'పీకే' విషయంలో సీఎం తప్పు లేదు: సుప్రీం
పట్నా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే)ను బిహార్ ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విషయంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడలేదని పేర్కొంది. సీఎం తన సలహారుదారుకు కేబినెట్ హోదా కల్పించడం తప్పుకాదని తేల్చిచెప్పింది. 'ప్రశాంత్ కిషోర్ పై ముఖ్యమంత్రికి నమ్మకం ఉంది. ఆయనతో కలిసి పనిచేయాలని సీఎం అనుకుని ఉండొచ్చు. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమ'ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ పేర్కొన్నారు.
ప్రశాంత్ కిషోర్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 39 ఏళ్ల ప్రశాంత్ కిషోర్ 2014 సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోదీ తరపున పనిచేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున వ్యూహకర్తగా వ్యహరించారు. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేశారు.