‘పంచాయతీ రాజ్’ ముహూర్తం ఖరారు
సాక్షి, నెల్లూరు: ఎట్టకేలకు పంచాయతీరాజ్ ఎన్నికల నగారా మోగింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ప్రకటించారు. జిల్లాలోని 46 జెడ్పీటీసీలు, 583 ఎంపీటీసీల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 6న జెడ్పీటీసీలతో ఎంపీటీసీలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే నెల 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు పింక్, జెడ్పీటీసీలకు తెల్ల రంగు బ్యాలెట్ పత్రం ఉంటుంది. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న సుప్రీంకోర్టు తీర్పును ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. పంచాయతీరాజ్ ఎన్నికలను వాయిదా వేయాలని కొన్ని పార్టీలు కోరుతున్నాయి. ఈ క్రమంలో 12న వెలువడనున్న సుప్రీంకోర్టు తుదితీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.