
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
ఈ నెలాఖరులో జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్
తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే యోచన
త్వరలో జరిగే మంత్రివర్గ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం
ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు
వీలున్నంత త్వరగా సన్న ధాన్యానికి బోనస్
తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కారు సిద్ధం!
రిజర్వేషన్ల పెంపు లేకుండానే..?
కాంగ్రెస్‌లో మొదలైన హడావుడి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగనుంది. వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల చివరి వారంలోనే వస్తుందని సమాచారం. కాగా స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఎప్పుడో ముగిసిన పాలకవర్గాల గడువు
రాష్ట్రంలోని స్థానిక సంస్థల గడువు ఎప్పుడో ముగిసింది. గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు 2024, జనవరిలోనే అయిపోయింది. జిల్లా, మండల పరిషత్ పాలకవర్గాల గడువు గత ఏడాది జూన్‌లో పూర్తయింది. ఇక పురపాలక సంఘాలకు ఈ ఏడాది జనవరిలో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో వీలున్నంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది.
మరోవైపు కేంద్రం ప్రతి ఏటా స్థానిక సంస్థలకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు నిధులు ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే పాలకవర్గాలు లేని కారణంగా ఈ నిధులను రాష్ట్రం కోల్పోవాల్సి వస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేకపోతోందని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో స్థానిక సమరానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. కాగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించే ముందే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనుంది. దీంతో పాటు సన్న రకం ధాన్యానికి బోనస్ ఇచ్చే ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తి చేయనుంది.
ఈ రెండు పథకాల నిధులను జమ చేసిన అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు 15 రోజులు మాత్రమే సమయం ఉందని ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సమాచారాన్ని ధ్రువీకరిస్తున్నాయి. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్ ఇస్తారని, ఈ ఎన్నికల అనంతరం వారం రోజుల వ్యవధిలోనే సర్పంచ్‌లు, మున్సిపాలిటీలకు కూడా ఎన్నికల నగారా మోగించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
అధికార పార్టీలో ‘కమిటీల’ హడావుడి
స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరుగుతాయనే సమాచారం నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హడావుడి పెరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేయనున్న గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల నియామకానికి గడువు విధించారు. డీసీసీ అధ్యక్షులు, పార్టీ పరిశీలకులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఈ మేరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ దిశా నిర్దేశం చేశారు.
ఈ నెల 25వ తేదీకల్లా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాలని, గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలకు నియామక ఉత్తర్వులను కూడా ఇచ్చేయాలని ఆమె ఈ సమావేశంలో ఆదేశించారు. దీంతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుగురు ముఖ్య నాయకుల పేర్లను పీసీసీకి పంపాలని, వీరికి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ డైరెక్టర్లుగా అవకాశం కల్పిస్తామని చెప్పినట్టు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో కేడర్ ఉత్సాహంగా పాల్గొనేలా చేయాలనే వ్యూహంతోనే మీనాక్షి ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
రిజర్వేషన్ల పెంపు లేకుండానే..!
ఈ నెల చివరి వారంలో స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే పక్షంలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు అవకాశం లేనట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పార్లమెంటుతో పాటు రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. అయితే ఇది ఇప్పట్లో జరిగే అవకాశం లేదు.
అందువల్ల బీసీలకు పాత రిజర్వేషన్లనే కొనసాగించవలసి ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం సీట్లు కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో..కేంద్రం అనుమతితో నిమిత్తం లేకుండా పార్టీ పరంగా బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
నేడు మంత్రులతో సీఎం కీలక చర్చలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రధానంగా స్థానిక ఎన్నికల నిర్వహణ, రైతు భరోసా నిధుల పంపిణీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. వాస్తవానికి ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సోమవారం మాత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది.