సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. జెడ్పీ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంది. దీనితో పాటు 27 ఎంపీపీ స్థానాలను చేజిక్కించుకుంది. గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో క్లీన్ స్వీప్ చేసి తమకు ఎదురులేదని నిరూపించింది. ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఎంపీటీసీ స్థానాలను అధిక సంఖ్యలో గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జెడ్పీటీసీ స్థానాల్లో కూడా తన ఆధిక్యతను నిరూపించుకుంది.
జిల్లాలోని 56 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరగ్గా, 32 స్థానాలను వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ 24 స్థానాలతో సరిపెట్టుకుంది.
గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క కంభం మినహా అన్ని మండలాల్లో భారీ మెజార్టీ సాధించింది.
అన్ని నియోజకవర్గాల్లోను వైఎస్సార్ సీపీ విజయం సాధించడంతో జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు డీలా పడ్డారు.
మునిసిపల్ ఫలితాల్లో విజయం సాధించినట్లు చెప్పుకుని సంతోషపడిన వారికి, ఆ సంతోషం 24 గంటలు కూడా నిలువలేదు. సగానికి పైగా జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించడంతోపాటు, రాష్ట్రంలోనే తొలి సారిగా జెడ్పీ చైర్మన్ పదవిని కూడా చేజిక్కించుకుని, తొలి బోణీ కొట్టింది.
దీంతోపాటు 27 ఎంపీపీలను కూడా సాధించుకోగా, టీడీపీ 19 ఎంపీపీలతో సరిపెట్టుకుంది. మరో పది స్థానాల్లో హంగ్ ఏర్పడింది.
ఒంగోలు నియోజకవర్గంలోని రెండు జెడ్పీటీసీలలో వైఎస్సార్ సీపీ, టీడీపీ చెరొకటి పంచుకున్నాయి.
కనిగిరి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఐదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా, తెలుగు దేశం ఒక స్థానాన్ని దక్కించుకుంది.
అద్దంకి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా, ఒక్క స్థానాన్ని టీడీపీ పొందింది.
యర్రగొండపాలెంలోని ఐదు మండలాల్లో వైఎస్సార్ సీపీ విజయ పతాకం ఎగురవేసింది.
మార్కాపురంలోని నాలుగు మండలాలను వైఎస్సార్ సీపీ తన ఖాతాలోనే వేసుకుంది.
టీడీపీకి కంచుకోటగా ఉన్న పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు నాలుగు మండలాల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించింది.
దాదాపు అన్ని మండలాల్లోను తన ప్రాబల్యం ఉందని వైఎస్సార్ సీపీ నిరూపించుకుంది.
ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పుల్లల చెరువు జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై న డాక్టర్ నూ కసాని బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్ సీపీ విజయ కేతనం ఎగురవేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
తమ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపించిందని తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూడా నియోజకవర్గాల పరంగా ఇంతకంటే ఎక్కువ స్థానాలను పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జెడ్పీ పీఠం కైవసం
Published Wed, May 14 2014 3:40 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement