
భూకబ్జాపై సీఎం ఆశ్చర్యం
పట్నా: ఉత్తరప్రదేశ్ లోని మథురలో జరిగిన భూకబ్జాపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భూమిని కబ్జా చేయడమే కాకుండా సమాంతర పాలన సాగించడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఈ వ్యవహారంపై ముందే మేలుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రారంభంలోనే చర్యలు తీసుకునివుంటే పరిస్థతి ఇంతదాకా వచ్చేదికాదన్నారు. మథురలోని జవహర్‌బాగ్ లో గురువారం అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా జరిగిన హింసాకాండలో 24 మంది చనిపోయారు.
బిహార్ ఎడ్యుకేషన్ బోర్డు(బిఎస్ఈబీ) వ్యవహారాన్ని తాను పర్యవేక్షిస్తున్నానని, రాష్ట్ర విద్యాశాఖ కూడా దర్యాప్తు చేపట్టిందని నితీశ్ కుమార్ తెలిపారు. బాధ్యులపై చర్యలు తప్పవని, ఎవరినీ ఉపేక్షించబోమని ఆయన చెప్పారు. బీఎస్ఈబీ నిర్వహించిన పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన 14 మందికి తాము రాసిన సబ్జెక్టుల గురించి కూడా ఏమాత్రం తెలియదని వెల్లడికావడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దీంతో వీరికి మళ్లీ పరీక్ష నిర్వహించారు.