Lok Sabha polls 2024: బీజేపీ వైపు... నితీశ్‌ చూపు! | Lok Sabha polls 2024: Nitish Kumar likely to be back with BJP | Sakshi
Sakshi News home page

Lok Sabha polls 2024: బీజేపీ వైపు... నితీశ్‌ చూపు!

Published Fri, Jan 26 2024 5:30 AM | Last Updated on Fri, Jan 26 2024 5:30 AM

Lok Sabha polls 2024: Nitish Kumar likely to be back with BJP - Sakshi

పట్నా/న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి రెండు రోజుల్లోనే మూడో భారీ ఎదురుదెబ్బ! కీలక భాగస్వామి అయిన జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ కూటమికి కటీఫ్‌ చెప్పేలా కని్పస్తున్నారు. అవసరార్థపు గోడ దూకుళ్లకు పెట్టింది పేరైన ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట యూ టర్న్‌ తీసుకుని మళ్లీ బీజేపీతో జట్టు కట్టే దిశగా సాగుతున్నారు.

ఈ దిశగా బుధవారం నుంచీ జరుగుతున్న వరుస పరిణామాలతో బిహార్లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్, వామపక్షాల మహాఘట్‌బంధన్‌ సంకీర్ణ సర్కారు కూడా కుప్పకూలేలా కన్పిస్తోంది. ఘట్‌బంధన్‌తో 18 నెలల కలహాల కాపురానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం కాపాడుకునే ప్రయత్నాలకు నితీశ్‌ పదును పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రతిగా ఆర్జేడీ కూడా జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా మెజారిటీ సాధనకు ప్రయత్నాలకు పదును పెట్టింది. ఈ దిశగా జేడీ(యూ) సీనియర్‌ నేతలతో నితీశ్‌ ఇంట్లో, ఘట్‌బంధన్‌లోని ఇతర పక్షాలతో ఆర్జేడీ చీఫ్‌ లాలుప్రసాద్‌ నివాసంలో పోటాపోటీ సమావేశాలతో గురువారం బిహార్‌ రాజధాని పట్నాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

నితీశ్‌ నివాసంలో భేటీలో జేడీ(యూ) ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. ఇక లాలు ఒకవైపు తన నివాసంలో భేటీ జరుగుండగానే మరోవైపు ఆర్జేడీకే చెందిన అసెంబ్లీ స్పీకర్‌ అవధ్‌ బిహారీ చౌధరితో కూడా ఫోన్లో మంతనాలు జరిపారు. దాంతో నితీశ్‌ మరింత అప్రమత్తయ్యారు. ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకు చాన్సివ్వకుండా అవసరమైతే అసెంబ్లీని రద్దు చేయాలని కూడా ఆయన యోచిస్తున్నట్టు చెబుతున్నారు!

లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని, ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్‌లో ఆప్‌దీ ఒంటరి పోరేనని ఆ రాష్ట్ర సీఎం భగవంత్‌ మాన్‌ బుధవారం ప్రకటించడం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా డీలా పడ్డ ఇండియా కూటమిలో బిహార్‌ తాజా పరిణామాలు మరింత కలవరం రేపుతున్నాయి. నితీశ్‌ బీజేపీ గూటికి చేరితే విపక్ష కూటమి దాదాపుగా విచి్ఛన్నమైనట్టేనని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రకు రెండు రోజుల విరామమిచ్చి ఢిల్లీ చేరిన కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఈ పరిణామాలన్నింటిపై పార్టీ నేతలతో మంతనాల్లో మునిగిపోయారు. మరోవైపు బిహార్‌ బీజేపీ చీఫ్‌ సమర్థ్‌ చౌదరి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అశ్వినీ చౌబేతో పాటు జేడీ(యూ) రాజకీయ సలహాదారు కేసీ త్యాగి కూడా ఒకే విమానంలో హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. దాంతో హస్తినలోనూ రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది.

ఆదినుంచీ కలహాల కాపురమే...
బిహార్లో 2020లో ఏర్పాటైన మహాఘట్‌బంధన్‌ సంకీర్ణ సర్కారు నిత్యం కలహాలమయంగానే సాగుతూ వస్తోంది. ముఖ్యంగా తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలని లాలు కొంతకాలంగా పట్టుబడుతుండటంపై నితీశ్‌ గుర్రుగా ఉన్నారు. జేడీ(యూ) తాజా మాజీ అధ్యక్షుడు లలన్‌ సింగ్‌ సాయంతో ఆ పార్టీ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసేందుకు లాలు ఇటీవల గట్టి ప్రయత్నమే చేశారు. దాన్ని సకాలంలో పసిగట్టిన నితీశ్‌ లలన్‌కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు.

ఈ ఉదంతంతో ఆర్జేడీతో విభేదాలు తారస్థాయికి చేరాయి. లాలు, నితీశ్‌లిద్దరికీ రాజకీయ గురువైన బిహార్‌ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌ శత జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం నితీశ్‌ చేసిన వ్యాఖ్యలు విభేదాలకు మరింతగా ఆజ్యం పోశాయి. పారీ్టల్లో కుటుంబాల పెత్తనాన్ని కర్పూరి తీవ్రంగా వ్యతిరేకించేశారన్న నితీశ్‌ వ్యాఖ్యలు ఆర్జేడీని ఉద్దేశించినవేనంటూ లాలు కుటుంబం మండిపడింది.

నితీశ్‌ అవకాశవాది అని తూర్పారబడుతూ లాలు కుమార్తె రోహిణీ ఆచార్య ఎక్స్‌లో పెట్టిన పోస్టులతో పరిస్థితి రసకందాయంలో పడింది. నితీశ్‌పై ఆమె విమర్శలను రాష్ట్ర బీజేపీ అగ్ర నేతలు తీవ్రంగా ఖండించడం, ఆ వెంటనే ఆ పారీ్టతో జేడీ(యూ) దోస్తీ అంటూ వార్తలు రావడం... నితీశ్, లాలు నివాసాల్లో పోటాపోటీ సమావేశాల తదితర పరిణామా లు వెంటవెంటనే జరిగిపోయాయి.

గిరిరాజ్‌ చెణుకులు
పదేపదే ఆర్జేడీపై అలగడం నితీశ్‌కు పరిపాటేనంటూ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నేత గిరిరాజ్‌సింగ్‌ విసిరిన చెణుకులు గురువారం వైరల్‌గా మారాయి. ‘‘నే పుట్టింటికి వెళ్లిపోతా. నువ్వు చూస్తూ ఉండిపోతావ్‌ అని పాడుతూ లాలును నితీశ్‌ చీటికీమాటికీ బెదిరిస్తుంటారు. కానీ పుట్టింటి (బీజేపీ) తలుపులు తనకు శాశ్వతంగా మూసుకుపోయాయన్న వాస్తవాన్ని మాత్రం దాస్తుంటారు’’ అంటూ తాజా పరిణామాలపై గిరిరాజ్‌ స్పందించారు.

గోడదూకుళ్లలో ఘనాపాఠి
రాజకీయ గాలికి స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా మంచినీళ్ల ప్రాయంగా కూటములను మార్చడంలో నితీశ్‌కుమార్‌ సిద్ధహస్తుడు. దాంతో ఆయన్ను పల్టూ (పిల్లిమొగ్గల) కుమార్‌గా పిలవడం పరిపాటిగా మారింది. బీజేపీ వాజ్‌పేయీ, అడ్వాణీల సారథ్యంలో సాగినంత కాలం ఆ పారీ్టతో నితీశ్‌ బంధం అవిచి్ఛన్నంగా సాగింది. వారి శకం ముగిసి నరేంద్ర మోదీ తెరపైకి రావడంతో పొరపొచ్ఛాలు మొదలయ్యాయి.

ఆయన్ను ప్రధాని అభ్యరి్థగా ప్రకటించడంతో బీజేపీతో 17 ఏళ్ల బంధానికి 2013లో తొలిసారిగా గుడ్‌బై చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత బిహార్‌ సీఎంగా తప్పుకుని జితిన్‌రాం మాంఝీని గద్దెనెక్కించారు. తన బద్ధ విరోధి అయిన లాలు సారథ్యంలోని ఆర్జేడీతో పొత్తు ద్వారా సర్కారును కాపాడుకున్నారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాఘట్‌బంధన్‌గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు.

కానీ సంఖ్యాబలంలో ఆర్జేడీ పెద్ద పారీ్టగా అవతరించడంతో నితీశ్‌ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. లాలు కుమారుడు తేజస్విని అయిష్టంగానే డిప్యూటీ సీఎం చేయాల్సి వచి్చంది. రెండేళ్లలోపే కూటమిలో పొరపొచ్ఛాలు పెద్దవయ్యాయి. సరిగ్గా అదే సమయంలో లాలు, తేజస్విలపై సీబీఐ కేసులు నితీశ్‌కు అందివచ్చాయి. డిప్యూటీ సీఎం పోస్టుకు రాజీనామా చేసేందుకు తేజస్వి ససేమిరా అనడంతో తానే సీఎం పదవికి రాజీనామా చేసి 2017లో కూటమి సర్కారును కుప్పకూల్చారు.

గంటల వ్యవధిలోనే బీజేపీ మద్దతుతో మళ్లీ గద్దెనెక్కి ఔరా అనిపించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంతో నితీశ్‌ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఈసారి బీజేపీ పెద్ద పారీ్టగా అవతరించడంతో ఏ విషయంలోనూ తన మాట సాగక ఉక్కపోతకు గురయ్యారు. చివరికి జేడీ(యూ)ను చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022 ఆగస్టులో దానికి గుడ్‌బై చెప్పారు. మర్నాడే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాఘట్‌బంధన్‌ సర్కారు ఏర్పాటు చేసి సీఎం పీఠం కాపాడుకున్నారు. తాజాగా నితీశ్‌ మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు నిజమైతే ఇది ఆయనకు ఐదో పిల్లిమొగ్గ అవుతుంది!  

తెరపైకి మెజారిటీ లెక్కలు...
నితీశ్‌ బీజేపీ గూటికి చేరతారన్న వార్తల నేపథ్యంలో బిహార్‌ అసెంబ్లీలో బలాబలాలు మరోసారి తెరపైకొచ్చాయి. 243 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 122. మహాఘట్‌బంధన్‌ ప్రస్తుత బలం 159. 45 మంది ఎమ్మెల్యేలున్న జేడీ(యూ) ని్రష్కమిస్తే ఆర్జేడీ (79), కాంగ్రెస్‌ (19), వామపక్షాల (16)తో కూటమి బలం 114కు పడిపోతుంది. అప్పుడు మెజారిటీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు.

జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హెచ్‌ఏఎం (4), మజ్లిస్‌ (1), స్వతంత్ర ఎమ్మెల్యే (1) మద్దతు కూడగట్టినా 120కే చేరుతుంది. మెజారిటీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి. ఈ నేపథ్యంలో మాంఝీ తదితరులతో పాటు జేడీ(యూ) అసంతృప్త ఎమ్మెల్యేలతో కూడా ఆర్జేడీ చీఫ్‌ లాలు జోరుగా మంతనాలు జరుపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆర్జేడీకి చెందిన స్పీకర్‌ పాత్ర కూడా కీలకంగా మారేలా కన్పిస్తోంది. మరోవైపు బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కును అలవోకగా దాటేస్తాయి. తద్వారా తానే సీఎంగా కొనసాగాలని నితీశ్‌ భావిస్తున్నట్టు సమాచారం. కానీ అందుకు బీజేపీ సుముఖంగా లేదని, తమకే సీఎం చాన్సివ్వాలని భావిస్తోందని చెబుతున్నారు. అందుకు నితీశ్‌ అంగీకరించే పక్షంలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement