సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ప్రాదేశిక’ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో సోమవారం జిల్లాస్థాయిలో కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. వరుస ఎన్నికలతో ఇబ్బందులు తలెత్తుతాయని పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఎన్నికల సంఘం పునరాలోచనలో పడింది. దీంతో అఖిలపక్షం సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం వారినుంచి భిన్న అభిప్రాయాలు రావడంతో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు సుప్రీంకోర్టులో ఎన్నికల అంశం పరిశీలనలో ఉన్నప్పటికీ యంత్రాంగం నేడు నోటిఫికేషన్ జారీ చేయనుంది.
నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో జిల్లాలో ఎన్నికలు నిర్వహించే తేదీలు నేడు ఖరారు కానున్నాయి. జిల్లాలో 614 ఎంపీటీసీ స్థానాలు, 33 జెడ్పీటీసీ స్థానాల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. 35 పంచాయతీలను నగర పంచాయతీలుగా చేయాలని ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే.
దీంతో అప్పట్లో పంచాయతీ ఎన్నికలు సైతం నిర్వహించలేదు. అయితే వీటిని నగర పంచాయతీలుగా చేయదలిస్తే ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించకూడదు. ఈ పంచాయతీల పరిధిలో 143 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహించకపోతే రెండు జెడ్పీటీసీ స్థానాలకు సైతం ఎసరుపడుతుంది. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు కూడా ప్రభుత్వం వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం జిల్లాలోని అన్ని స్థానాలకూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జిల్లా పరిషత్ అధికారులు చెబుతున్నారు.
పార్టీల్లో అయోమయం!
మున్సిపల్, సాధారణ ఎన్నికల్లో తలమునకలైన రాజకీయ పార్టీలకు తాజాగా ప్రాదేశిక ఎన్నికలు తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. పురపాలక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసినప్పటికీ, అభ్యర్థులను ఖరారు చేయలేని రాజకీయ పార్టీలకు ప్రాదేశిక ఎన్నికలు కూడా ఇదే తరహాలో తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది.
ఒక్కో పార్టీ నుంచి ఇద్దరికి మించి ఆశావహులు ఉండడంతో ఎవర్ని ఖరారు చేసినా మరోవైపు నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల కంటే ముందే ప్రాదేశిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీలు ఆచితూచి అడుగేస్తున్నాయి. నేడు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నప్పటికీ ఆ లోపు రాజకీయ పార్టీలు కోర్టును ఆశ్రయిస్తే మధ్యంతర ఉత్తర్వులతో ఎన్నికలు ప్రక్రియ వాయిదాపడే అవకాశం లేకపోలేదు.
నేడు జిల్లాస్థాయిలో ‘ప్రాదేశిక’ నోటిఫికేషన్
Published Mon, Mar 17 2014 12:04 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement
Advertisement