బిహార్ సీఎంగా లాలూ కొడుకు!!
పాట్నా: అక్కడ రోడ్డుపై వందల సంఖ్యలో జనం ఆందోళన చేస్తున్నారు. ఇంతలో కుర్తాపైజామా ధరించిన ముఖ్యమంత్రి ఎస్‌యూవీ వాహనంలో అక్కడికి వచ్చారు. ఆందోళన చేస్తున్నవారి దగ్గరికి వెళ్లి సర్దిచెప్పారు. దోషులకు శిక్ష వేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆందోళనకారులు శాంతించారు. ఇలా బిహార్ సీఎంగా కనిపించి ఆందోళనకారులను శాంతింపజేసింది ఎవరో కాదు.. లాలూ ప్రసాద్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్. ప్రస్తుతం బిహార్ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారని ఆశ్చర్యపోకండి. ఇదంతా సినిమా కోసమే.
'అపహరణ్ ఉద్యోగ్' (కిడ్నాప్ ఇండస్ట్రి) పేరిట రూపొందుతున్న ఓ సినిమాలో లాలూ తనయుడు తేజ్‌ప్రతాప్ బిహార్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. 1990లో బిహార్‌లో సంభవించిన కిడ్నాప్‌లు నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో బిహార్ సీఎం లాలూ ఉన్నారు. అంధకారంలో ఉన్న బిహార్‌ను వెలుగులోకి తీసుకొచ్చే చక్కని కథతో రూపొందిన సినిమా కావడంతో తాను నటించానని, ఇందులో ఓ పాత్రలో లాలూ యాదవ్ కూడా కనిపిస్తారని షూటింగ్ అనంతరం తేజ్‌ప్రతాప్ తెలిపారు. తేజ్ తమ్ముడు తేజస్వి డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండగా, ఆయన మాత్రం ఆరోగ్యశాఖను గాలికి వదిలేసి సినిమాలు, షూటింగ్‌లు అంటూ తిరుగుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.