Backward
-
విద్యలో తెలంగాణ వెనుకబాటు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): విద్య విషయంలో ఇతర అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వెనుకబడి ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక, మదర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యాసామర్థ్యాలు అందించడం ప్రభుత్వ చట్టబద్ధత బాధ్యతగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, విద్యకు తెలంగాణ రాష్ట్రం బడ్జెట్లో అత్యంత తక్కువ ఖర్చు చేస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చును విద్యపై పెడితే తెలంగాణలో ఉన్న స్కూల్స్ అన్నీ బాగుపడేవని చెప్పారు. కాంట్రాక్టర్లు కమీషన్లు ఇస్తారు కాబట్టే విద్యపై కాకుండా ప్రాజెక్టులపై ఖర్చు చేశారని విమర్శించారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని, సరిపడా టీచర్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దిగజారిన విద్యా ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో డ్రాపౌట్లు పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య అందించకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘనగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వినర్ ఆర్.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక కన్వినర్ జి.వేణుగోపాల్, మదర్స్ అసోసియేషన్ కన్వినర్ జి.భాగ్యలక్ష్మి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరులు ప్రసంగించారు. -
Rishi Sunak: ఔను.. వెనుకంజలో ఉన్నా
లండన్: బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి పదవి కోసం జరుగుతున్న పోటీలో తాను వెనుకంజలో ఉన్నట్లు కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ, మాజీ మంత్రి రిషి సునాక్ అంగీకరించారు. ప్రత్యర్థి లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నారన్నారు. అయినా పట్టుదల వీడబోనని, ప్రతి ఓటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే పన్నులు తగ్గిస్తానని ట్రస్ హామీ ఇస్తున్నారు. రిషి మాత్రం దేశంలో ఆర్థిక సంక్షోభానికి తెరపడే దాకా పన్నుల తగ్గింపు సాధ్యం కాదని అంటున్నారు. రిషి, ట్రస్ గురువారం రాత్రి యార్క్‌షైర్‌లోని లీడ్స్ పట్టణంలో ఒకే వేదికపైకి వచ్చి తమ పార్టీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానమంత్రి పదవి దక్కితే తాము అమలు చేయబోయే ఆర్థిక విధానాల గురించి వివరించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేశారంటూ ఈ సందర్భంగా రిషిని ఓ సభ్యుడు ప్రశ్నించారు. తద్వారా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు వెన్నుపోటు పొడిచారంటూ ఆక్షేపించారు. ‘10, డౌనింగ్ స్ట్రీట్’ (ప్రధాని నివాసం)లో రిషిని చూడాలని జనం కోరుకోవడం లేదన్నారు. ఆర్థిక విధానాలపై బోరిస్‌తో విభేదాలు తీవ్రతరం కావడం వల్ల రాజీనామా చేయక తప్పలేదని రిషి బదులిచ్చారు. అందుకు దారి తీసిన కారణాలను వివరించి ఆకట్టుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీలోని 1,75,000 మంది సభ్యులు పార్టీని నేత, తద్వారా తదుపరి ప్రధానిని ఎన్నుకోనున్నారు. సెప్టెంబర్ 5 విజేతను ప్రకటిస్తారు. -
యూట్యూబ్‌లో ఈ కొత్త ఫీచర్ ఏదో బాగుందే..!
యూట్యూబ్ గురించి తెలియని వారు ఏవరుండరు. మనకు నచ్చిన టీవీ ప్రోగ్రాంలను మిస్సైనా, ఇతరత్రా వీడియోలను చూడాలంటే వెంటనే యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేస్తాం..! మనలో చాలా మంది యూట్యూబ్ వీడియోలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాం. యూట్యూబ్‌లో ఒక వీడియో చూస్తుంటే మనకు కాస్త నచ్చకపోయినా, లేదా తరువాత ఏం జరుగుతుందో అనే ఆత్రుతతో ఫోన్లో డబల్ ట్యాప్ చేసి వీడియోలను ఫార్వర్డ్ చేస్తు ఉంటాం. వీడియోలను ఫార్వర్డ్ చేసే క్రమంలో డబుల్ ట్యాప్ సరిగ్గా చేయకపోతే తదుపరి వీడియోకు వెళ్తుంది. ఇలా మనలో చాలా మంది ఇలాంటి సమస్యను చాలా మంది ఎదుర్కోన్న వాళ్లమే..! కాగా ఈ సమస్యకు చెక్‌పెడుతూ కొత్త పరిష్కారాన్ని చూపింది యూట్యూబ్. యూట్యూబ్ త్వరలోనే యూజర్లకు కొత్త ఫీచరును అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్లకు స్లైడ్ టూ సీక్ అనే కొత్త ఫీచరును యూట్యూబ్ త్వరలోనే యాడ్ చేయనుంది. వీడియోను చూసే సమయంలో వీడియోపై ఒక గీతపై డాట్ ఉండే సింబల్ త్వరలోనే యూజర్లకు కనిపించనుంది. సింబల్‌కు పక్కనే ‘స్టైడ్ టూ లెఫ్ట్ ఆర్ రైట్ టూ సీక్’డిస్క్రిప్షన్ మేసేజ్ కన్పిస్తోంది. అంతేకాకుండా ఆపిల్, షావోమీ స్మార్ట్ఫోన్లలో కన్పించే రౌండ్బాల్ హోల్డ్ గెస్చర్‌ను కూడా యూట్యూబ్ అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ఒక వీడియోలో ముందుకు ఫార్వర్డ్ వెళ్లాలంటే బాల్‌ను డ్రాగ్ చేస్తే సరిపోతుంది. మనకు నచ్చినట్లుగా వీడియోలను ఫార్వర్డ్, రివైండ్ చేయవచ్చును. ప్రస్తుతం ఈ ఫీచరును యూట్యూట్ టెస్ట్ చేస్తోంది. కాగా ఈ ఫీచర్ యూట్యూబ్ యాప్ వెర్షన్ 16.31.34 వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. -
బలనిరూపణ అంటే బీజేపీ పారిపోతోంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో బలం నిరూపించాల్సిందిగా బీజేపీని కోరితే ఆ పార్టీ పారిపోతోందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. తగినంత సంఖ్యా బలం లేకపోవడం వల్లే బీజేపీ వెనకడుగు వేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో చెప్పారు. సంఖ్యాబలం లేని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం అక్రమమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. సంఖ్యాబల నిరూపణకు వెళదామని, అక్కడే ఎవరి బలమేమిటో తేలిపోతుందని బీజేపీకి చురకలంటించారు. బలనిరూపణకు వెళ్తే తమ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. గవర్నర్ కార్యాలయాన్ని ఉపయోగించుకొని బీజేపీ అక్రమ చర్యలకు దిగిందని ఆరోపించారు. -
ప్రచారంలో వెనకబడిన రాహుల్, సోనియా
పట్నా: ప్రతిష్టాత్మకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఎందుకు ఎక్కువ పాల్గొనడం లేదు? ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్ర పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం కోసం రావాల్సిందిగా సోనియా, రాహుల్ గాంధీల వెంటపడి ప్రాధేయపడేవారు. ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదు? సోనియా గాంధీ ఇప్పటి వరకు బిహార్ ఎన్నికల ప్రచారంలో రెండు, మూడు పర్యాయాలు మాత్రమే పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కూడా గతంతో పోలిస్తే చాలా తక్కువ ప్రచార సభల్లోనే పాల్గొంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? బిహార్ ఓటర్లు యూపీఏ-2 ప్రభుత్వంలో వెలుగుచూసిన కుంభకోణాలను ఇప్పటికి మరచిపోలేక పోతున్నారని, సోనియా, రాహుల్ గాంధీలు వచ్చి ప్రచారం చేస్తే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ అభ్యర్థులే భావిస్తున్నారని రాష్ట్ర పార్టీ వర్గాలు తెలిపాయి. వారికన్నా లాలూ, నితీష్ కుమార్ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఈ కారణంగానే సోనియా, రాహుల్ ఎన్నికల ప్రచారానికి రావాలని లాలూ, నితీష్‌లు కూడా కోరుకోవడం లేదని వారన్నారు. సోనియా, రాహుల్ కంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్, సినీ తారలు రాజ్‌బబ్బర్, నగ్మాల ఎన్నికల ప్రచారాన్నే అభ్యర్థులు ఎక్కువగా కోరుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ముస్లింలు అధికంగా ఉన్న నియోజక వర్గాల్లో గులామ్ నబీ ఆజాద్ ప్రచారం ఉపయోగపడుతుండగా, జన సమీకరణలో నగ్మా గ్లామర్, రాజ్‌బబ్బర్ వాక్ఛాతుర్యం ఉపయోగపడుతోందన్నది అభ్యర్థుల వాదనగా వినిపిస్తోంది. ఎన్డీయే ప్రచార సారథి నరేంద్ర మోదీకి పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్న లాలూ, నితీష్ల ద్వయం కాంగ్రెస్ పార్టీ అధినాయకులపై ఏ మాత్రం ఆధారపడకుండా ప్రచారపర్వంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పటికప్పుడు మోదీపై వాగ్బాణాలు విసురుతుండగా, నితీష్ కుమార్ అభివృద్ధి మంత్ర, తంత్రాలను ప్రయోగిస్తున్నారు. -
ఎన్నాళ్లకో అధికారం..
ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల్లో జాప్యం నెల దాటినా ఖరారు కాని ముహూర్తం ‘పీఠం’ ఆశావహులకు క్యాంపుల భారం జిల్లా పరిషత్ : అసలే ఆషాడం.. ఆపై అధిక మాసం అన్న చందంగా తయారైంది పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పరిస్థితి. దేశ అత్యున్నత న్యాయ స్థానం జోక్యంతో ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. నెల రోజుల తర్వాత మే 13వ తేదీన ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టి... విజయం సాధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ ప్రకియ ముగిసి నెల గడిచింది. కానీ... గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం కుదరడం లేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి... ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పురపాలక సంఘాలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే ఆ ఫలితాలు వచ్చి నెలరోజులు దాటినా... స్థానిక సంస్థల్లో బాధ్యతలు చేపట్టే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారు ఇంకా బాధ్యతలు చేపట్టకపోగా... ఎంపీపీ, జెడ్పీచైర్‌పర్సన్ పదవులు ఆశిస్తున్న వారి పరిస్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా తయారైంది. తమ సహచర ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల మద్దతును కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడగానే తమకు మద్దతునిస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను క్యాంపులకు తరలించారు. ప్రభుత్వం కొలువు దీరిన తర్వాతే ఎన్నికలు అనగానే... కొన్ని మండలాలకు చెందిన వారు క్యాంపులను విరమించుకున్నారు. వీరు మండలాలకు చేరుకోగానే వీరి ప్రత్యర్థులు గాలం వేయడం మొదలుపెట్టారు. దీంతో ఎంపీపీ, జెడ్పీచైర్‌పర్సన్ ఆశావహులు మళ్లీ క్యాంపుల బాట పట్టారు. నెల రోజుల పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ఏసీ రూముల్లో ఉంచుతూ... సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రూ.లక్షల్లో వ్యయమవుతుండడంతో లబోదిబోమంటున్నారు. మునిసిపాలిటీతో అడ్డంకి మొదలు.. ప్రాదేశిక ఎన్నికల కంటే ముందే మునిసిపాలిటీల ఎన్నికలు జరిగాయి. మునిసిపల్ చైర్మన్లకు ఎన్నికలు నిర్వహించకుండా... ప్రాదేశిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని మునిసిపాలిటిల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు కలిగి ఉంటారు. వీరి ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక స్థానిక సంస్థల అధ్యక్షులను ఎన్నుకోవాలన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటిద్దామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన పూర్తయి తెలంగాణలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతోపాటు అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి. కానీ... అంధ్రప్రదేశ్‌లో ఇంకా అసెంబ్లీ సమావేశాలు మొదలు కాలేదు. ఈనెల 19 వ తేదీ నుంచి నిర్వహిస్తామని ఏపీ నేతలు అంటున్నారు. శాసనసభ సమావేశమై సభ్యులు ప్రమాణస్వీకారం చేశాక మూడు నాలుగు రోజుల గడువులోగా వారు ఏ స్థానిక సంస్థల్లో సభ్యులుగా చేరాలనుకుంటున్నారో రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. అంటే ఈ లెక్కన ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నికకు మరో పది, పదిహేను రోజులు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా... ఆంధ్రపదేశ్ రాష్ట్ర విభజన జరిగి.. నూతన రాష్ర్టంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పరిధి డోలాయమానంలో పడింది. దీనిపై కేంద్రం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో ఎన్నికల కమిషన్ అధికారులు గవర్నర్‌కు నివేదించారు. అక్కడ జాప్యం జరుగుతుండడంతో ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, మునిసిపాలిటీ చైర్మన్ల ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యమవుతోంది. -
హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు
తిరుపతి, న్యూస్‌లైన్ : సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆదివారం తిరుపతిలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను బాబూ రాజేంద్రప్రసాద్ ప్రారంభించి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గత కాంగ్రెస్ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమై పోయిందన్నారు. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారన్నారు. రాజ్యాంగంలోని 73, 74 అధికరణల సవరణల ప్రకారం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఇవ్వాల్సిన నిధులు, విధులు, అధికారాలను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జి, 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 విభాగాలపై అధికారాలను దాఖలు పరచి స్థానిక స్వపరిపాలన, స్వయం పోషకత్వాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టతకు, హక్కుల సాధనకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలని కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన చాంబర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీ.అరవిందనాథరెడ్డి, బిర్రు ప్రతాప్‌రెడ్డి, సీహెచ్ సత్యనారాయణరెడ్డి, కాట్రగడ్డ రఘు, టంకాల బాబ్జీ, వీరంకి గురుమూర్తి, సుమతి, చింతాల సోమన్న, జగ్గాల రవి, పడాల వెంకట్రామారెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ పీఠం కైవసం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. జెడ్పీ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంది. దీనితో పాటు 27 ఎంపీపీ స్థానాలను చేజిక్కించుకుంది. గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో క్లీన్ స్వీప్ చేసి తమకు ఎదురులేదని నిరూపించింది. ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఎంపీటీసీ స్థానాలను అధిక సంఖ్యలో గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జెడ్పీటీసీ స్థానాల్లో కూడా తన ఆధిక్యతను నిరూపించుకుంది. జిల్లాలోని 56 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరగ్గా, 32 స్థానాలను వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ 24 స్థానాలతో సరిపెట్టుకుంది. గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క కంభం మినహా అన్ని మండలాల్లో భారీ మెజార్టీ సాధించింది. అన్ని నియోజకవర్గాల్లోను వైఎస్సార్ సీపీ విజయం సాధించడంతో జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు డీలా పడ్డారు. మునిసిపల్ ఫలితాల్లో విజయం సాధించినట్లు చెప్పుకుని సంతోషపడిన వారికి, ఆ సంతోషం 24 గంటలు కూడా నిలువలేదు. సగానికి పైగా జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించడంతోపాటు, రాష్ట్రంలోనే తొలి సారిగా జెడ్పీ చైర్మన్ పదవిని కూడా చేజిక్కించుకుని, తొలి బోణీ కొట్టింది. దీంతోపాటు 27 ఎంపీపీలను కూడా సాధించుకోగా, టీడీపీ 19 ఎంపీపీలతో సరిపెట్టుకుంది. మరో పది స్థానాల్లో హంగ్ ఏర్పడింది. ఒంగోలు నియోజకవర్గంలోని రెండు జెడ్పీటీసీలలో వైఎస్సార్ సీపీ, టీడీపీ చెరొకటి పంచుకున్నాయి. కనిగిరి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఐదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా, తెలుగు దేశం ఒక స్థానాన్ని దక్కించుకుంది. అద్దంకి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా, ఒక్క స్థానాన్ని టీడీపీ పొందింది. యర్రగొండపాలెంలోని ఐదు మండలాల్లో వైఎస్సార్ సీపీ విజయ పతాకం ఎగురవేసింది. మార్కాపురంలోని నాలుగు మండలాలను వైఎస్సార్ సీపీ తన ఖాతాలోనే వేసుకుంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు నాలుగు మండలాల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. దాదాపు అన్ని మండలాల్లోను తన ప్రాబల్యం ఉందని వైఎస్సార్ సీపీ నిరూపించుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పుల్లల చెరువు జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై న డాక్టర్ నూ కసాని బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్ సీపీ విజయ కేతనం ఎగురవేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపించిందని తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూడా నియోజకవర్గాల పరంగా ఇంతకంటే ఎక్కువ స్థానాలను పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మావోయిస్టుల హెచ్చరికలు బేఖాతర్
లివిడత ఎన్నికలు ప్రశాంతం ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ విశాఖపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ విక్రమ్ జీత్ దుగ్గల్ తెలిపారు. మావోయిస్టుల బెదిరింపులకు లొంగకుండా గిరిజనులు ఓటు హ క్కు వినియోగించుకున్నారన్నారు. గిరిజనులను, గిరిజన నాయకులను ఎన్నికలలో పాల్గొనవద్దని, చంపేస్తామని మావోయిస్టులు శతవిధాలా చేసిన ప్రయత్నాల్ని గిరిజనులు తమ ఓటుతో సమాధానం చెప్పారన్నారు. దీనిని బట్టి చూస్తే గిరిజనానికి అభివృద్ధిపై ఆకాంక్ష అర్థమవుతుందన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మన్యంలో మొత్తం 328 పోలింగ్ స్టేషన్లు, 470 పోలింగ్ బూత్‌లలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించామన్నారు. ముంచంగిపుట్టు మండలాని 26 కిలో మీటర్ల దూరంలో గల బూసిపుట్టులో (ఒరిస్సా సరిహద్దు) ఇద్దరు వ్యక్తులు ఎన్నికల సిబ్బందిని బెదిరించి రెండు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం అందిందన్నారు. ఈ సంఘటన మినహా ఏజెన్సీ అంతటా ప్రశాంతంగా ఎన్నికలు జరుగగా 75 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. మావోరుుస్టుల హెచ్చరికలను లెక్క చేయకుండా ఓటింగ్‌లో పాల్గొన్న గిరిజనానికి, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
మలిదశ పరిషత్తుపోరు నేడే
గుంటూరు, గురజాల డివిజన్లలో పోలింగ్ ఓటర్ల సంఖ్య 11,30,634, పోలిగ్ స్టేషన్లు 1,470 పతాక స్థాయికి చేరిన టీడీపీ ప్రలోభాల పర్వం ‘సంగం’ ఉద్యోగులతో ఓటుకు నోటు పంపకాలు సాక్షి, గుంటూరు : జిల్లాలో మలిదశ పరిషత్తు పోరు శుక్రవారం జరగనుంది. ఈ దశలో గుంటూరు, గురజాల డివిజన్ల పరిధిలోని 28 మండలాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, మాచర్ల, పెదకూరపాడు, గురజాల నియోజకవర్గాల్లోని 28 జడ్పీటీసీ స్థానాలకు 105 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 443 ఎంపీటీసీ స్థానాలుండగా, 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 432స్థానాలకు 1,182 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల జరిగే రెండు డివిజన్లలో మొత్తం 696 చోట్ల 1,470 పోలింగ్ స్టేషన్లున్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 71 చోట్ల 136 పోలింగ్ స్టేషన్లు, 715 అత్యంత సమస్యాత్మక, 417 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్ని జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. 202 సాధారణ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు డివిజన్‌కు 2,041, గురజాల డివిజన్‌కు 983 బ్యాలెట్ బాక్సులు కేటాయించారు. 119 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 175 కేంద్రాలకు వీడియో గ్రాఫర్లను ఏర్పాటు చేశారు. 304 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మలిదశలోనూ మహిళలే కీలకం.. రెండు డివిజన్లలో జరిగే ఎన్నికల్లో 11,30,634 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓట్లు 5,58,979 మంది కాగా, మహిళా ఓట్లు 5,71,657 ఉన్నాయి. రెండు డివిజన్లలోనూ మహిళా ఓట్లే కీలకం కానున్నాయి. గుంటూరు డివిజన్లో పురుష ఓటర్లు 3,76,457 మంది కాగా, మహిళా ఓటర్లు 3,86,098 మంది ఉన్నారు. గురజాల డివిజన్‌లోనూ పురుష ఓటర్లు 1,82,522 మంది కాగా, మహిళా ఓటర్లు 1,85,559 మంది ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాజకీయ పార్టీలు మహిళా ఓట్ల కోసం ప్రచారంలో నానా పాట్లు పడ్డాయి. అధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ పోటీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల్ని పోటీలో నిలపలేదు. 16 జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంది. ఈ స్థానాల్లో టీడీపీకి బహిరంగంగానే మద్దతు పలికింది. 28 జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 27 స్థానాల్లోనూ, తాడేపల్లిలో సీపీఎంకు మద్దతిచ్చి బరిలో నిలిపింది. తాడేపల్లిలో కాంగ్రెస్ పార్టీ టీడీపీకి మద్దతిచ్చినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కమల ప్రకటించడం గమనార్హం. సైకిల్ గుర్తుతో నోట్ల పంపిణీ.. మరికొద్ది గంటల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుండటంతో టీడీపీ పతాక స్థాయిలో ప్రలోభాలు కొనసాగించింది. గురువారం వేకువజామున పెదకాకానిలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర సంగం డెయిరీ ఉద్యోగులతో డబ్బు పంపిణీ చేయించారు. ఏకంగా రూ.500 నోట్లపై సైకిల్ బొమ్మ ముద్రించి మరీ ఓటర్లకు పంపిణీ చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో సంగం ఉద్యోగులనుపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేంద్ర సంగం డెయిరీ చైర్మన్‌గా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి టీడీపీ శ్రేణులు పట్టుబడ్డాయి. పోలింగ్ రోజున వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తొలిదశలోనూ టీడీపీ నేతలకు పోలీసులు సహకారం అందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రొంపిచర్ల, నకరికల్లు మండలాల్లో మహిళలపై కూడా దాడులకు దిగడం తెలిసిందే. -
ప్రాదేశికపోరులో నేడే తొలి సమరం
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ప్రాదేశిక పోరులో భాగంగా తొలి సమరం ఆదివారం జరగనుంది. జిల్లాలోని 24 జెడ్పీటీసీ, 353 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం 24 మండలాల్లో 1,149 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు అయోమయానికి గురికాకుండా జెడ్పీటీసీకి తెల్లరంగు, ఎంపీటీసీకి గులాబీరంగు బ్యాలెట్ పత్రాలను వాడుతున్నారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో ఇప్పటికే నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 24 జెడ్పీటీసీ స్థానాలకుగాను 129 మంది అభ్యర్థులు, 349 ఎంపీటీసీ స్థానాలకుగాను 1,339 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో మొత్తం 8,85,107 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణలో మొత్తం 5,745 మంది విధులు నిర్వహించనున్నారు. 128 మంది జోనల్, 128 రూట్ ఆఫీసర్లు, 1,149 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 1,149 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 3,447 మంది పోలింగ్ ఆఫీసర్లు ఎన్నికల్లో నిర్వహణలో పాల్గొంటున్నారు. వీరంతా శనివారం రాత్రి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో సహా చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సరళిని 104 మంది మైక్రో అబ్జర్వర్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. 340 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం వీడియోగ్రఫీ, వెబ్లైవ్కాస్టింగ్ ఏర్పాటు చేసింది. ఎన్నికలు జరగనున్న మండలాలు ఇవే తొలి విడతగా 24 మండల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. సంగారెడ్డి, కొండాపూర్, కల్హేర్, మనూరు, కంగ్టి, జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మునిపల్లి, రాయికోడ్, సదాశివపేట, కొల్చారం, అల్లాదుర్గం, నర్సాపూర్, అందోలు, మెదక్, కొండపాక, జగదేవ్‌పూర్, దుబ్బాక, నంగునూరు, మిరుదొడ్డి, చిన్నకోడూరు, సిద్దిపేట మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. -
ప్రచారం పతాకస్థాయికి...
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: మునిసిపల్ ఎన్నికలు ముగియగానే అందరి చూపు ఇప్పు డు గ్రామాలపైనే ఉంది. జిల్లాలో ఆరు మునిసిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికలు పూర్తరుున తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక లపై దృష్టిపడింది. నేతలంతా ఇప్పుడు పల్లెలవైపు పరుగులు తీస్తున్నారు. తొలివిడతగా మదనపల్లె డివిజన్ పరిధిలో 31 జెడ్పీటీసీలు, 447 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం ఆఖరు తేదీ కావడంతో గ్రామాల్లో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నేతలు పగలంతా ప్రచారంలోమునిగి, రాత్రులు మండలాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఇళ్లల్లో, పట్టున్న నేతల విడిదిలో బస చేస్తూ వ్యూహాలు పన్నుతున్నారు. గ్రామాల్లోనే మకాం నియోజకవర్గ స్థాయి నేతలంతా ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాల్లోనే మకాం వేసి ప్రచారం సాగిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రులు సైతం అక్కడే బస చేసి అభ్యర్థుల బలాలు, బలహీనతలను లెక్కకట్టి ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. పల్లెలంతా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక నేతలతో ఎక్కడికక్కడ సమాలోచనలు చేస్తున్నారు. ఇక నియోజవర్గ నేతల సతీమణులు సైతం ప్రచారాల్లో పాల్గొంటూ పతులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇక మహిళలకు రిజర్వయిన స్థానాల్లో సతులను గెలిపించుకోవడానికి పతులు కసరత్తు చేస్తున్నారు. అంతేగాక బరిలో ఉన్న అభ్యర్థి కుటుంబం మొత్తం గడపగడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంచేస్తోంది. చేరికలు, వలసలతో బిజీ.... నేతల వలసలు ఎక్కువయ్యాయి. ప్రధానంగా పశ్చిమ మండలంలోని ఓ ప్రధాన నాయకుడు ఇప్పటికే మూడు పార్టీల కండువాలు కప్పుకున్నారు. ఆయన పార్టీ మారినప్పుడల్లా క్యాడర్ విధిలేని పరిస్థితుల్లో ఇతర పార్టీల జెండాలు మోశారు. వరుసగా పార్టీలు మారుతుండటంతో జనం చీదరించుకుంటున్నారని ద్వితీయ శ్రేణి క్యాడర్ సదరు నాయకుడిపై గుర్రుగా ఉంటోంది. ఈ సారి తాము ఏ పార్టీలోకి రామని, ఎవ్వరికీ ప్రచారం చేయమని ఖరాకండిగా చెప్పేసింది. వరుస వలసలతో ప్రజల్ని తికమకపెట్టి మన పార్టీనే అధికారంలోకి వస్తుం దని గాంభీర్యం పలుకుతున్న టీడీపీకి రెబల్స్ పోరు వీడటంలేదు. తొలివిడత పోరులో 31 జెడ్పీటీసీ స్థానా ల్లో 11 చోట్ల రెబల్స్ ఉన్నారు. వీరిని బుజ్జగించే ప్రయత్నాలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు అప్పగించడంతో, ఒకవైపు ప్రచారం చేస్తూ, మరోవైపు అసమ్మతిని బుజ్జగించలేక వారి పరిస్థితి అయోమయంగా మారింది.