మున్సిపల్ ఎన్నికల ఓట్లను రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కిస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అయితే సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓట్లను లెక్కించలేదు. సార్వత్రిక ఎన్నికలు రేపటితో ముగుస్తున్నందున ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 65 ప్రాంతాల్లో 155 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉందని రమాకాంత్ రెడ్డి చెప్పారు. 8 వేల మంది సిబ్బందితో ఓట్లను లెక్కిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో 39 వార్డులు ఏకగ్రీవం అయినట్లు చెప్పారు. ఎల్లుండి మండల, జిల్లా పరిషత్ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. 16,214 ఎంపీటీసీ, 1093 జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు ఆ రోజు వెల్లడవుతాయని చెప్పారు. 2099 కేంద్రాల్లో మండల, జెడ్పీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో మద్యం దుకాణాలను రేపు అర్ధరాత్రి వరకు మూసివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాతే ఎమ్మెల్యే , ఎంపీలకు ఎక్స్‌అఫిషియో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అందువల్ల ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాతే మండల, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 145 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్‌ల ఓట్లను లెక్కిస్తారు. దాదాపు 42 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది.
Published Sun, May 11 2014 6:27 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM