సితాబ్ దియారా: తమ జేడీ(యూ) పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చాడని జేడీ(యూ) చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. సామాజికవేత్త జయప్రకాశ్ నారాయణ్ జన్మస్థలి సితాబ్ దియారాలో పర్యటించిన నితీశ్ శనివారం అక్కడి మీడియాతో మాట్లాడారు. ‘ రెండు వారాల క్రితం ప్రశాంత్ కిశోర్ నా వద్దకు వచ్చారు. నేనేం అతడిని పిలవలేదు. జేడీయూను కాంగ్రెస్‌లో కలిపేస్తే మంచిదని నాలుగైదేళ్ల క్రితమే నాకు సలహా ఇచ్చాడు.
ఇప్పడేమో చాలాసేపు ఏవోవో అంశాలు మాట్లాడుతున్నాడు. నాకప్పుడే అర్థమైంది ప్రశాంత్ బీజేపీ తరఫున పనిచేస్తున్నాడని ’ అని నితీశ్ చెప్పారు. ‘10–15 రోజుల క్రితం నితీశే నన్ను పిలిచారు. తన జేడీయూ పార్టీకి సారథ్యం వహించాలని కోరారు. నేను తిరస్కరించా. మళ్లీ జేడీయూలో చేరలేనని చెప్పా’ అని మంగళవారం ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించిన నాలుగు రోజులకే నితీశ్ స్పందించడం గమనార్హం. ఐ–ప్యాక్‌కు సారథ్యం వహిస్తూ 2018లో జేడీయూలో చేరిన ప్రశాంత్‌కు జాతీయ పౌరసత్వం సవరణ చట్టంపై నితీశ్‌తో అభిప్రాయ భేదాలొచ్చాయి. దీంతో పార్టీ నుంచి ప్రశాంత్‌ను బహిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment