పొన్నాల దారెటు!
- పీసీసీ చీఫ్‌గా ఉంటారా...
- అధిష్టాన పెద్దలు తప్పిస్తారా...
- క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతారా...
- ఘోర పరాజయం నేపథ్యంలో జోరుగా చర్చ
- ప్రశ్నార్థకంగా మారిన లక్ష్మయ్య రాజకీయ భవిష్యత్
కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న పొన్నాల తాజా ఎన్నికల్లో ఏడోసారి పోటీ చేశారు. కాంగ్రెస్ దారుణ పరాజయం నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజకీయ పయనం ఆసక్తికరంగా మారింది. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయూనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తారా... లేక... పార్టీ ఆయనను పదవి నుంచి తప్పిస్తుందా... అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఎన్నికల్లో నేతృత్వం వహించిన పొన్నాల రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ను గెలిపించడంలో విఫలమయ్యారు. చివరకు సొంత నియోజకవర్గం జనగామలో ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు.
కాంగ్రెస్ కేవలం 20 సీట్లతో ఆగిపోయింది. ఘోర పరాజయం నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్యను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయిలో ఫలితాలను విశ్లేషించుకున్న తర్వాత కొంత సమయం తీసుకుని ఆయన విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ అధిష్టానం వేరే నాయకుడిని నియమిస్తే పొన్నాల రాజకీయ పయనం ఎలా ఉంటుందనేది జిల్లాలో ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న పొన్నాల తాజా ఎన్నికల్లో ఏడోసారి పోటీ చేశారు. ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో పొన్నాల మళ్లీ పోటీకి దిగుతారా... క్రీయాశీల రాజకీయాలకు దూరమవుతారా.. వంటి అంశాలపై పీసీసీ చీఫ్ వర్గీయుల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికల ఫలితాల బేరీజు బేసుకుని అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి పొన్నాల రాజకీయ భవిష్యత్ ఉండనుంది.
వ్యతిరేకతతోనే ఓటమి...
పొన్నాల లక్ష్మయ్య మొదటిసారి 1985లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 1989 ఎన్నికల్లో గెలిచారు. 1991లో నేదురుమల్లి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. మళ్లీ 1994లో ఓడిపోయారు. 2004లో గెలిచి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ అనుకూల పవనాల్లోనూ పొన్నాలకు వ్యతిరేకత ఎదురైంది. కేవలం 236 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత మళ్లీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి దక్కింది.
మహానేత వైఎస్సార్ అకాల మరణం తర్వాత ఏర్పాటైన రోశయ్య ప్రభుత్వంలోనూ ఇదే శాఖ చేపట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రాధాన్యం లేని ఐటీ శాఖ చేపట్టారు. కొన్ని నెలలు దేవాదాయ శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 2009 నుంచి ఐదేళ్లలో పొన్నాలపై నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో స్థానికంగా లేకపోవడం, ఐదేళ్లలో నియోజకవర్గంలోని ఎక్కువ గ్రామాల్లో అడుగుపెట్టకపోవడంపై ప్రజలు సహించలేకపోయారు. టీ పీసీసీ అధ్యక్షుడిగా కీలకమైన పదవి చేపట్టి ఎన్నికల్లో పోటీకి దిగినా... స్థానికంగా ఉన్న వ్యతిరేకతతో ఓటమి పాలయ్యారు.