సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ప్రాదేశిక పోరులో భాగంగా తొలి సమరం ఆదివారం జరగనుంది. జిల్లాలోని 24 జెడ్పీటీసీ, 353 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం 24 మండలాల్లో 1,149 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.
బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు అయోమయానికి గురికాకుండా జెడ్పీటీసీకి తెల్లరంగు, ఎంపీటీసీకి గులాబీరంగు బ్యాలెట్ పత్రాలను వాడుతున్నారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో ఇప్పటికే నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 24 జెడ్పీటీసీ స్థానాలకుగాను 129 మంది అభ్యర్థులు, 349 ఎంపీటీసీ స్థానాలకుగాను 1,339 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఎన్నికల్లో మొత్తం 8,85,107 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణలో మొత్తం 5,745 మంది విధులు నిర్వహించనున్నారు. 128 మంది జోనల్, 128 రూట్ ఆఫీసర్లు, 1,149 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 1,149 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 3,447 మంది పోలింగ్ ఆఫీసర్లు ఎన్నికల్లో నిర్వహణలో పాల్గొంటున్నారు.
వీరంతా శనివారం రాత్రి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో సహా చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సరళిని 104 మంది మైక్రో అబ్జర్వర్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. 340 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం వీడియోగ్రఫీ, వెబ్‌లైవ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసింది.
ఎన్నికలు జరగనున్న మండలాలు ఇవే
తొలి విడతగా 24 మండల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. సంగారెడ్డి, కొండాపూర్, కల్హేర్, మనూరు, కంగ్టి, జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్, మునిపల్లి, రాయికోడ్, సదాశివపేట, కొల్చారం, అల్లాదుర్గం, నర్సాపూర్, అందోలు, మెదక్, కొండపాక, జగదేవ్‌పూర్, దుబ్బాక, నంగునూరు, మిరుదొడ్డి, చిన్నకోడూరు, సిద్దిపేట మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రాదేశికపోరులో నేడే తొలి సమరం
Published Sun, Apr 6 2014 1:20 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement