ఆదివారం ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌తో సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంలు సమ్రాట్ చౌదరి, వీకే సిన్హా; నితీశ్‌కుమార్‌తో జేపీ నడ్డా ముచ్చట్లు
పట్నా: బిహార్ రాజకీయ రగడకు ఊహించిన విధంగానే తెర పడింది. గోడదూకుళ్లకు పెట్టింది పేరైన జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మళ్లీ కూటమి మారారు. ఆదివారం ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్ సర్కారుకు చరమగీతం పాడారు.
సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తద్వారా 72 ఏళ్ల నితీశ్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ బీజేపీ చీఫ్ సమ్రాట్ చౌధరి, పార్టీ నేత విజయ్‌కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి.
నితీశ్ చర్యపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పారీ్టలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల ని్రష్కమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
‘‘ఆయన ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. ఎన్డీఏలోకి వెళ్లడం ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలు, ఆయన కుమారుడు తేజస్వి కూడా నాకు చెప్పారు. కానీ ఇండియా కూటమి చెదిరిపోకుండా ఉండాలని నేను బయటికి చెప్పలేదు’’ అన్నారు. ఆట ఇప్పుడే ఆరంభమైందని తేజస్వి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) మట్టి కరవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు. నితీశ్‌ది ద్రోహమంటూ సీపీఐ (ఎంఎల్) దుయ్యబట్టింది.
గోడ దూకుడుకు పర్యాయపదంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్సీపీ (శరద్ పవార్) ఎద్దేవా చేసింది. ‘‘స్నోలీగోస్టర్ (విలువల్లేని వ్యక్తి) పదం నితీశ్‌కు బాగా సరిపోతుంది. ఇదే వర్డ్ ఆఫ్ ద డే’’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చమత్కరించారు. పదేపదే కూటములు మార్చడం నితీశ్‌కు పరిపాటేనని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. జేడీ(యూ) మాత్రం కాంగ్రెస్ స్వార్థపూరిత వైఖరి వల్లే నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని చెప్పుకొచి్చంది. కొత్త సర్కారుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహారీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇక ఎటూ వెళ్లను: నితీశ్
అంతకుముందు ఆదివారం రోజంతా పట్నాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఉదయమే జేడీ(యూ) శాసనసభా పక్షం నితీశ్ నివాసంలో భేటీ అయింది. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కును ఆయనకు కట్టుబెడుతూ తీర్మానించింది. వెంటనే నితీశ్ రాజ్‌భవన్‌కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా సమరి్పంచారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మహాఘట్‌బంధన్‌లో పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్లే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్‌కు మద్దతిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఆ వెంటనే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాల్సిందిగా గవర్నర్‌ను నితీశ్ కోరడం, సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత నితీశ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏను వీడి ఇకపై ఎటూ వెళ్లేది లేదని చెప్పుకొచ్చారు. ఆయన తమ సహజ భాగస్వామి అని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. జేడీ(యూ)తో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో మొత్తం 40 సీట్లనూ స్వీప్ చేస్తామని అన్నారు
ఇండియా కూటమికి చావుదెబ్బ!
తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇచి్చన ఇటీవలి షాక్‌లకు ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి నితీశ్ తాజా ని్రష్కమణతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో అన్ని స్థానాల్లోనూ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడం తెలిసిందే. పంజాబ్‌లోనూ ఆప్‌ది ఒంటరిపోరేనని రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కూడా అదే రోజు స్పష్టం చేశారు.
అధికారమే పరమావధి
2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్‌బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు.
18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు.
Comments
Please login to add a commentAdd a comment