రెండు ఎంపీటీసీల ఎన్నిక రద్దు
డబ్బులు తీసుకున్నట్టు తేలినందుకే..18న రీ పోలింగ్: రమాకాంత్‌రెడ్డి
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బండపల్లి, మైలవరం ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ రెండింటి విషయంలోనూ డబ్బులు చేతులు మారినట్టు కలెక్టర్ విచారణలో తేలడమే ఇందుకు కారణమన్నారు. వాటికి మే 18న రీ పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని తూర్పు ఎర్రబల్లిలో బ్యాలెట్ పత్రాలను చెదలు తినడం వల్ల ఓట్ల లెక్కింపు సాధ్యం కాని మూడు పోలింగ్ కేంద్రాల్లో కూడా 18న రీ పోలింగ్ నిర్వహించనున్నామన్నారు.
‘‘తూర్పుగోదావరి జిల్లాలో పెదపూడి గ్రామంలో బ్యాలెట్ పత్రాలు తడిసిపోగా వాటిని ఆరబెట్టి లెక్కించాం. నాలుగు బ్యాలెట్ పత్రాల్లో ఎవరికి ఓటేసిందీ తెలియడం లేదు. అక్కడ అభ్యర్థి ఒకవేళ 4 ఓట్ల తేడాతో గెలిస్తే రీ పోలింగ్ నిర్వహిస్తాం’’ అని మంగళవారం ఆయన విలేకరులకు చెప్పారు. కార్పొరేషన్ మేయర్, జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్ష పదవులకు జరిగే పరోక్ష ఎన్నికలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజుల తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కుండటమే ఇందుకు కారణమని చెప్పారు. వారి ప్రమాణ స్వీకారం ఎప్పుడో తెలియదు గనుక పరోక్ష ఎన్నికల తేదీని ఇప్పుడు ప్రకటించలేకపోతున్నామన్నారు.