వారి అవినీతి సంపదను ప్రజలకు పంచుతాం | Rahul Gandhi Comments On KCR: Telangana | Sakshi

వారి అవినీతి సంపదను ప్రజలకు పంచుతాం

Published Sat, Nov 18 2023 3:23 AM | Last Updated on Sat, Nov 18 2023 3:23 AM

Rahul Gandhi Comments On KCR: Telangana - Sakshi

వరంగల్‌ పోచమ్మమైదాన్‌కు పాదయాత్రగా వస్తున్న రాహుల్‌

సాక్షి, వరంగల్‌/ వరంగల్‌/ నర్సంపేట/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రమిస్తే.. ఆ ఫలాలు పూర్తిగా ఒక్క కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు అవినీతి పాల్పడ్డారని.. కాంగ్రెస్‌ వచ్చాక ఆ అవినీతి సంపదను వెలికితీసి ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో పంచుతామని చెప్పారు. కాంగ్రెస్‌ గెలిస్తే తొలి కేబినెట్‌ సమావేశంలోనే ఆరు గ్యారంటీ హామీలపై తొలి సంతకం లేదా తొలి నిర్ణయం ఉంటుందని ప్రకటించారు.

కేసీఆర్‌ను ఇంటికి పంపడమే తమ లక్ష్యమని.. తర్వాత ఢిల్లీలో మోదీని గద్దె దింపుతామని చెప్పారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వరంగల్‌ జిల్లా నర్సంపేటలో, వరంగల్‌ తూర్పు నియోజకవర్గం పరిధిలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో పర్యటించారు. స్థానికంగా పాదయాత్రలు, కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోలు నిర్వహించి ప్రసంగించారు. వివరాలు రాహుల్‌ గాంధీ మాటల్లోనే.. 

‘‘బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకే చెట్టు కొమ్మలు. మోదీ వాహనానికి పంక్చరైతే కేసీఆర్‌ గాలి కొడతారు. కాంగ్రెస్‌ ధాటికి మోదీ వాహనం పచ్చడైంది. అందుకే పరోక్షంగా కేసీఆర్‌కు సహకరిస్తున్నారు. పార్లమెంట్‌లో బిల్లు ఏదైనా బీజేపీ నేతలు కనుసైగ చేస్తే బీఆర్‌ఎస్‌ నేతలు తలూపుతారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ఓడించడానికి ఎంఐఎంను బీజేపీ వాడుకుంటోంది.

గల్లీలో కేసీఆర్, ఢిల్లీలో మోదీ జాతుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రేమ బీజాలను నాటుతుంది. తెలంగాణతో కాంగ్రెస్‌కు ఉన్నది రాజకీయ బంధం కాదు.. రక్త సంబంధం. ప్రస్తుతం దొరల తెలంగాణ– ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్‌ ప్రజల తెలంగాణ కోసం ఈ యుద్ధంలో పోరాడుతోంది. బీఆర్‌ఎస్, బీజేపీలకు బుద్ధిచెప్పి.. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలి. 

రైతులను మోసం చేశారు 
బీఆర్‌ఎస్‌ సర్కారు రైతులను మోసం చేసింది. భూములను క్రమబద్దికరిస్తామని చెప్పి ధరణి పోర్టల్‌తో 20 లక్షల కుటుంబాల భూమిని గుంజుకున్నారు. రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వీరందరికీ న్యాయం చేస్తాం. తెలంగాణకు కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని కేసీఆర్‌ అంటున్నారు. కేసీఆర్‌ చదువుకున్న బడి, కాలేజీ, యూనివర్సిటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కట్టించాయని గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్‌ ఐటీ క్యాపిటల్‌గా మారేందుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. 

మావి ఉత్త మాటలు కాదు: కేసీఆర్, మోదీలు చెప్తున్నట్టుగా మావి ఉత్తుత్తి హామీలు కాదు. ఆరు గ్యారంటీలను అధికారంలోకి రాగానే అమలుచేసి తీరుతాం. రూ.500కే గ్యాస్‌ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఎకరాకు రూ.15,000 పెట్టుబడి సాయం, వృద్ధులకు రూ.4 వేల పింఛన్, ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కులగణన నిర్వహించి, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో రిజర్వేషన్‌ వల్ల కొత్త నాయకత్వం వచ్చే అవకాశం ఉంటుంది..’’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. 

జ్యూస్‌ తాగి.. చేతి గుర్తుకు ఓటేయాలని.. 
వరంగల్‌ తూర్పు సెగ్మెంట్‌ పరిధిలో పాదయాత్ర చేసిన రాహుల్‌గాందీ.. జేపీఎన్‌ రోడ్డులోని ఓ జ్యూస్‌ సెంటర్‌ వద్ద ఆగారు. ప్రూట్‌ సలాడ్‌ తిని, జ్యూస్‌ తాగారు. షాప్‌ నిర్వాహకుడు పుల్లూరి శ్రీధర్‌తో కరచాలనం చేసి..హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. 

ప్రగతిభవన్‌ను ‘ప్రజాపాలనా భవన్‌’గా మారుస్తాం 
రాహుల్‌ గాంధీ ట్వీట్‌ 
సాక్షి, హైదరాబాద్‌: జవాబుదారీతనం, పారదర్శకతతో ప్రజల తెలంగాణను నిర్మించేందుకు తమ తో కలిసి రావాలని రాహుల్‌ గాంధీ పిలుపుని చ్చారు. ‘మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి’ ట్యాగ్‌లైన్‌తో శుక్రవారం ఎక్స్‌ యాప్‌లో ట్వీట్‌ చేశారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ప్రజల తెలంగాణలో స్వర్ణ యుగానికి నాంది పలకనుంది. ప్రగతి భవన్‌ పేరును ప్రజా పాలనా భవన్‌గా మారుస్తాం. 24 గంటలపాటు ఆ భవన్‌ ద్వారాలు తెరిచే ఉంటాయి. సీఎంతోపాటు మంత్రులు క్రమం తప్పకుండా ప్రజా దర్బార్‌ నిర్వహించడం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని 72 గంటల్లో వాటి పరిష్కారానికి కృషి చేస్తారు..’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement