‘బలగం’ ఉన్నా బలహీనమే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:డిప్యూటీ సీఎం... ఇద్దరు మంత్రులు... ప్రభుత్వ విప్... ఒక ఎంపీ... నలుగురు ఎమ్మెల్యేలు... ఇద్దరు ఎమ్మెల్సీలు...ఇక రాములమ్మ చేరికతో అదనపు బలం ... రూ.వేల కోట్ల అభివృద్ధి పనులు .. వీటన్నింటినీ మించి 25 శాతం సంప్రదాయక ఓటింగ్‌తో పటిష్టమైన స్థితిలో ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ...
నడిపించే నాయకుడు లేక మెతుకుసీమలో సతమతమవుతోంది. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ పార్టీ ఆత్మరక్షణ దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు పక్కా ప్రణాళికలో సిద్దిపేట నుంచి దుబ్బాక మీదుగా గజ్వేల్ వరకు చాపకిందనీరులా పాకిన టీఆర్‌ఎస్ తాజాగా దూకుడు పెంచింది.
ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గంపై కర్చీఫ్ వేసి రిజర్వు చేసుకున్న హరీష్‌రావు పక్క నియోజకవర్గాల మీద దృష్టి సారించారు. మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజక వర్గాలపై ఆయన మంత్రాంగం చేస్తున్నారు. ఓ మోస్తరు స్థాయి ఉన్న దిగువ శ్రేణి నాయకుడు అయినా సరే పార్టీలో చేరే అవకాశం ఉందని తెలిస్తే చాలు నేరుగా హరీష్‌రావే ఆయన దగ్గర వాలిపోతున్నారు. వాళ్లను ఒప్పించి, మెప్పించి గులాబి ండువా కప్పేస్తున్నారు.
ఎవరివారే యమునా తీరే
టీఆర్‌ఎస్ నేతలకున్న కలుపుగోలుతనమే కాంగ్రెస్ పార్టీ నేతల్లో పూర్తిగా లోపించింది. దీంతో నాయకులు ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 8 స్థానాల్లో విజయఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నిజానికి తెలంగాణ సీఎం రేసులో ఉన్న రాజనర్సింహ, మాజీ మంత్రి గీతారెడ్డి జిల్లా నేతలను నడిపించాల్సి ఉండగా, వాళ్లు సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.
ఈ ఇద్దరు నేతల నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు బాబూమోహన్, మాణిక్యరావులు గట్టిపోటీ ఇస్తున్నారు. మరోవైపు డీసీసీ పదవి నామమాత్రమే కావడంతో భూపాల్‌రెడ్డి కూడా జిల్లా నేతలను శాసించలేని పరిస్థితి నెలకొంది. పటాన్‌చెరు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన ఆయన, ప్రస్తుతం అభ్యర్థులతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఆర్‌సీపురం మండలంలో భూపాల్‌రెడ్డికి మంచి పట్టుంది. కీలకమైన ఈ సమయంలో తన శక్తియుక్తులన్నీ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం వెచ్చించాల్సి ఉండగా, ఆయన మాత్రం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దీంతో పటాన్‌చెరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్ గెలవడం ఇష్టం లేదనే భూపాల్‌రెడ్డి గుంభనంగా ఉంటున్నారనే సంకేతాలు కార్యకర్తలకు వెళ్లే ప్రమాదం ఉందని, ఇది క్రాస్ ఓటింగ్‌కు దారి తీస్తుందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక మెదక్ నియోజకవర్గంలో రాములమ్మ పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ప్రస్తుతానికి పార్టీ విధేయునిగానే ఉన్నప్పటికీ ఆయన రాములమ్మకు ఎంత మేరకు ఓట్లు వేయిస్తాడనేది అనుమానమే.
మరోవైపు సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ర్టం వచ్చిందనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకోలేకపోతున్నారు. పార్టీనేతలను ఏకతాటిపైకి తెచ్చే పెద్ద దిక్కులేక విలవిలలాడుతున్న కాంగ్రెస్ నాయకులు సోనియా, రాహుల్‌గాంధీ సభల మీదే గంపెడాశలు పెట్టుకున్నారు. అందువల్లే వీలైనన్ని ఎక్కువ ప్రచార సభలు జిల్లాలో నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు.