తిరుపతి, న్యూస్‌లైన్ : సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆదివారం తిరుపతిలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను బాబూ రాజేంద్రప్రసాద్ ప్రారంభించి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గత కాంగ్రెస్ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమై పోయిందన్నారు. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారన్నారు. రాజ్యాంగంలోని 73, 74 అధికరణల సవరణల ప్రకారం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలకు ఇవ్వాల్సిన నిధులు, విధులు, అధికారాలను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జి, 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న 29 విభాగాలపై అధికారాలను దాఖలు పరచి స్థానిక స్వపరిపాలన, స్వయం పోషకత్వాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టతకు, హక్కుల సాధనకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలు పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలని కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చేస్తున్నామన్నారు.
సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన చాంబర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీ.అరవిందనాథరెడ్డి, బిర్రు ప్రతాప్‌రెడ్డి, సీహెచ్ సత్యనారాయణరెడ్డి, కాట్రగడ్డ రఘు, టంకాల బాబ్జీ, వీరంకి గురుమూర్తి, సుమతి, చింతాల సోమన్న, జగ్గాల రవి, పడాల వెంకట్రామారెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు.
హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు
Published Mon, May 26 2014 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
Advertisement
Advertisement