హెచ్డీఎఫ్సీ ‘మ్యాక్స్’ లైఫ్! | HDFC Standard Life-Max Life merger talks: 5 facts about the deal that may create India's largest private insurer | Sakshi
Sakshi News home page

హెచ్డీఎఫ్సీ ‘మ్యాక్స్’ లైఫ్!

Published Sat, Jun 18 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

హెచ్డీఎఫ్సీ ‘మ్యాక్స్’ లైఫ్!

హెచ్డీఎఫ్సీ ‘మ్యాక్స్’ లైఫ్!

మ్యాక్స్ లైఫ్, ఫైనాన్షియల్‌లకు విలీన ప్రతిపాదన
ప్రాథమికంగా అంగీకరించిన కంపెనీల బోర్డులు...
తదుపరి చర్చలకు శ్రీకారం...
విలీనమైతే ఏయూఎం రూ. లక్ష కోట్లకు...
దేశీ బీమా రంగంలో అతిపెద్ద ఒప్పందం!
ప్రైవేటు రంగంలో అగ్రగామి బీమా కంపెనీగా ఆవిర్భావం
20% దూసుకెళ్లిన మ్యాక్స్ ఫైనాన్షియల్ షేరు

న్యూఢిల్లీ: దేశీ బీమా రంగంలో అతిపెద్ద విలీన-కొనుగోలు ఒప్పందానికి తెరలేచింది. మ్యాక్స్ లైఫ్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలను విలీనం చేసుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనకు మూడు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు శుక్రవారం ప్రాథమికంగా అంగీకారం తెలిపాయి. విలీనానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించడం, తదుపరి చర్చల కోసం ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. వాటాల మార్పిడి(స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్) రూపంలో మ్యాక్స్ లైఫ్, మ్యాక్స్ ఫైనాన్షియల్‌ను హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో విలీనం చేసుకోవడానికి మదింపు చేపట్టనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రతిపాదిత విలీనం పూర్తయితే హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ(ఏయూఎం) ఏకంగా రూ. లక్ష కోట్లకు చేరనుంది.

మొత్తం బీమా ప్రీమియం దాదాపు రూ.26,000 కోట్లకు ఎగబాకుతుంది. ప్రస్తుతం దేశంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే రూ. లక్ష కోట్ల ఏయూఎంలను ప్రకటించింది. కాగా, ఇటీవలే హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌నకు చెందిన సాధారణ బీమా కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో... ఎల్‌అండ్‌టీ జనరల్ ఇన్సూరెన్స్‌ను రూ.551 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణ బీమా రంగంలో ఇది తొలి కొనుగోలు డీల్‌గా రికార్డుకెక్కింది. ఇప్పుడు మ్యాక్స్ లైఫ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ విలీనం చేసుకుంటే... దేశీ బీమా రంగంలో అతిపెద్ద డీల్‌గా రికార్డు సృష్టిస్తుంది. అంతేకాదు అతిపెద్ద ప్రైవేటు రంగ బీమా కంపెనీగా కూడా ఆవిర్భవిస్తుంది.

 వాటాలు ఇలా...
హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ జాయింట్ వెంచర్(జేవీ)లో ఎడిన్‌బరోకు చెందిన స్టాండర్డ్ లైఫ్ పీఎల్‌సీకి 35 శాతం వాటా ఉంది. 61.63 శాతం వాటా మాతృ  సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ చేతిలో ఉంది. ఇక ఈ ఏడాది మార్చి చివరినాటికి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ మొత్త ప్రీమియం రూ.16,313 కోట్లుగా నమోదైంది. ఏయూఎం రూ.72,247 కోట్లు. ఇక మ్యాక్స్ లైఫ్ జేవీవిషయానికొస్తే... ఇందులో దీని హోల్డింగ్ కంపెనీ అయిన(స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉంది) మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు 68 శాతం వాటా, జపాన్‌కు చెందిన మిత్సుయి సుమిటొమో ఇన్సూరెన్స్ కంపెనీకి 26 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి చివరికి మ్యాక్స్ లైఫ్ మొత్తం ప్రీమియం రూ. 9,216 కోట్లు కాగా, ఏయూఎం రూ.35,824 కోట్లుగా నమోదైంది. ప్రతిపాదిత ప్రాథమిక ఒప్పందం.. విలీన సాధ్యాసాధ్యాల మదింపు, సంబందిత కంపెనీల బోర్డులు, వాటాదారులు

నియంత్రణ-కోర్టుపరమైన అనుమతులు ఇతరత్రా ఆమోదాలపై ఆధారపడి కార్యరూపం దాల్చుతుందని హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటన తెలిపింది. ప్రస్తుతం బీమా రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ) అనుమతి ఉన్న విషయం విదితమే. దేశంలో మొత్తం 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ రంగ ఎల్‌ఐసీ ఈ రంగంలో 70 శాతానికిపైగా మార్కెట్ వాటాతో నంబర్‌వన్‌గా నిలుస్తోంది.

ఆటోమేటిక్ లిస్టింగ్..!
రెండంచెల్లో జరిగే ఈ విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఎలాంటి ఐపీఓ(పబ్లిక్ ఆఫర్) లేకుండానే ఆటోమేటిక్‌గా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానుంది. ఇప్పటికే మ్యాక్స్ లైఫ్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ మ్యాక్స్ ఫైనాన్షియల్ లిస్టయి ఉండటమే దీనికి కారణం. కాగా, విలీనం తర్వాత ఆవిర్భవించే లిస్టెడ్ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.45,000-50,000 కోట్లుగా ఉంటుందని అంచనా. దీంతో దేశంలో ఏకైక, అతిపెద్ద లిస్టెడ్ బీమా కంపెనీగా అవతరిస్తుంది. విలీనానంతరం కొనసాగే కంపెనీలో హెచ్‌డీఎఫ్‌సీ, స్టాండర్డ్ లైఫ్, అజీమ్ ప్రేమ్‌జీలకు కలిపి 60-65% వాటా ఉంటుంది. అనల్జిత్ సింగ్‌తో పాటు మిత్సుయి సుమిటొమో ఇన్సూరెన్స్ కంపెనీ, గోల్డ్‌మన్ శాక్స్, కేకేఆర్, యాక్సిస్ బ్యాంక్ ఇతర సాధారణ ఇన్వెస్టర్లకు మ్యాక్స్ గ్రూప్‌కు 35-40% వాటా(షేర్ల రూపంలో) లభిస్తాయి. గతేడాది మ్యాక్స్ ఇండియాను మూడు విభాగాలుగా అనల్జిత్ సింగ్ విడగొట్టిన సంగతి తెలిసిందే. లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాన్ని మ్యాక్స్ ఫైనాన్షియల్ అనే హోల్డింగ్ కంపెనీ కిందికి చేర్చి పరోక్షంగా పూర్తిస్థాయి తొలి బీమా లిస్టెడ్ కంపెనీగా చేశారు.

‘మ్యాక్స్’ షేరు రయ్య్.్ర..
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌తో విలీన ప్రతిపాదన నేపథ్యంలో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్(మ్యాక్స్ లైఫ్‌కు హోల్డింగ్ కంపెనీ) షేరు ధర దూసుకెళ్లింది. శుక్రవారం బీఎస్‌ఈలో ఒకానొక దశలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.514.40కు చేరింది. అయితే, ఆతర్వాత మళ్లీ తగ్గుముఖం పట్టి చివరకు 10.29 శాతం లాభంతో రూ.473 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలోనూ ఇదే స్థాయిలో దూసుకెళ్లి చివరకు 10.5 శాతం లాభపడి రూ.474 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 9 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 82 లక్షల చొప్పున షేర్లు చేతులు మారాయి. షేరు జోరు కారణంగా ఒక్కరోజులో కంపెనీ మార్కెట్ విలువ రూ.1,180 కోట్లు ఎగబాకి రూ.12,625 కోట్లకు చేరింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement