
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో శిథిలాలను తొలగిస్తున్న సహాయక సిబ్బంది
పాశమైలారం ఘటనలో 40 దాటిన మృతుల సంఖ్య!
సిగాచి పరిశ్రమలో రెండోరోజూ కొనసాగిన సహాయక చర్యలు
శిథిలాలు తొలగించే కొద్దీ బయట పడుతున్న మృతదేహాలు
పటాన్‌చెరు పోస్టుమార్టం గదిలో శవాల గుట్ట
డీఎన్‌ఏ పరీక్షల అనంతరం బంధువులకు అప్పగింత
16 మంది ఆచూకీ కోసం బంధువుల్లో ఆందోళన
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురు కార్మీకులు..కొందరి పరిస్థితి విషమం
రంగంలోకి ఫోరెన్సిక్ నిపుణులు.. యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/రామచంద్రాపురం: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ మంగళవారం రాత్రికి 40 దాటినట్లు సమాచారం. వీరిలో 15 మంది వివరాలు తెలిశాయి. పలువురు కార్మీకులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
మరో 16 మంది ఆచూకీ కోసం కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మిగతా వారి జాడ తెలియాల్సి ఉంది. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగే కొద్దీ ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉన్నట్లు భావిస్తుండగా, ఇందులో 58 మంది ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ప్రమాదంలో 36 మంది మాత్రమే మరణించారని ప్రకటించారు.
అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు
పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో అడ్మినిస్ట్రేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగం భవనాలు కుప్పకూలాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మరోవైపు యంత్రాలు, వాటి విడిభాగాలు, పైపులు, రేకులు చెల్లా చెదురయ్యాయి. శిథిలాలను తొలగించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా బృందాలు శ్రమిస్తున్నాయి.
బయటపడిన కార్మీకుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఎక్కడికక్కడ మాంసపు ముద్దలు పడిపోయాయి. వంద మీటర్ల వరకు ఎగిరిపడ్డాయి. మృతదేహాలను, మాంసపు ముద్దలను బెడ్‌షీట్ లాంటి వాటిల్లో కట్టి మార్చురీకి తరలిస్తున్నారు. పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి ఏకంగా 36 మృతదేహాలు రావడంతో మార్చురీ గదిలో శవాల గుట్ట తయారైంది.
డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాకే..
మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రం కావడంతో వాటిని బంధువులకు అప్పగించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు చేయడం అనివార్యమైంది. ఉస్మానియా ఆసుపత్రికి చెందిన ఫోరెన్సిక్ బృందాలు..తమవారి ఆచూకీ చెప్పాలంటూ వస్తున్న మృతుల కుటుంబీకుల రక్తనమూనాలు సేకరిస్తున్నారు. పేలుడు ఘటనలో గల్లంతైన వారి వివరాల సేకరణకు ఐలా క్లినిక్‌లో హెల్ప్ డెస్‌్కను నిర్వహిస్తున్నారు. మంగళవారం అక్కడ రక్త పరీక్షలను నిర్వహించారు.
అలాగే పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రిలో కూడా డీఎన్‌ఎ టెస్టులు చేస్తున్నారు. డీఎన్‌ఏలు సరిపోల్చుకున్నాకే మృతదేహాలను అప్పగిస్తున్నారు. డీఎన్‌ఏ రిపోర్టు రావడానికి 48 గంటల వరకు సమయం పడుతుండటంతో మృతదేహాల అప్పగింత ఆలస్యమవుతోంది. మంగళవారం రాత్రి వరకు 13 మృతదేహాలను గుర్తించిన అధికారులు.. ఇందులో 11 మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆస్పత్రుల్లో చేరినవారిలో కొందరు మరణించారని తెలుస్తుండగా, అధికారులు మాత్రం ధ్రువీకరించడం లేదు.
రూ.లక్ష తక్షణ ఆర్థిక సాయం
11 మంది మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున అందించారు. 34 మంది క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఇచ్చారు. జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, రెవెన్యూ అధికారులు వారి కుటుంబాలకు ఈ మొత్తాన్ని నగదు రూపంలో అందజేశారు. మృతదేహాలను తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. మృతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన నిరుపేదలే ఎక్కువగా ఉండటంతో మృతదేహాల తరలింపునకు వారి కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తమవారి కోసం పరిశ్రమ, మార్చురీ వద్ద ఆరా
ప్రమాదం జరిగాక ఇప్పటివరకు ఆచూకీ లభించని వారి కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పరిశ్రమ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్‌్కలో ఉన్న అధికారుల వద్దకు వెళ్లి తమ వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఆచూకీ లభించకపోవడంతో పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్దకు వచ్చి అధికారులను ఆరా తీశారు. అక్కడా ఏమీ తెలియకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు.
గుర్తించిన మృతదేహాలను తీసుకెళ్లేందుకు కొందరు ఆసుపత్రి వద్దే ఎదురుచూస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన దాసరి సునీల్‌కుమార్ అనే ఉద్యోగి ఆచూకీ కోసం ఆయన కుటుంబసభ్యులు మార్చురీ వద్దకు వచ్చి ఆరా తీశారు. మొదటి షిఫ్టులో విధుల్లోకి వెళ్లారని, ఎక్కడున్నాడో ఇప్పటివరకు తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జాడ కోసం ఫోన్ల చార్జింగ్
పరిశ్రమలో ప్రతినిత్యం డ్యూటీలకు వెళ్లేముందు ఫ్రంట్ ఆఫీస్‌లో ఫోన్లను డిపాజిట్ చేస్తారు. అలా ప్రమాదం జరిగే ముందు డిపాజిట్ చేసిన సెల్‌ఫోన్లతో అధికారులు ఆచూకీ లేని వారి జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సెల్ ఫోన్‌లకు చార్జింగ్ పెట్టి ఆ ఫోన్‌లలో ఉన్న నంబర్లకు ఫోన్‌లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తమ బంధువుల ఫొటోలను బాధిత కుటుంబీకులు హెల్ప్ డెస్‌్కలోని వారికి చూపిస్తున్నారు. అలాగే పారిశ్రామికవాడలో తమ రాష్ట్రానికి చెందిన వారు ఎవరు కనిపించినా వాకబు చేస్తున్నారు.
శాంపిళ్లు సేకరించిన ఫోరెన్సిక్ బృందం
సిగాచి పరిశ్రమను ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలించింది. మంగళవారం ఉదయమే ఘటనాస్థలికి చేరుకున్న ఈ బృందం పేలుడు జరిగిన ప్రాంతాన్ని అణువణువూ శోధించింది. పేలుడుతో ఏయే మెటీరియల్స్ కింద పడ్డాయి..పడిన ఆ మెటీరియల్ ఏ స్టేజీలో ఉంది.. వంటి వివరాలను సేకరించింది. మెటీరియల్ శాంపిళ్లను ప్రత్యేకం కవర్లలో వేసుకుని తీసుకెళ్లారు. సిగాచి ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ బృందం ప్రాథమిక ఆధారాలు సేకరించి ఉంటుందని భావిస్తున్నారు.
యజమాన్య నిర్లక్ష్యంతోనే..!
పటాన్‌చెరు టౌన్: సిగాచీ పరిశ్రమ యజమాన్యంపై స్థానిక బీడీఎల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. యాజమాన్య నిర్లక్ష్యాన్నే కారణంగా చూపుతూ బీఎన్‌ఎస్ 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.