'సోనియా, రాహుల్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా'
రానున్న ఎన్నికలలో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని యోగా గురువు బాబా రాందేవ్ వెల్లడించారు. అందుకోసం వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలు అమేథి, రాయ్ బరేలిలో ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. యపీఏ ప్రభుత్వ హాయాంలో చోటు చేసుకున్న కుంభకోణాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నట్లు చెప్పారు.
రానున్న ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద గుణపాఠమని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం రాత్రి ఆయన విలేకర్ల సమావేశంలో రాందేవ్ మాట్లాడారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని ఆయన జోస్యం చెప్పారు. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా హర్యానాలో వేలాది కోట్ల రూపాయిల భూ కుంభకోణం తాలుక అంశాలను రాందేవ్ బాబా ఈ సందర్భంగా విశదీకరించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే బీజేపీకి మాత్రం తన మద్దతు ఉండదన్నారు. 2014 ఎన్నికలలో 300 సీట్లు గెలుచుకుని మోడీ ప్రధాని పీఠాన్ని అధిష్టాస్తారని జోస్యం చెప్పారు. మోడీ కోసం ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. భారత్ ప్రజలకు ఏమీ కావాలో మోడీకి తెలసని, వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పని చేసే సత్తా మోడీకి ఉందన్నారు. ఉత్తరప్రదేశ్లోని అఖిలేష్ ప్రభుత్వంపై స్పందించేందుకు మాత్రం రాందేవ్ నిరాకరించారు.