బిహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసిన పాట్నా హైకోర్టు
విద్యా, ఉద్యోగాల్లో కోటా పెంచడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టీకరణ
పాట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విద్యా, ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది.
రిజర్వేషన్లు పెంచుతూ 2023 నవంబర్‌లో ప్రభుత్వం తీసుకొచి్చన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. రిజర్వేషన్లు పెంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది.
రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 16ని ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రితికా రాణి చెప్పారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో తీర్పును రిజర్వ్ చేసిందని, గురువారం తుది తీర్పు ఇచి్చందని వెల్లడించారు.
ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు పౌరులంతా సమానమే. ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగం, ఉపాధి విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు కలి్పంచాలి.
కుల గణన ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచినట్లు బిహార్ ప్రభుత్వం న్యాయస్థానంలో వాదించిందని పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది నిర్భయ్ ప్రశాంత్ తెలిపారు. ఇంద్ర సహానీ కేసుతోపాటు మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో కోటాను 50 శాతానికి మించి పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు తేలి్చచెప్పిందని గుర్తుచేశారు.
75 శాతానికి చేరిన రిజర్వేషన్లు
బిహార్ ప్రభుత్వం కుల గణన నిర్వహించింది. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ) 63 శాతం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఎస్సీ, ఎస్టీలు కలిపి 21 శాతానిపైగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్రభుత్వం గతంలోనే ఈబీసీలకు 10 రిజర్వేషన్లు కలి్పంచింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదు కాబట్టి రిజర్వేషన్ చట్టాల్లో సవరణలు చేసింది.
ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. 50 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల కోటాను 65 శాతానికి పెంచేసింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బిహార్‌లో ఈబీసీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకున్నాయి. సవరించిన రిజర్వేషన్ చట్టాలను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి బిహార్ సర్కారు విజ్ఞప్తి చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల జాబితా తొమ్మిదో షెడ్యూల్‌లో ఉంది. ఈ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలను కోర్టుల్లో సవాలు చేసేందుకు అవకాశం ఉండదు. సుప్రీంకోర్టు 1992లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బిహార్ సర్కారు రిజర్వేషన్లు పెంచడాన్ని సవాలు చేస్తూ పలువురు పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment