సదస్సులో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరాం. చిత్రంలో శాంతాసిన్హా తదితరులు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): విద్య విషయంలో ఇతర అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వెనుకబడి ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక, మదర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యాసామర్థ్యాలు అందించడం ప్రభుత్వ చట్టబద్ధత బాధ్యతగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, విద్యకు తెలంగాణ రాష్ట్రం బడ్జెట్‌లో అత్యంత తక్కువ ఖర్చు చేస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చును విద్యపై పెడితే తెలంగాణలో ఉన్న స్కూల్స్ అన్నీ బాగుపడేవని చెప్పారు. కాంట్రాక్టర్లు కమీషన్లు ఇస్తారు కాబట్టే విద్యపై కాకుండా ప్రాజెక్టులపై ఖర్చు చేశారని విమర్శించారు.
రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని, సరిపడా టీచర్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దిగజారిన విద్యా ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో డ్రాపౌట్లు పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నాణ్యమైన విద్య అందించకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘనగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వినర్ ఆర్.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక కన్వినర్ జి.వేణుగోపాల్, మదర్స్ అసోసియేషన్ కన్వినర్ జి.భాగ్యలక్ష్మి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment