హైదరాబాద్: స్థానిక సంస్థల చైర్‌పర్సన్ల ఎన్నికలను జూలై మొదటి వారంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రత్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడై నెలన్నర రోజులు గడుస్తున్నా.. పరోక్ష పద్ధతిలో జరిగే చైర్‌పర్సన్ల ఎన్నికలు ఇంకా జరగలేదు. ఈమేరకు జడ్పీ, ఎంపీపీ పరిషత్ చైర్మన్ ఎన్నికలకు ఈసీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు ముగిసిన అనంతరం సుదీర్ఘ కసరత్తు చేసిన ఈసీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
జులై 3న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికతో పాటు, మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. అనంతరం జులై 4న ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఉండగా, జులై 5న జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుందని ఈసీ పేర్కొంది. రాష్ర్ట విభజన చట్టంలో ఎన్నికల సంఘం ప్రస్తావన లేకపోవడంతో ఇంతకాలం రాష్ట్ర ఎన్నికల సంఘం సందిగ్ధంలోనే ఉంది.