నేటితో తెర
Published Wed, Apr 9 2014 12:29 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
అమలాపురం, న్యూస్‌లైన్ : ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో పరిసమాప్తం కానుంది. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఈనెల 6న తొలి విడత ఎన్నికలు జరగ్గా, రెండో విడత ఎన్నికలు ఈ నెల 11న జరగనున్నాయి. మొదటి విడతలో రాజమండ్రి, కాకినాడ రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. ఇక రెండో విడతలో అమలాపురం, రామచంద్రపురం, రంపచోడవరం డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. 31 జెడ్పీటీసీ, 527 ఎంపీటీసీలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అమలాపురం డివిజన్‌లో 16 జెడ్పీటీసీ, 309 ఎంపీటీసీ, రామచంద్రపురం డివిజన్‌లో 8 జెడ్పీటీసీ, 156 ఎంపీటీసీ, రంపచోడవరం డివిజన్‌లో 7 జెడ్పీటీసీ, 62 ఎంపీటీసీలు వీటిలో ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్నికల ప్రచార గడువు బుధవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు.
రెండోదశ ప్రాదేశిక పోరు హోరాహోరీగా సాగుతోంది. ఎంపీటీసీ అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతుంటే, జెడ్పీటీసీ అభ్యర్థులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బుధవారం పలువురు అభ్యర్థులు మండలవ్యాప్తంగా ర్యాలీల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి విడత ప్రాదేశిక పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత చూపనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో విడతలో కూడా పైచేయి కావాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి పినిపే విశ్వరూప్, సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు గొల్ల బాబూరావు, చిర్ల జగ్గిరెడ్డి, గిరజాల వెంకట స్వామినాయుడు, బొంతు రాజేశ్వరరావు, గుత్తుల సాయి సమన్వయంతో చేస్తున్న ముమ్మర ప్రచారం పార్టీ అభ్యర్థులకు ధీమా కల్పిస్తోంది.
వైఎస్సార్ సీపీ జెడ్పీ అభ్యర్థి జ్యోతుల నవీన్ కూడా ఉప్పలగుప్తం, కాట్రేనికోన, పి.గన్నవరం మండలాల్లో ప్రచారం చేశారు. తొలి విడత అంచనాల నేపథ్యంలో రెండో విడత ఎన్నికలను కీలకంగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఆ పార్టీ ప్రచారం పెద్దగా ప్రభావం చూపకపోవడంతో కొందరు అభ్యర్థుల్లో నైరాశ్యం నెల కొంది. ప్రచారంలో ఇప్పటికే వెనుకబడిన ఆ పార్టీ నాయకులు కొందరు ప్రలోభాలకు తెర లేపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు పోటీ పడుతున్నా వారి ప్రభావం ఎక్కడా కనిపించడంలేదు.
Advertisement
Advertisement