సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలతోపాటు 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 15 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మూడు చోట్ల కోర్టు కేసులతో వాయిదా పడ్డాయి. కాకినాడ స్థానానికి 2017లోనే ఎన్నిక జరిగినందున ఇప్పుడు నిర్వహించడం లేదు. ఇక 104 మున్సిపల్, నగర పంచాయతీలకుగానూ 75 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి.
కోర్టు కేసులు, కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం కావడం తదితర కారణాలతో 29 చోట్ల ఎన్నికలు వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ మీడియాకు తెలిపారు. పామిడి నగర పంచాయతీ డౌన్‌గ్రేడ్‌కు ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఎన్నిక జరపడం లేదన్నారు. వాయిదా వేసిన చోట ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై ఏమాత్రం ఉండదన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తర్వాతే చేపడతామన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవి కావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం వాటిపై ఉండదని పేర్కొన్నారు.
- సాంకేతిక కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డ చోట కొద్ది వారాల వ్యవధిలోనే నిర్వహిస్తాం.
- రాజధాని గ్రామాలను అమరావతి మున్సిపల్ కార్పొరేషన్‌గా చేయాలని ప్రతిపాదన ఉంది. అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు కొద్ది వారాలకు మించి సమయం పట్టదు.
ఎన్నికల డిపాజిట్ నిబంధనలివీ
- మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్‌గా పోటీ చేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ. 2,500, ఇతరులు రూ.5,000 చొప్పున డిపాజిట్ చెల్లించాలి.
- మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో కౌన్సిలరుగా పోటీ చేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.1,500, ఇతరులు రూ.3,000 చొప్పున డిపాజిట్ చెల్లించాలి.
- మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా పోటీ చేసే వారి గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితి రూ.2 లక్షలు. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లకు రూ.1.50 లక్షలు, నగర పంచాయతీల్లో కౌన్సిలర్లకు రూ.లక్ష ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిగా నిర్థారించారు.
Comments
Please login to add a commentAdd a comment