ప్రారంభమైన బిహార్ నాలుగో దశ పోలింగ్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. పోలింగ్ జరగనున్న ఏడు జిల్లాల్లో ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచే ప్రజలు ఓటేసేందుకు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
ముజఫర్పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సీతామర్హి, షియోహర్, గోపాల్గంజ్ జిల్లాల్లోని మొత్తం 55 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన 776 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. భద్రత కారణాల దృష్ట్యా 4 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ నిలిపివేయనున్నారు. మరో 8 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా 43 నియోజవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 1,46,93,294 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 14, 139 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నవంబర్ 5న ఐదో దశ పోలింగ్ జరగనుంది.