![High level meeting to be held under Telangana CM Revanth Reddy on election](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/GRAMA-PANCHAYITHI-ELECTIONS.jpg.webp?itok=MYqtGPQo)
బీసీ రిజర్వేషన్లూ ఖరారయ్యే అవకాశం
ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న ఉన్నతస్థాయి సమావేశం
డెడికేటెడ్ కమిషన్ నివేదికపై చర్చించనున్న సీఎం, మంత్రులు, అధికారులు
ఈ నెల 17 లోగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు చాన్స్
ఎన్నికల సన్నాహాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల తేదీలతో పాటు బీసీ రిజర్వేషన్ల ఖరారుపైనా బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, ఆయా శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొననున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదికను సమర్పించిన నేపథ్యంలో, నివేదికపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, అదే జరిగితే అయిదారు రోజుల్లోనే అంటే ఈ నెల 17 లోగానే స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) విడుదల చేయవచ్చని చెబుతున్నారు. అలాగే ముందుగా ఏ ఎన్నికలు జరపాలి?, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలా..?, లేక గ్రామపంచాయతీ ఎన్నికలా?.. ఏయే తేదీల్లో వీటిని నిర్వహించాలి? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
వారం తేడాతోనే రెండు ఎన్నికలు!
ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించినా లేదా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించినా, వారం రోజుల తేడాతోనే రెండు ఎన్నికలూ నిర్వహించేందుకు ఎస్‌ఈసీ సిద్ధమైంది. షెడ్యూల్‌ను ప్రకటించాక 21 రోజుల్లోనే ఆ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అంతా ముగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్‌ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడానికి వీలుగా వారం రోజుల్లో సీఎస్, డీజీపీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించవచ్చని తెలిసింది.
తదనుగుణంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లేదా ప్రత్యక్షంగా ఎస్‌ఈసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను మండలాలు, జిల్లా పరిషత్‌లలో ప్రదర్శించారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ కూడా మొదలైంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ ఈ నెల 15 కల్లా పూర్తవుతాయని, షెడ్యూల్ వెలువడిన వెంటనే సంబంధిత అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కార్యరంగంలోకి దిగుతారని పంచాతీరాజ్, ఎస్‌ఈసీ అధికారులు చెబుతున్నారు.
తొలుత ఎంపీటీసీ ఎన్నికలే..?
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరంగా క్షేత్రస్థాయిలో చేస్తున్న ఏర్పాట్లు, అధికారులు, సిబ్బంది పరంగా నిర్వహిస్తున్న సమీక్షలను బట్టి చూస్తే మాత్రం ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే జరిగే సూచనలున్నాయి. బుధవారం ఉదయం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్ మినహా), అదనపు కలెక్టర్లు (స్థానికసంస్థలు), ఆర్డీవోలు, సీఈవోలకు పంచాయతీరాజ్ శాఖ శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు కమిషనరేట్ కార్యాలయం నుంచి లేఖ పంపించారు.
మరోవైపు క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కోటా ఖరారు చేయగానే.. వచ్చే 3,4 రోజుల్లోనే పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌ల స్థాయిల్లో (స్థానికంగా జీపీలు, ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలు) జనాభాకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పీఆర్ శాఖ నిర్ణయించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా కాకుండా...స్థానికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా ప్రకారం హెచ్చుతగ్గుల్లో ఉంటాయని అధికార వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment