'ఒక్క గెలుపుతో గర్వం వద్దు'
పాట్నా: కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఈనెల 14న నిర్ణయం తీసుకుంటామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. శనివారం మంత్రివర్గ సమావేశం జరుగుతుందని చెప్పారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ప్రస్తుత శాసనసభను రద్దు చేయాలని గవర్నర్ ను తాము కోరతామని తెలిపారు. బుధవారం ఆయన బిహార్ గవర్నర్ రామనాథ్ కొవింద్ ను కలిశారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ తో చర్చించారు.
భేటీ అనంతరం నితీశ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలను గౌరవిస్తామని, రాష్ట్రాభివృద్ధికి వారు తమతో కలిసిరావాలని అన్నారు. ఒక్క గెలుపుతో గర్వం నెత్తికెక్కించుకోవాల్సిన అవసరం లేదని, అది వ్యక్తిత్వం కాదని అన్నారు. కాగా, ఈనెల 20న నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని జేడీ(యూ) నిర్ణయించింది.