
విగ్రహాలపై ఉమ్మేస్తారు: నితీశ్
పట్నా: నెహ్రు-గాంధీ వారసుల విగ్రహాలు పెట్టడం మానుకోవాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. విగ్రహాలు పెట్టుకుంటూ పోతే వాటిపై ప్రజలు ఉమ్మేసే పరిస్థితి వస్తుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రంలో రెండేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం చేసిందేమి లేదని, వచ్చే మూడేళ్ల పాలనలోనూ పెద్దగా ఒరిగేదేం ఉండబోదని అన్నారు.
బిహార్ లో ఆటవిక పాలన నడుస్తోందని ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మే 23 వరకు నమోదైన నేరాల వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. తమ పాలనలో నేరాలు బాగా తగ్గాయని, శాంతిభద్రతలకు భంగం వాటిల్లలేదని చెప్పుకొచ్చారు. నేరాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా ఊపేక్షించబోమని స్పష్టం చేశారు. తాము అమలు చేస్తున్న మద్యపాన నిషేధాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని చెప్పారు.