ప్రచారంలో వెనకబడిన రాహుల్, సోనియా
పట్నా: ప్రతిష్టాత్మకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఎందుకు ఎక్కువ పాల్గొనడం లేదు? ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్ర పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం కోసం రావాల్సిందిగా సోనియా, రాహుల్ గాంధీల వెంటపడి ప్రాధేయపడేవారు. ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదు? సోనియా గాంధీ ఇప్పటి వరకు బిహార్ ఎన్నికల ప్రచారంలో రెండు, మూడు పర్యాయాలు మాత్రమే పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కూడా గతంతో పోలిస్తే చాలా తక్కువ ప్రచార సభల్లోనే పాల్గొంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది?
బిహార్ ఓటర్లు యూపీఏ-2 ప్రభుత్వంలో వెలుగుచూసిన కుంభకోణాలను ఇప్పటికి మరచిపోలేక పోతున్నారని, సోనియా, రాహుల్ గాంధీలు వచ్చి ప్రచారం చేస్తే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ అభ్యర్థులే భావిస్తున్నారని రాష్ట్ర పార్టీ వర్గాలు తెలిపాయి. వారికన్నా లాలూ, నితీష్ కుమార్ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఈ కారణంగానే సోనియా, రాహుల్ ఎన్నికల ప్రచారానికి రావాలని లాలూ, నితీష్‌లు కూడా కోరుకోవడం లేదని వారన్నారు.
సోనియా, రాహుల్ కంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్, సినీ తారలు రాజ్‌బబ్బర్, నగ్మాల ఎన్నికల ప్రచారాన్నే అభ్యర్థులు ఎక్కువగా కోరుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ముస్లింలు అధికంగా ఉన్న నియోజక వర్గాల్లో గులామ్ నబీ ఆజాద్ ప్రచారం ఉపయోగపడుతుండగా, జన సమీకరణలో నగ్మా గ్లామర్, రాజ్‌బబ్బర్ వాక్ఛాతుర్యం ఉపయోగపడుతోందన్నది అభ్యర్థుల వాదనగా వినిపిస్తోంది.
ఎన్డీయే ప్రచార సారథి నరేంద్ర మోదీకి పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్న లాలూ, నితీష్‌ల ద్వయం కాంగ్రెస్ పార్టీ అధినాయకులపై ఏ మాత్రం ఆధారపడకుండా ప్రచారపర్వంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పటికప్పుడు మోదీపై వాగ్బాణాలు విసురుతుండగా, నితీష్ కుమార్ అభివృద్ధి మంత్ర, తంత్రాలను ప్రయోగిస్తున్నారు.