
పోలింగ్ కేంద్రాల గుర్తింపు.. ప్రచురణ
ఎన్నికలెప్పుడు వచ్చినా... సంసిద్ధమైన పీఆర్, ఎస్‌ఈసీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశమున్నా, ఎన్నికల పనుల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. శనివారం జిల్లాలు, మండల స్థాయిలో పోలింగ్ కేంద్రాలను గుర్తించి దానికి సంబంధించిన జాబితాలను జిల్లా, మండల కేంద్రాల్లో ప్రచురించారు. రాష్ట్రవ్యాప్తంగా 570 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు ఓటర్ల జాబితాకు సంబంధించిన కసరత్తు సాగుతోంది.
ఎన్నికలు వాయిదా పడుతున్నాయనే భావనలో ఉండొద్దని, ఆయా పనులకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే ఉండాలని అధికారులు, సిబ్బందికి పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బందికి శిక్షణ తదితరాలన్నీ పూర్తిచేసి, ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చినా వెంటనే ఎన్నికల విధుల్లో దిగేందుకు సిద్ధంగా ఉండాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేశారు.
ఎప్పటికప్పుడు ఎన్నికల ఏర్పాట్లపై జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు, గూగుల్‌మీట్‌లు నిర్వహిస్తూనే ఉన్నారు.
ఎస్‌ఈసీ ఆదేశాలకు అనుగుణంగా...
ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పీఆర్ శాఖ ద్వారా పోలింగ్ కేంద్రాల జాబితా, ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. పైగా సిబ్బందికి కూడా దీనికి సంబంధించిన శిక్షణను కూడా పూర్తి చేసింది. శనివారం పోలింగ్ స్టేషన్లు ఖరారు కావడంతో టీ–పోల్ యాప్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా 500 నుంచి 700 ఓటర్లను మ్యాపింగ్ చేసి ఆయా కేంద్రాలకు కేటాయించాల్సి ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టులోనూ కేసు విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. కోర్టుకు ఆయా విషయాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా నుంచి గ్రామస్థాయి వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పీఆర్ శాఖ ఆదేశించింది. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏవి ముందు నిర్వహించాల్సి వచ్చినా, అందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉండాలని సూచించింది.
కులగుణనలో రెండోవిడతలో వివరాల సేక రణ, పరిశీలన, ఆపై కేబినెట్ భేటీలో సమగ్ర నివేదిక ఆమోదం, ఆపై అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టబద్ధత కల్పించేలా బిల్లు పెట్టి కేంద్రానికి, పార్లమెంట్‌కు పంపించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు మరికొన్ని నెలల సమయం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment