలి. మీరు (మీడియా ప్రతినిధులు) కూడా ఓ విషయం తెలుసుకోవాలి. ఎప్పుడు కొంతమందిని తన జేబులో పెట్టుకోవడం లాలూకు అలవాటు. అలా ఉండటానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నచ్చక బయటకు వెళుతున్నారు. దీంతో వారిని నైతికత లేనివారిగా అభివర్ణించడమే కాకుండా, మమ్మల్ని తప్పుబడుతున్నారు. కానీ, ఇందులో మా ప్రమేయం లేదు. బిహార్ అభివృద్ధికే మేం కట్టుబడి ఉన్నాం. ఆ విషయం అర్థం చేసుకుంటే మంచిది' అని నితీశ్ హితవు పలికారు. -
నితీశ్ కల చెదిరింది కథ మారింది..
న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కల చెదిరింది...కథ మారింది....ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా 2019 నాటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని విజయపథాన నడిపించి ప్రధాన మంత్రి కావాలనుకున్న ఆయన కల చెదిరింది. ఈ విషయంలో గత శనివారం నాడు రాహుల్ గాంధీతో జరిపిన మంతనాలు ఫలించలేదు. అందుకని ఆయన బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపి కథను మార్చేశారు. రాత్రికి రాత్రి కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూలతో కూడిన మహా కూటమి ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పారు. బీజేపీతో కలసి కొత్త ప్రభుత్వానికి కొలువుతీశారు. అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయిన డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ రాజీనామాకు ససేమిరా అనడం, ఆయన్ని ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ వెనకేసుకు రావడం తదితర పరిణామాలే మహా కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసిందనేది అర్ధ సత్యమేనన్నది రాజకీయ పరిశీలకుల భావన. ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ఖరారు చేయడంతో సెక్యులర్ భావాలుగల నితీశ్ కుమార్ 2013లో బీజేపీ పొత్తుకు రాం రాం పలికారు. ఇప్పుడు మళ్లీ అదే బీజేపీతో చేతులు కలిపారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ కలను కూడా చెదరగొట్టిందని చెప్పవచ్చు. 2019 నాటి పార్లమెంట్ ఎన్నికల నాటికి అవినీతికి ఆమడ దూరంగా, ముక్కుసూటిగా నడిచే వ్యక్తిగా పేరున్న నితీశ్ కుమార్‌ను ముందుపెట్టి ప్రతిపక్షాన్ని విజయపథాన నడిపించాలన్నది కాంగ్రెస్ గాంచిన కల. అసలు ఈ ఆలోచనకు, వ్యూహానికి ఊతమిచ్చిందే నితీశ్ కుమార్. ఈ కల కార్యరూపం దాల్చితే తానే ప్రధాన మంత్రిని కావాలన్నది నితీశ్ కుమార్ కలగా రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఈ విషయంలో ఇంతవరకు ఆయనకు కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వలేదు. ఆ నాటి పరిస్థితిని బట్టి అప్పుడే నిర్ణయం తీసుకుందామన్నది సోనియా గాంధీ మాటగా ప్రచారమైంది. శనివారం నాడు రాహుల్‌తో జరిపిన చర్చల్లో ప్రతిపక్ష కూటమికి ఆయనే నాయకుడని స్పష్టం చేసినట్లు తెల్సింది. 13 ఏళ్ల క్రితం యూపీఏకు నాయకత్వం వహించిన సోనియాకున్న పరిణతి, నాయకత్వ లక్షణాలు ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీకి లేవన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే అభిప్రాయం కలిగిన నితీశ్ కుమార్, ప్రధాన మంత్రి పదవి దక్కనప్పుడు ప్రస్తుతమున్న ముఖ్యమంత్రి పదవే ఎన్నో విధాల ఉత్తమమని భావించి మోదీ, అమిత్‌షాలు వేసిన స్కెచ్‌లో ఒదిగిపోయారు. -
మోదీ బంపర్ ఆఫర్
- లాలూను వదిలెయ్.. బీజేపీ మద్దతు తీస్కో.. - సీఎం నితీశ్‌కు బిహార్ బీజేపీ చీఫ్ సుశీల్ ఓపెన్ ఆఫర్ పట్నా: పశువుల దాణా కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో శరాఘాతం తిన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌పై రాజకీయదాడి మొదలైంది. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఆర్జేడీ, జేడీయూల మధ్య విబేధాలకు ఆజ్యం పోసేలా బిహార్ బీజేపీ చీఫ్ సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరుడైన లాలూతో తక్షణమే తెగదెంపులు చేసుకోవాలని సీఎం నితీశ్‌కుమార్‌ను సుశీల్ మోదీ కోరారు. ప్రభుత్వం నిలబడేందుకు అవసరమైతే బీజేపీ మద్దతు తీసుకోండని ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. దాణా కేసులో సోమవారం సుప్రీం తీర్పు అనంతరం మోదీ పట్నాలో విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం నితీశ్‌కు ఓపెన్‌గా చెబుతున్న.. తక్షణమే లాలూ స్నేహాన్ని వదిలెయ్యండి, ప్రభుత్వం పడిపోకుండా బీజేపీ మద్దతు తీస్కోండి’అని సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. గత సార్వత్రిక ఎన్నికల కంటే ముందు 17 సంవత్సరాలపాటు జేడీయూ- బీజేపీలు మిత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. కాగా, లాలూకు వ్యతిరేకంగా చక్రం తిప్పడంలోనూ నితీశ్ కీలక భూమిక పోషించారని సుశీల్ మోదీ ట్విస్ట్ ఇచ్చారు. సీఎం నితీశ్ కుమార్ ఆదేశాల మేరకే లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు ఆర్జేడీకి చెందిన మంత్రుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని మోదీ చెప్పారు. ‘లాలూ ఎవరెవరితో ఫోన్లో ఏమేం మాట్లాడుతున్నారో నితీశ్‌కు తెలుసు. లాలూను బలహీనపర్చడం ద్వారా 2019లో ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని సులువుగా పొందొచ్చన్నది నితీశ్ ఎత్తుగడ’ అని మోదీ ఆరోపించారు. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ప్రస్తుతం ఆర్జేడీకి 80, జేడీయూకు 71, బీజేపీకి 58, కాంగ్రెస్ పార్టీకి 27 సభ్యుల మద్దతు ఉంది. గత ఎన్నికల్లో ఆర్జేడీ-జేడీయూలు కలిసి పోటీచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. కాగా, సుశీల్ మోదీ ఆఫర్ పై సీఎం నితీశ్ స్పందించాల్సిఉంది. దాణా కేసులో లాలూకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు బిహార్ రాజకీయాలను ఎన్ని మలుపులు తిప్పుతుందో వేచిచూడాలి. (దాణా కుంభకోణం: సుప్రీం కోర్టులో లాలూకు ఎదురుదెబ్బ) -
ముఖ్యమంత్రికి ఎయిర్‌పోర్టులో షాక్
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో చిత్రమైన అనుభవం ఎదురైంది. వీఐపీలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన బ్యాటరీ కారులో ఆయన వెళ్లబోతుండగా.. ఓ ప్రయాణికుడు కోపంగా వచ్చి ఆయన ముందు సీట్లో కూర్చుని.. 'వీఐపీ సంస్కృతి వద్దు' అంటూ గట్టిగా అరిచాడు. ముంబై నుంచి విమానంలో దిగిన నితీష్ కుమార్ ఆ కారులో కూర్చోగానే అతడు వచ్చి అదే కారులో కూర్చుని అరవడం మొదలుపెట్టాడు. సెక్యూరిటీ వాళ్లు ఆ ప్రయాణికుడిని దిగాల్సిందిగా కోరినా.. అతడు వినలేదు. దాంతో ఏమీ చేయలేక అతడిని కూడా ఆ బ్యాటరీ కారులో తీసుకెళ్లారు. నితీష్ కుమార్ అంతర్జాతీయ లాంజ్ వద్ద దిగిపోగా, రెండో ప్రయాణికుడు మాత్రం ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు వెళ్లాడు. ఢిల్లీ విమానాశ్రయంలో ఎస్కలేటర్లు, వాకలేటర్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నా, వీఐపీలను మాత్రం గోల్ఫ్ కార్ట్ తరహా బ్యాటరీ కార్లలో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు తీసుకెళ్తారు. అలాంటివి మొత్తం 30 కార్లు ఉన్నాయి. ముంబై నుంచి నితీష్ వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 310లోనే వచ్చిన ఆ ప్రయాణికుడు.. నేరుగా వచ్చి నితీష్ ఎదురుసీట్లో కూర్చుండిపోయాడు. సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా విమానాశ్రయాల్లో వీఐపీగానే చూస్తారు. వాళ్లకు వ్యక్తిగత భద్రత కల్పిస్తారు. నితీష్‌తో పాటు బ్యాటరీ కారులో కూర్చున్న వ్యక్తి ఆయనకు ఎలాంటి హాని కల్పించకపోవడం, హింసాత్మకంగా ప్రవర్తించకపోవడంతో తాము కూడా మరీ బలవంతం చేయలేదని, ముఖ్యమంత్రి సైతం ఎలాంటి అభ్యంతర వ్యక్తం చేయలేదని విమానాశ్రయాలలో భద్రతా ఏర్పాట్లు చూసే సీఐఎస్ఎఫ్ దళాలు తెలిపాయి. ఒకవైపు వీఐపీ సంస్కృతి వద్దంటూ మంత్రులు, ఇతరుల కార్లమీద ఎర్రబుగ్గలు తీసేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయిస్తే.. మరోవైపు విమానాశ్రయాలలో మాత్రం ఇలా కొంతమందిని ప్రత్యేకంగా చూడటం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అస్సలు నడవలేనివాళ్లు, వృద్ధులు, రోగులకైతే పర్వాలేదు గానీ అంతా బాగానే ఉన్నవారికి ప్రత్యేకంగా ఇలా గోల్ఫ్ కార్టులు కల్పించడం ఎందుకన్న వాదనలున్నాయి.