merger proposal
-
సోనీపై ఎన్సీఎల్టీకి జీ
న్యూఢిల్లీ: ప్రతిపాదిత విలీన డీల్‌ను రద్దు చేసుకోవాలన్న సోనీ నిర్ణయంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించినట్లు జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) వెల్లడించింది. అలాగే 90 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 748.5 కోట్లు) టెరి్మనేషన్ ఫీజు కట్టాలన్న సోనీ నోటీసులపై కూడా తగు చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వివరించింది. రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీల్ సమాచారమిచ్చింది. జపాన్‌కి చెందిన సోనీ గ్రూప్ భారత విభాగం (కల్వర్ మ్యాక్స్), జీల్ విలీన ప్రతిపాదన రద్దయిన సంగతి తెలిసిందే. సంబంధిత వర్గాల కథనాల ప్రకారం విలీన కంపెనీ సారథ్య బాధ్యతలను జీ సీఈవో పునీత్ గోయెంకాకు అప్పగించడాన్ని ఇష్టపడకపోవడం వల్ల సోనీ గ్రూప్ ఈ డీల్‌ను రద్దు చేసుకుంది. ఆర్థిక మంత్రికి సుభాష్ చంద్ర లేఖ.. విలీన డీల్ నుంచి సోనీ వైదొలగడానికి కొద్ది రోజుల ముందు జనవరి 16న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర లేఖ రాశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. ఈ ఒప్పందం కుదరకుండా చేసేందుకు ప్రయతి్నస్తోందంటూ అందులో ఆరోపించారు. జీ నిధులను దురి్వనియోగం చేశారంటూ చంద్ర, ఆయన తనయుడు పునీత్ గోయెంకాపై సెబీ చర్యలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో సెబీ విచారణ జరపరాదని తాను అనడం లేదని, కాకపోతే సరిగ్గా డీల్ కుదిరే సమయంలో సెబీ ఇందుకు సంబంధించిన నోటీసులివ్వడానికి కారణమేమిటనేదే తన ఆందోళన అని చంద్ర పేర్కొన్నారు. జీల్ మైనారిటీ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్థిక మంత్రి ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ఆయన అభ్యరి్ధంచారు. -
సెయిల్ లేదా ఎన్ఎండీసీలో వైజాగ్ స్టీల్ విలీన ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్‌ను (ఆర్ఐఎన్ఎల్) సెయిల్, ఎన్ఎండీసీలో విలీనం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్లో 4,875 మంది ఎగ్జిక్యూటివ్‌లు, 10,005 మంది నాన్–ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారని రాజ్యసభకు రాతపూర్వక సమాధానంలో ఆయన వివరించారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేనందున రిక్రూట్‌మెంట్‌ను క్రమబద్ధీకరించినట్లు కులస్తే పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ లేదా బాండ్ల జారీ ద్వారా ఆర్ఐఎన్ఎల్ నిధులు సమీకరించే యోచనేదీ లేదని తెలిపారు. -
Zee-Sony merger: మూడు ఛానెళ్లు అమ్మకానికి..
న్యూఢిల్లీ: ప్రతిపాదిత మెగా విలీన ప్రతిపాదనకు సంబంధించి మూడు చానెళ్ల విక్రయంపై సీసీఐ విధించిన నిబంధనలకు మీడియా గ్రూప్‌లు సోనీ, జీ అంగీకరించాయి. హిందీ చానెళ్లయిన బిగ్ మ్యాజిక్, జీ యాక్షన్, జీ క్లాసిక్‌లను విక్రయించేలా విలీన ఒప్పందానికి స్వచ్ఛందంగా మార్పులు చేస్తూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కి ప్రతిపాదన సమర్పించాయి. బుధవారం విడుదల చేసిన 58 పేజీల ఉత్తర్వుల్లో సీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. వివరాల్లోకి వెడితే.. సీఎంఈ (గతంలో సోనీ పిక్చర్స్ – ఎస్పీఎన్ఐ)లో జీ ఎంటర్టైన్మెంట్ (జీల్), బంగ్లా ఎంటర్టైన్మెంట్ (బీఈపీఎల్) విలీనానికి అక్టోబర్ 4న సీసీఐ కొన్ని షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ఆయా విభాగాల్లో పోటీపై ప్రతికూల ప్రభావం పడకుండా మూడు హిందీ చానెళ్ల విక్రయానికి కొన్ని నిబంధనలు విధించింది. వీటి ప్రకారం సదరు చానెళ్లను స్టార్ ఇండియా లేదా వయాకామ్18కి విక్రయించకూడదు. వాటిని నడిపే ఆర్థిక సత్తా, అనుభవం ఉన్న కొనుగోలుదారులకే అమ్మాలి. ఈ మేరకు విలీన ఒప్పందంలో స్వచ్చందంగా మార్పులు చేసి సమర్పించాలని సీసీఐ సూచించింది. దానికి అనుగుణంగానే జీ, సోనీ తమ ప్రతిపాదనలను సమర్పించాయి. -
మా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలట
సితాబ్ దియారా: తమ జేడీ(యూ) పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చాడని జేడీ(యూ) చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. సామాజికవేత్త జయప్రకాశ్ నారాయణ్ జన్మస్థలి సితాబ్ దియారాలో పర్యటించిన నితీశ్ శనివారం అక్కడి మీడియాతో మాట్లాడారు. ‘ రెండు వారాల క్రితం ప్రశాంత్ కిశోర్ నా వద్దకు వచ్చారు. నేనేం అతడిని పిలవలేదు. జేడీయూను కాంగ్రెస్‌లో కలిపేస్తే మంచిదని నాలుగైదేళ్ల క్రితమే నాకు సలహా ఇచ్చాడు. ఇప్పడేమో చాలాసేపు ఏవోవో అంశాలు మాట్లాడుతున్నాడు. నాకప్పుడే అర్థమైంది ప్రశాంత్ బీజేపీ తరఫున పనిచేస్తున్నాడని ’ అని నితీశ్ చెప్పారు. ‘10–15 రోజుల క్రితం నితీశే నన్ను పిలిచారు. తన జేడీయూ పార్టీకి సారథ్యం వహించాలని కోరారు. నేను తిరస్కరించా. మళ్లీ జేడీయూలో చేరలేనని చెప్పా’ అని మంగళవారం ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించిన నాలుగు రోజులకే నితీశ్ స్పందించడం గమనార్హం. ఐ–ప్యాక్‌కు సారథ్యం వహిస్తూ 2018లో జేడీయూలో చేరిన ప్రశాంత్‌కు జాతీయ పౌరసత్వం సవరణ చట్టంపై నితీశ్‌తో అభిప్రాయ భేదాలొచ్చాయి. దీంతో పార్టీ నుంచి ప్రశాంత్‌ను బహిష్కరించారు. -
జీ -సోనీ డీల్..! వారం రోజుల్లో సుమారు రూ. 50 కోట్ల లాభం..!
భారత మీడియా రంగంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మధ్య విలీనం ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందానికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జీ ఎంటర్టైన్మెంట్కు 47.07 శాతం, సోనీ పిక్చర్స్ కు 52.93 శాతం మేర వాటాలు దక్కనున్నాయి. విలీనం తర్వాత సోనీ పిక్చర్స్ 1.575 బిలియన్ డాలర్ల నిధుల్ని పెట్టుబడిగా పెట్టనుంది. చదవండి: సోనీటీవీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం ! కాసుల వర్షం కురిపించిన ఒప్పందం...! జీ, సోనీ నెట్వర్క్స్ మధ్య జరిగిన ఒప్పందం...స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేశ్ జున్‌జున్‌వాలాకు కాసుల వర్షం కురిపించింది. జీ, సోనీ నెట్‌వర్క్స్‌ల విలీన వార్తలతో బుధవారం మార్కెట్లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) షేర్లు 30% పైగా పెరిగాయి. దీంతో బిగ్‌బుల్‌కు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. గతవారం రాకేశ్ జున్‌జున్‌వాలా సుమారు 50లక్షల జీల్ షేర్లను కొనుగోలు చేశారు. జీల్ ఒక్కో షేర్‌ను రూ. 220.4 కు కొనుగోలు చేయగా ప్రస్తుతం వాటి విలువ ఏకంగా రూ. 337 పెరిగింది. దీంతో రాకేశ్ 50 శాతం మేర లాభాలను గడించారు. జీ మీడియా చీఫ్ పునీత్ గోయెంకా బోర్డు నుంచి తప్పుకున్న రోజునే రాకేశ్తోపాటుగా , యూరప్‌కు చెందిన బోఫా సెక్యూరిటీస్ సుమారు 50 లక్షల షేర్లను కొన్నారు. కాగా పలువురు ఈ డీల్ గురించి ముందే తెలిసి జీల్ భారీగా షేర్లను కొన్నట్లు సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కచ్చితంగా ఇన్సైడర్ ట్రేండింగ్ జరిగి ఉండవచ్చునని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జీ సీఈఓగా ఉన్న పునీత్ గోయెంకా విలీన సంస్థకు ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓగా వ్యవహరించడం గమనార్హం. దక్షిణాసియాలో ప్రధాన మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీగా నిలబెట్టేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే కంపెనీ వాటాదార్లకూ ఇది లాభదాయకమని జీ మీడియా వెల్లడించింది. చదవండి: చైనాకు కేంద్రం మరో షాక్ ఇవ్వనుందా..? -
సోనీటీవీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం !
భారత మీడియా రంగంలో రెండు సంస్థల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. సోనీ టీవీలో..జీ ఎంటర్ టైన్మెంట్ విలీనమైంది. కంటెంట్ క్రియేషన్‌లో గత మూడు దశాబ్దాలుగా వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటున్న జీఎంటర్ టైన్మెంట్ పలు కీలక పరిణామల నేపథ్యంలో సోనీ టీవీలో విలీనం అయ్యేందుకు సిద్ధ పడింది. ఇందుకు జీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలపడంతో విలీనం ఖరారైంది. దీంతో విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో జీ ఎంటర్టైన్మెంట్కు 47 శాతం, ఎస్పీఎన్ఐకు 52 శాతం వాటాలు దక్కనున్నాయి. ప్రస్తుతం జీ ఎంటర్ టైన్మెంట్ సీఈఓగా ఉన్న పునీత్ గోయెంకా విలీన సంస్థకు ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓగా వ్యవహరించనున్నారు. జీ లెర్న్, జీ మీడియాకూ సెగ! మరో వైపు జీ ఎంటర్టైన్మెంట్, డిష్ టీవీ తదుపరి జీ లెర్న్, జీ మీడియాలపై సుభాష్ చంద్ర కుటుంబానికి వాటాదారుల నుంచి అసమ్మతి సెగ తగలనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.తొలుత డిష్ టీవీలో సవాళ్లు ఎదురుకాగా..గత వారం జీ ఎంటర్టైన్మెంట్ నుంచి ప్రమోటర్లతో పాటు,పునీత్ గోయెంకా అధ్యక్షతన ఏర్పాటైన మేనేజ్మెంట్ను తొలగించడంపై ఈజీఏం ఏర్పాటుకు డిమాండ్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ లెర్న్, జీ మీడియా నుంచి సైతం సుభాష్ చంద్రకు చెందిన ప్రమోటర్ ఎస్సెల్ గ్రూప్‌నకు వ్యతిరేకంగా వాటాదారులు గళమెత్తే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈజీఎం ఏర్పాటుకు వాటాదారులు పట్టుబట్టే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డాయి. అయితే జీ ఎంటర్టైన్మెంట్లో సుభాష్ చంద్ర వాటా 3.99 శాతమేకాగా.. జూన్‌కల్లా జీ లెర్న్‌లో 21.69 శాతం, జీ మీడియా కార్పొరేషన్లో 14.72 శాతం చొప్పున ప్రమోటర్లు వాటాను కలిగి ఉన్నారు. -
క్రాఫ్ట్ భారీ ఆఫర్... యూనిలీవర్ నో!
• 143 బిలియన్ డాలర్లు ఇస్తా్తనన్న క్రాఫ్ట్ • ఈ విలువ మాకు తగింది కాదు: లీవర్ న్యూయార్క్: అమెరికాకు చెందిన ఫుడ్, బెవరేజెస్ దిగ్గజం క్రాఫ్ట్ హీంజ్ చేసిన విలీన ప్రతిపాదనను డచ్ దిగ్గజ సంస్థ యూనిలీవర్ తిరస్కరించింది. విలీనానికి సంబంధించి క్రాఫ్ట్ తమను తగిన విధంగా విధంగా విలువ కట్టలేదని పేర్కొంది. తమ గ్రూప్ విలువతో పోలిస్తే క్రాఫ్ట్ ప్రతిపాదించిన 143 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ చాలా తక్కువని, ఈ డీల్ వల్ల షేర్హోల్డర్లలకు ఆర్థికంగా గానీ లేదా ఇతరత్రా మరే రూపంలో గానీ లాభం ఏదీ ఉండదని యూనిలీవర్ పేర్కొంది. అందుకని దీనిపై తదుపరి చర్చలు జరిగే అవకాశాలేమీ లేవని స్పష్టం చేసింది. అయితే డీల్ వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా యూనిలీవర్ షేర్లు కొనుగోలు చేశారు. దీంతో లండన్ ఎక్సే్చంజ్‌లో సంస్థ షేర్లు దాదాపు 12 శాతం ఎగిశాయి. ఫుడ్ అండ్ బెవరేజ్ విభాగానికి సంబంధించి క్రాఫ్ట్ హీంజ్ ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద సంస్థ కాగా, ఉత్తర అమెరికాలో మూడో స్థానంలో ఉంది. డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 6.86 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. క్రాఫ్ట్ మార్కెట్ వేల్యుయేషన్ సుమారు 106 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు డచ్ కంపెనీ అయిన యూనిలీవర్ 2016లో సుమారు 56.1 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. డవ్, లిప్టన్, నార్ తదితర ప్రముఖమైన బ్రాండ్స్ 400 పైగా ఈ కంపెనీకి ఉన్నాయి. లండన్ స్టాక్ మార్కెట్లో శుక్రవారం భారీగా పెరిగాక యూని లీవర్ మార్కెట్ విలువ దాదాపు 140 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో క్రాఫ్ట్ చేసిన ప్రతిపాదన దాదాపు దీని మార్కెట్ విలువకు సమానంగా ఉన్నట్లయింది. అందుకే యూనిలీవర్ ఈ డీల్‌ను తిరస్కరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రయత్నాలు కొనసాగిస్తాం...: క్రాఫ్ట్ యూనిలీవర్ తమ ఆఫర్‌ను తిరస్కరించినప్పటికీ మరింత ఆమోదయోగ్యమైన ఒప్పంద ప్రతిపాదనపై కసరత్తు కొనసాగించనున్నట్లు క్రాఫ్ట్ పేర్కొంది. డీల్ వార్తలతో అమెరికా మార్కెట్లో క్రాఫ్ట్ షేరు ధర ఒక దశలో 7.5 శాతం ఎగిసి 93.81 డాలర్ల వద్ద, యూనిలీవర్ 9.5 శాతం పెరిగి 46.62 డాలర్ల స్థాయి వద్ద ట్రేడయ్యాయి. ఒకవేళ విలీనం సాకారమైతే గుత్తాధిపత్య ధోరణులతో కొనుగోలుదారుల ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని, భారీ స్థాయిలో ఉద్యోగాల కోత అవకాశాల కారణంగా రాజకీయంగా ప్రకంపనలు కూడా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
హెచ్డీఎఫ్సీ ‘మ్యాక్స్’ లైఫ్!
మ్యాక్స్ లైఫ్, ఫైనాన్షియల్లకు విలీన ప్రతిపాదన ♦ ప్రాథమికంగా అంగీకరించిన కంపెనీల బోర్డులు... ♦ తదుపరి చర్చలకు శ్రీకారం... ♦ విలీనమైతే ఏయూఎం రూ. లక్ష కోట్లకు... ♦ దేశీ బీమా రంగంలో అతిపెద్ద ఒప్పందం! ♦ ప్రైవేటు రంగంలో అగ్రగామి బీమా కంపెనీగా ఆవిర్భావం ♦ 20% దూసుకెళ్లిన మ్యాక్స్ ఫైనాన్షియల్ షేరు న్యూఢిల్లీ: దేశీ బీమా రంగంలో అతిపెద్ద విలీన-కొనుగోలు ఒప్పందానికి తెరలేచింది. మ్యాక్స్ లైఫ్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలను విలీనం చేసుకునేందుకు హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనకు మూడు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు శుక్రవారం ప్రాథమికంగా అంగీకారం తెలిపాయి. విలీనానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించడం, తదుపరి చర్చల కోసం ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. వాటాల మార్పిడి(స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్) రూపంలో మ్యాక్స్ లైఫ్, మ్యాక్స్ ఫైనాన్షియల్‌ను హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో విలీనం చేసుకోవడానికి మదింపు చేపట్టనున్నట్లు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రతిపాదిత విలీనం పూర్తయితే హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ(ఏయూఎం) ఏకంగా రూ. లక్ష కోట్లకు చేరనుంది. మొత్తం బీమా ప్రీమియం దాదాపు రూ.26,000 కోట్లకు ఎగబాకుతుంది. ప్రస్తుతం దేశంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే రూ. లక్ష కోట్ల ఏయూఎంలను ప్రకటించింది. కాగా, ఇటీవలే హెచ్డీఎఫ్సీ గ్రూప్‌నకు చెందిన సాధారణ బీమా కంపెనీ హెచ్డీఎఫ్సీ ఎర్గో... ఎల్అండ్టీ జనరల్ ఇన్సూరెన్స్‌ను రూ.551 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణ బీమా రంగంలో ఇది తొలి కొనుగోలు డీల్‌గా రికార్డుకెక్కింది. ఇప్పుడు మ్యాక్స్ లైఫ్‌ను హెచ్డీఎఫ్సీ లైఫ్ విలీనం చేసుకుంటే... దేశీ బీమా రంగంలో అతిపెద్ద డీల్‌గా రికార్డు సృష్టిస్తుంది. అంతేకాదు అతిపెద్ద ప్రైవేటు రంగ బీమా కంపెనీగా కూడా ఆవిర్భవిస్తుంది. వాటాలు ఇలా... హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ జాయింట్ వెంచర్(జేవీ)లో ఎడిన్‌బరోకు చెందిన స్టాండర్డ్ లైఫ్ పీఎల్‌సీకి 35 శాతం వాటా ఉంది. 61.63 శాతం వాటా మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ చేతిలో ఉంది. ఇక ఈ ఏడాది మార్చి చివరినాటికి హెచ్డీఎఫ్సీ లైఫ్ మొత్త ప్రీమియం రూ.16,313 కోట్లుగా నమోదైంది. ఏయూఎం రూ.72,247 కోట్లు. ఇక మ్యాక్స్ లైఫ్ జేవీవిషయానికొస్తే... ఇందులో దీని హోల్డింగ్ కంపెనీ అయిన(స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉంది) మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు 68 శాతం వాటా, జపాన్‌కు చెందిన మిత్సుయి సుమిటొమో ఇన్సూరెన్స్ కంపెనీకి 26 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి చివరికి మ్యాక్స్ లైఫ్ మొత్తం ప్రీమియం రూ. 9,216 కోట్లు కాగా, ఏయూఎం రూ.35,824 కోట్లుగా నమోదైంది. ప్రతిపాదిత ప్రాథమిక ఒప్పందం.. విలీన సాధ్యాసాధ్యాల మదింపు, సంబందిత కంపెనీల బోర్డులు, వాటాదారులు నియంత్రణ-కోర్టుపరమైన అనుమతులు ఇతరత్రా ఆమోదాలపై ఆధారపడి కార్యరూపం దాల్చుతుందని హెచ్డీఎఫ్సీ ప్రకటన తెలిపింది. ప్రస్తుతం బీమా రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ) అనుమతి ఉన్న విషయం విదితమే. దేశంలో మొత్తం 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ రంగ ఎల్ఐసీ ఈ రంగంలో 70 శాతానికిపైగా మార్కెట్ వాటాతో నంబర్‌వన్‌గా నిలుస్తోంది. ఆటోమేటిక్ లిస్టింగ్..! రెండంచెల్లో జరిగే ఈ విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ లైఫ్ ఎలాంటి ఐపీఓ(పబ్లిక్ ఆఫర్) లేకుండానే ఆటోమేటిక్‌గా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానుంది. ఇప్పటికే మ్యాక్స్ లైఫ్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ మ్యాక్స్ ఫైనాన్షియల్ లిస్టయి ఉండటమే దీనికి కారణం. కాగా, విలీనం తర్వాత ఆవిర్భవించే లిస్టెడ్ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.45,000-50,000 కోట్లుగా ఉంటుందని అంచనా. దీంతో దేశంలో ఏకైక, అతిపెద్ద లిస్టెడ్ బీమా కంపెనీగా అవతరిస్తుంది. విలీనానంతరం కొనసాగే కంపెనీలో హెచ్డీఎఫ్సీ, స్టాండర్డ్ లైఫ్, అజీమ్ ప్రేమ్‌జీలకు కలిపి 60-65% వాటా ఉంటుంది. అనల్జిత్ సింగ్‌తో పాటు మిత్సుయి సుమిటొమో ఇన్సూరెన్స్ కంపెనీ, గోల్డ్‌మన్ శాక్స్, కేకేఆర్, యాక్సిస్ బ్యాంక్ ఇతర సాధారణ ఇన్వెస్టర్లకు మ్యాక్స్ గ్రూప్‌కు 35-40% వాటా(షేర్ల రూపంలో) లభిస్తాయి. గతేడాది మ్యాక్స్ ఇండియాను మూడు విభాగాలుగా అనల్జిత్ సింగ్ విడగొట్టిన సంగతి తెలిసిందే. లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాన్ని మ్యాక్స్ ఫైనాన్షియల్ అనే హోల్డింగ్ కంపెనీ కిందికి చేర్చి పరోక్షంగా పూర్తిస్థాయి తొలి బీమా లిస్టెడ్ కంపెనీగా చేశారు. ‘మ్యాక్స్’ షేరు రయ్య్.్ర.. హెచ్డీఎఫ్సీ లైఫ్‌తో విలీన ప్రతిపాదన నేపథ్యంలో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్(మ్యాక్స్ లైఫ్‌కు హోల్డింగ్ కంపెనీ) షేరు ధర దూసుకెళ్లింది. శుక్రవారం బీఎస్ఈలో ఒకానొక దశలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.514.40కు చేరింది. అయితే, ఆతర్వాత మళ్లీ తగ్గుముఖం పట్టి చివరకు 10.29 శాతం లాభంతో రూ.473 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈలోనూ ఇదే స్థాయిలో దూసుకెళ్లి చివరకు 10.5 శాతం లాభపడి రూ.474 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 9 లక్షలు, ఎన్ఎస్ఈలో 82 లక్షల చొప్పున షేర్లు చేతులు మారాయి. షేరు జోరు కారణంగా ఒక్కరోజులో కంపెనీ మార్కెట్ విలువ రూ.1,180 కోట్లు ఎగబాకి రూ.12,625 కోట్లకు చేరింది. -
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో సమ్మె విజయవంతం
♦ మాతృసంస్థలో విలీన ప్రతిపాదనకు నిరసన ♦ జూన్ 7, జూలై 28న కూడా సమ్మె ప్రకటన ♦ జూలై 29న పూర్తి బ్యాంకింగ్ సమ్మె ముంబై: మాతృసంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో విలీన ప్రతిపాదనను నిరసిస్తూ... శుక్రవారం దేశ వ్యాప్తంగా సంబంధిత ఐదు బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేశారు. దాదాపు 50,000 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. రానున్న నెలల్లో మరిన్ని ఆందోళనలు తప్పవనీ ఉద్యోగ సంఘాలు ఈ సందర్భంగా హెచ్చరించాయి. ఇందులో భాగంగా జూన్ 7, జూలై 28వ తేదీలు కూడా ఉద్యోగులు సమ్మె చేస్తారని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ విశ్వాస్ ఉద్ఘీ పేర్కొన్నారు. ఎస్బీఐ యాజమాన్య అహంకార, పెద్దన్న, పక్షపాత ధోరణిని కూడా తీవ్రంగా నిరసిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం తరహాలోనే జూన్ 7, జూలై 28వ తేదీల్లో ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె జరుపుతారని, అటు తర్వాత జూలై 29న బ్యాంకింగ్ పరిశ్రమ మొత్తం సమ్మె చేస్తుందని పేర్కొన్నారు. ఈ బలవంతపు విలీన ప్రతిపాదనను ఇతర ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వివరించారు. ఈ తరహా వైఖరిని వాణిజ్య సంఘాలతో పాటు, అన్ని రాజకీయ పార్టీలు సైతం వ్యతిరేకించాలని కోరారు. ఐదు అనుబంధ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్; హైదరాబాద్; మైసూర్; పాటియాలా; ట్రావెన్కోర్లు ఉన్నాయి. వీటికి దేశ వ్యాప్తంగా 67,000 బ్రాంచ్‌లు, 9,000 ఏటీఎంలు ఉన్నాయి. మార్చి నాటికి ఈ బ్యాంకుల వ్యాపారం మొత్తం రూ.9,00,000 కోట్లు. నిర్వహణా లాభం రూ.10,500 కోట్లు. విలీన వ్యయం రూ.1,660 కోట్లు: మూడీస్ ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులుసహా భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) విలీన ప్రక్రియకు దాదాపు రూ.1,660 కోట్ల వ్యయమవుతుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనావేసింది. ఎస్బీఐ రుణ సంబంధ అంశాలపై సైతం ఈ విలీన ప్రక్రియ పెద్దగా ప్రభావం చూపబోదని అభిప్రాయపడింది. తన సొంత నిధులనే ఎస్బీఐ దీనికి వినియోగించే వీలుందని కూడా అంచనావేసింది. మరోవైపు, బ్యాంకు కార్యకలాపాలపై సమ్మె ప్రభావం పెద్దగా ఏమీ పడలేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని శాఖలు తెరిచే ఉంచామని, నగదు లావాదేవీలు మినహా మిగతా అన్ని బ్యాంకింగ్ సేవలు అందించినట్లు వివరించింది.