Ramakant Reddy
-
ఎన్నాళ్లకో అధికారం..
ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల్లో జాప్యం నెల దాటినా ఖరారు కాని ముహూర్తం ‘పీఠం’ ఆశావహులకు క్యాంపుల భారం జిల్లా పరిషత్ : అసలే ఆషాడం.. ఆపై అధిక మాసం అన్న చందంగా తయారైంది పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పరిస్థితి. దేశ అత్యున్నత న్యాయ స్థానం జోక్యంతో ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. నెల రోజుల తర్వాత మే 13వ తేదీన ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టి... విజయం సాధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ ప్రకియ ముగిసి నెల గడిచింది. కానీ... గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం కుదరడం లేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి... ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పురపాలక సంఘాలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే ఆ ఫలితాలు వచ్చి నెలరోజులు దాటినా... స్థానిక సంస్థల్లో బాధ్యతలు చేపట్టే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారు ఇంకా బాధ్యతలు చేపట్టకపోగా... ఎంపీపీ, జెడ్పీచైర్‌పర్సన్ పదవులు ఆశిస్తున్న వారి పరిస్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా తయారైంది. తమ సహచర ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల మద్దతును కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడగానే తమకు మద్దతునిస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను క్యాంపులకు తరలించారు. ప్రభుత్వం కొలువు దీరిన తర్వాతే ఎన్నికలు అనగానే... కొన్ని మండలాలకు చెందిన వారు క్యాంపులను విరమించుకున్నారు. వీరు మండలాలకు చేరుకోగానే వీరి ప్రత్యర్థులు గాలం వేయడం మొదలుపెట్టారు. దీంతో ఎంపీపీ, జెడ్పీచైర్‌పర్సన్ ఆశావహులు మళ్లీ క్యాంపుల బాట పట్టారు. నెల రోజుల పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ఏసీ రూముల్లో ఉంచుతూ... సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రూ.లక్షల్లో వ్యయమవుతుండడంతో లబోదిబోమంటున్నారు. మునిసిపాలిటీతో అడ్డంకి మొదలు.. ప్రాదేశిక ఎన్నికల కంటే ముందే మునిసిపాలిటీల ఎన్నికలు జరిగాయి. మునిసిపల్ చైర్మన్లకు ఎన్నికలు నిర్వహించకుండా... ప్రాదేశిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని మునిసిపాలిటిల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు కలిగి ఉంటారు. వీరి ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక స్థానిక సంస్థల అధ్యక్షులను ఎన్నుకోవాలన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటిద్దామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన పూర్తయి తెలంగాణలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతోపాటు అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి. కానీ... అంధ్రప్రదేశ్‌లో ఇంకా అసెంబ్లీ సమావేశాలు మొదలు కాలేదు. ఈనెల 19 వ తేదీ నుంచి నిర్వహిస్తామని ఏపీ నేతలు అంటున్నారు. శాసనసభ సమావేశమై సభ్యులు ప్రమాణస్వీకారం చేశాక మూడు నాలుగు రోజుల గడువులోగా వారు ఏ స్థానిక సంస్థల్లో సభ్యులుగా చేరాలనుకుంటున్నారో రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. అంటే ఈ లెక్కన ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నికకు మరో పది, పదిహేను రోజులు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా... ఆంధ్రపదేశ్ రాష్ట్ర విభజన జరిగి.. నూతన రాష్ర్టంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పరిధి డోలాయమానంలో పడింది. దీనిపై కేంద్రం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో ఎన్నికల కమిషన్ అధికారులు గవర్నర్‌కు నివేదించారు. అక్కడ జాప్యం జరుగుతుండడంతో ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, మునిసిపాలిటీ చైర్మన్ల ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యమవుతోంది. -
రెండు ఎంపీటీసీల ఎన్నిక రద్దు
డబ్బులు తీసుకున్నట్టు తేలినందుకే..18న రీ పోలింగ్: రమాకాంత్‌రెడ్డి హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బండపల్లి, మైలవరం ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ రెండింటి విషయంలోనూ డబ్బులు చేతులు మారినట్టు కలెక్టర్ విచారణలో తేలడమే ఇందుకు కారణమన్నారు. వాటికి మే 18న రీ పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని తూర్పు ఎర్రబల్లిలో బ్యాలెట్ పత్రాలను చెదలు తినడం వల్ల ఓట్ల లెక్కింపు సాధ్యం కాని మూడు పోలింగ్ కేంద్రాల్లో కూడా 18న రీ పోలింగ్ నిర్వహించనున్నామన్నారు. ‘‘తూర్పుగోదావరి జిల్లాలో పెదపూడి గ్రామంలో బ్యాలెట్ పత్రాలు తడిసిపోగా వాటిని ఆరబెట్టి లెక్కించాం. నాలుగు బ్యాలెట్ పత్రాల్లో ఎవరికి ఓటేసిందీ తెలియడం లేదు. అక్కడ అభ్యర్థి ఒకవేళ 4 ఓట్ల తేడాతో గెలిస్తే రీ పోలింగ్ నిర్వహిస్తాం’’ అని మంగళవారం ఆయన విలేకరులకు చెప్పారు. కార్పొరేషన్ మేయర్, జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్ష పదవులకు జరిగే పరోక్ష ఎన్నికలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజుల తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కుండటమే ఇందుకు కారణమని చెప్పారు. వారి ప్రమాణ స్వీకారం ఎప్పుడో తెలియదు గనుక పరోక్ష ఎన్నికల తేదీని ఇప్పుడు ప్రకటించలేకపోతున్నామన్నారు. -
ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
-
ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఓట్లను రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కిస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అయితే సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓట్లను లెక్కించలేదు. సార్వత్రిక ఎన్నికలు రేపటితో ముగుస్తున్నందున ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 65 ప్రాంతాల్లో 155 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉందని రమాకాంత్ రెడ్డి చెప్పారు. 8 వేల మంది సిబ్బందితో ఓట్లను లెక్కిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో 39 వార్డులు ఏకగ్రీవం అయినట్లు చెప్పారు. ఎల్లుండి మండల, జిల్లా పరిషత్ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. 16,214 ఎంపీటీసీ, 1093 జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు ఆ రోజు వెల్లడవుతాయని చెప్పారు. 2099 కేంద్రాల్లో మండల, జెడ్పీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో మద్యం దుకాణాలను రేపు అర్ధరాత్రి వరకు మూసివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాతే ఎమ్మెల్యే , ఎంపీలకు ఎక్స్అఫిషియో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అందువల్ల ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాతే మండల, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 145 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్ల ఓట్లను లెక్కిస్తారు. దాదాపు 42 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. -
‘పంచాయతీ రాజ్’ ముహూర్తం ఖరారు
సాక్షి, నెల్లూరు: ఎట్టకేలకు పంచాయతీరాజ్ ఎన్నికల నగారా మోగింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ప్రకటించారు. జిల్లాలోని 46 జెడ్పీటీసీలు, 583 ఎంపీటీసీల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 6న జెడ్పీటీసీలతో ఎంపీటీసీలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే నెల 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు పింక్, జెడ్పీటీసీలకు తెల్ల రంగు బ్యాలెట్ పత్రం ఉంటుంది. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న సుప్రీంకోర్టు తీర్పును ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. పంచాయతీరాజ్ ఎన్నికలను వాయిదా వేయాలని కొన్ని పార్టీలు కోరుతున్నాయి. ఈ క్రమంలో 12న వెలువడనున్న సుప్రీంకోర్టు తుదితీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
నేడు తెలంగాణ విజయోత్సవ సభ
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు గొట్టిముక్కుల రమాకాంత్‌రెడ్డి తెలి పారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హన్మకొండ రాయపురలోని జక్రియా ఫంక్షన్ హాల్లో విజయోత్సవ సభ జరుగుతుం దని, అంతకుముందుగా ఉదయం 10 గంటలకు కాజీపేట నుంచి హన్మకొండ చౌరస్తా వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత చౌరస్తా నుంచి ఫంక్షన్ హాల్ వరకు పాదయాత్రగా వెళ్తామని తెలిపారు. సభలో కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యతో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చల్ల వంశీధర్‌రెడ్డి పాల్గొంటారని, నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రమాకాంత్‌రెడ్డి కోరారు. సమావేశంలోయూత్ కాంగ్రెస్ నాయకులు జన్ను నవీన్, చీకటి కీర్తికుమార్, జన్ను సతీష్, రాజారపు శ్రీనాథ్ తది తరులు పాల్గొన్నారు.