
ప్రమాద ఘటన గురించి సీఎం రేవంత్‌రెడ్డికి వివరిస్తున్న ఫైర్ శాఖ డీజీ నాగిరెడ్డి. చిత్రంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి, రాజనర్సింహ, వివేక్
సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి
ఇన్ని ప్రాణాలు పోవడం ఉమ్మడి రాష్ట్రంలో సైతం జరగలేదు
మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ఇప్పించాలి
తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు..స్వల్పంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు
ఈ మేరకు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడాలని మంత్రులు, అధికారులను ఆదేశించానన్న సీఎం
ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని వెల్లడి
క్షతగాత్రులకు పరిశ్రమ యాజమాన్యంతో కలిసి పూర్తిస్థాయి వైద్య చికిత్సకు హామీ
సాక్షి, హైదరాబాద్: ‘ఇది అత్యంత విషాదకరమైన దుర్ఘటన. ఇన్ని ప్రాణాలను బలిగొన్న ప్రమాదం రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పటివరకు జరగలేదు. పేలుడు సంభవించిన సమయంలో 143 మంది పరిశ్రమలో ఉన్నారు. 58 మందిని అధికారులు గుర్తించారు.. మిగిలిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
శిథిలాల కింద చిక్కుకున్నారా?, ఎక్కడైనా చికిత్స పొందుతున్నారా? భయంతో ఎక్కడైనా ఉన్నారా? ఇవన్నీ తెలియాలి. ఈ ఘటనలో చనిపోయిన కార్మీకుల కుటుంబాలకు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి రూ.కోటి నష్టపరిహారం ఇప్పించాలని మంత్రులు, అధికారులను ఆదేశించా. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.5 లక్షలు ఇప్పించాలని సూచించా..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.
పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో సోమవారం భారీ పేలుడు సంభవించిన సిగాచి పరిశ్రమను మంగళవారం ఉదయం మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డిలతో కలిసి సీఎం సందర్శించారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు.
పూర్తిస్థాయి నివేదికకు ఆదేశం
ప్రమాదం జరగడానికి కారణాలేంటి?, నివారణ చర్యలకు ఎలాంటి అవకాశం ఉండింది?, ప్రమాదం తర్వాత తక్షణ సహాయక చర్యలు ఎలా ఉన్నాయి?, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న వైద్య సహాయం తదితర అంశాలపై రేవంత్ ఆరా తీశారు. అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇప్పటివరకు (మంగళవారం ఉదయానికి) 36 మంది మరణించినట్లు తెలిసిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారందరికీ పూర్తి వైద్య సదుపాయాన్ని పరిశ్రమ యజమాన్యంతో కలిసి ప్రభుత్వం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారించేందుకు ఉన్నతస్థాయి అధికారుల బృందాన్ని నియమిస్తున్నామని, వారిచ్చే నివేదిక ఆధారంగా స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తామని తెలిపారు. పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు నిర్వహించాల్సిన తనిఖీలను చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని కార్మీక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌ను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరిశ్రమలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చేలా నివేదిక ఉండాలని సూచించారు.
పరిశ్రమ యాజమాన్యం ఎక్కడ?
పేలుడు సంభవించి 24 గంటలైనా పరిశ్రమ యాజమాన్యం రాకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వంతో చర్చలకు, కార్మీకుల కుటుంబాలకు నష్టపరిహారం, క్షతగాత్రులకు వైద్య సదుపాయం అందించడానికి ఎవరైనా ఆథరైజ్డ్ పర్సన్ (అ«దీకృత వ్యక్తి) ఉన్నారా? అని ప్రశ్నించారు. కార్మికులకు నష్టపరిహారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని పరిశ్రమ అధికారి జాకబ్‌ను ప్రశ్నించారు.
పరిశ్రమ యాజమాన్యం మానవతా దృక్పథంతో నష్టపరిహారం ఇవ్వాలని సీఎం అన్నారు. దీనిపై మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, అధికారులతో చర్చించాలని సూచించారు. ప్రమాద సమయంలో ప్రభుత్వంలోని వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోవడానికి ఎవరైనా అధికారి ఉన్నారా అని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఆరా తీశారు. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు.
సీఎస్ నేతృత్వంలో కమిటీ
ఈ ఘటనపై నిపుణుల కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. రసాయన పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించాలని, వాటిల్లోని లోపాలను గుర్తించాలని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన.. ప్రకృతి విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఫైర్ సరీ్వసెస్ అడిషనల్ డీజీలతో కమిటీ వేస్తున్నట్లు చెప్పారు.
‘బాయిలర్స్ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గతంలో పరిశ్రమల్లో తనిఖీలు చేసినప్పుడు ఏమైనా లోపాలు గుర్తించారా? గుర్తించిన వాటిని సరిచేసుకోవాలని పరిశ్రమ యాజమాన్యానికి చెప్పారా?’ అని సీఎం ఈ సందర్భంగా అధికారులను ప్రశ్నించారు. సిగాచి పరిశ్రమలో కొన్ని లోపాలను గుర్తించామని, వాటిని సరిచేసుకోవాలని కూడా సూచించామని అధికారులు వివరించారు. దీంతో మీ సూచనలు అమలు చేశారా లేదా అనేది పర్యవేక్షించారా? అని అధికారులను తిరిగి సీఎం నిలదీశారు.
మృతుల పిల్లల చదువు ప్రభుత్వం బాధ్యత
ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని చెప్పారు. చనిపోయిన కార్మికుని కుటుంబాలకు తక్షణ సాయంగా లక్ష రూపాయలు, గాయపడిన వారికి రూ. 50 వేలు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మరణించిన వారి పిల్లలకు పూర్తి విద్యనందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో వారికి ప్రవేశాలు కల్పించే అంశం పరిశీలించాలని అధికారులకు సూచించారు.