ఎన్నాళ్లకో అధికారం.. | Authority on '.. | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకో అధికారం..

Published Tue, Jun 17 2014 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

Authority on '..

  • ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికల్లో జాప్యం  
  •  నెల దాటినా ఖరారు కాని ముహూర్తం
  •  ‘పీఠం’ ఆశావహులకు క్యాంపుల భారం
  • జిల్లా పరిషత్ : అసలే ఆషాడం.. ఆపై అధిక మాసం అన్న చందంగా తయారైంది పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పరిస్థితి. దేశ అత్యున్నత న్యాయ స్థానం జోక్యంతో ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. నెల రోజుల తర్వాత మే 13వ తేదీన ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టి... విజయం సాధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

    ఈ ప్రకియ ముగిసి నెల గడిచింది. కానీ... గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం కుదరడం లేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి... ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పురపాలక సంఘాలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే ఆ ఫలితాలు వచ్చి నెలరోజులు దాటినా... స్థానిక సంస్థల్లో బాధ్యతలు చేపట్టే ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

    స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారు ఇంకా బాధ్యతలు చేపట్టకపోగా... ఎంపీపీ, జెడ్పీచైర్‌పర్సన్ పదవులు ఆశిస్తున్న వారి పరిస్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా తయారైంది. తమ సహచర ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల మద్దతును కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడగానే తమకు మద్దతునిస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను క్యాంపులకు తరలించారు.

    ప్రభుత్వం కొలువు దీరిన తర్వాతే ఎన్నికలు అనగానే... కొన్ని మండలాలకు చెందిన వారు క్యాంపులను విరమించుకున్నారు. వీరు మండలాలకు చేరుకోగానే వీరి ప్రత్యర్థులు గాలం వేయడం మొదలుపెట్టారు. దీంతో ఎంపీపీ, జెడ్పీచైర్‌పర్సన్ ఆశావహులు మళ్లీ క్యాంపుల బాట పట్టారు. నెల రోజుల పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ఏసీ రూముల్లో ఉంచుతూ... సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రూ.లక్షల్లో వ్యయమవుతుండడంతో లబోదిబోమంటున్నారు.
     
    మునిసిపాలిటీతో అడ్డంకి మొదలు..
     
    ప్రాదేశిక ఎన్నికల కంటే ముందే మునిసిపాలిటీల ఎన్నికలు జరిగాయి. మునిసిపల్ చైర్మన్లకు ఎన్నికలు నిర్వహించకుండా... ప్రాదేశిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని మునిసిపాలిటిల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు కలిగి ఉంటారు.

    వీరి ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక స్థానిక సంస్థల అధ్యక్షులను ఎన్నుకోవాలన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటిద్దామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన పూర్తయి తెలంగాణలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం  పూర్తి కావడంతోపాటు అసెంబ్లీ  సమావేశాలు కూడా ముగిశాయి. కానీ... అంధ్రప్రదేశ్‌లో ఇంకా అసెంబ్లీ సమావేశాలు మొదలు కాలేదు.

    ఈనెల 19 వ తేదీ నుంచి  నిర్వహిస్తామని ఏపీ నేతలు అంటున్నారు. శాసనసభ సమావేశమై సభ్యులు ప్రమాణస్వీకారం చేశాక మూడు నాలుగు రోజుల గడువులోగా  వారు ఏ స్థానిక సంస్థల్లో సభ్యులుగా చేరాలనుకుంటున్నారో రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. అంటే ఈ లెక్కన ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నికకు మరో పది, పదిహేను రోజులు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

    అదేవిధంగా... ఆంధ్రపదేశ్ రాష్ట్ర విభజన జరిగి.. నూతన రాష్ర్టంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పరిధి డోలాయమానంలో పడింది. దీనిపై కేంద్రం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో ఎన్నికల కమిషన్ అధికారులు గవర్నర్‌కు నివేదించారు. అక్కడ జాప్యం జరుగుతుండడంతో ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, మునిసిపాలిటీ చైర్మన్ల ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యమవుతోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement