![Telangana Local Elections Consider For NOTA](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Telangana-Local-Elections.jpg.webp?itok=NllaiYm5)
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘నోటా’ బటన్ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇవాళ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశంలో ఈ అంశాన్ని చర్చించనున్నట్లు సమాచారం. దీంతో ఏకగ్రీవాలు ఉంటాయా? ఉండవా? అనే దానిపై ఇవాళ ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉండనుంది.
ట్రయల్ ప్రతిపాదికన పంచాయితీ ఎన్నికల్లో ‘నోటా’ను నామమాత్రపు అభ్యర్థిగా ఈసీ పెట్టాలనుకుంటోంది. అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడితే.. ఆ స్థానంలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే ఈ పద్ధతిని పలు రాష్ట్రాలు పాటిస్తున్నాయి. తాజా నిర్ణయం అమలైతే.. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన పరిస్థితుల్లో అక్కడ నోటా కూడా ఉంటుంది. అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే.. ఓటర్లు నోటా బటన్ నొక్కొచ్చు. అంతే తప్ప ఏకగ్రీవాలు ఉండకూడదనే అంశంపై ఇవాళ్టి సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో రాజకీయ పార్టీల నుంచి స్పందన ఎలా ఉండనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
సాధారణంగా.. పంచాయితీ ఎన్నికల్లో వార్డుమెంబర్లు, సర్పంచ్ పదవులు చాలా చోట్ల ఏకగ్రీవాలు అవుతుంటాయి. ఇవన్నీ వేలంపాట తరహాలోనే ఉంటున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలోనే.. ఇప్పుడీ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇక.. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల తుదిజాబితా ఖరారుపై ఈసీ ఇవాళ్టి సమావేశంలో చర్చించనుంది. మరోవైపు ఎన్నికల సంఘంతో పాటు ఇటు ప్రభుత్వం కూడా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. న్యాయ పరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది. మరో నాలుగు రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్ చేసే యోచనలో ఉంది ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment