
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రెండు రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భారీ కానుకను అందజేసింది. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లా పరిషత్‌లు ఉండగా, అందులో సగానికంటే పైగా అంటే.. ఏడు జెడ్పీ చైర్మన్ పదవులను మహిళలకు రిజర్వు చేసింది. దీంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో మహిళలే జడ్పీ చైర్‌పర్సన్లుగా రాబోతున్నారు.
ఈ మేరకు జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల వివరాలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. అలాగే, రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవుల రిజర్వేషన్లను కూడా శుక్రవారం ఉదయానికే ఆయా జిల్లాల కలెక్టర్లు ఖరారు చేశారు. ఈ జాబితాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేశారు.
ఎంపీపీ, జెడ్పీటీసీల్లో మహిళలకే పెద్దపీట
ఇదిలా ఉండగా, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల రిజర్వేషన్లలోనూ సగానికి పైగా పదవులు మహిళలకే రిజర్వు అయ్యాయి. 660 మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవులు ఉండగా.. అందులో 334 పదవులు, 660 జెడ్పీటీసీ స్థానాల్లో 335 మహిళలకు రిజర్వు అయ్యాయి. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా 9,639 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
వీటిలో 4,769 ఎంపీటీసీ స్థానాలు కూడా మహిళలకే రిజర్వు అయ్యాయి. కాగా, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల రిజర్వేషన్లలో జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జనాభా ఆధారంగా ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. అలాగే, మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఎంపీటీసీ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment