అవినీతితో నీతి బిగి కౌగిలి...
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం నెటిజెన్లకు కూడా ముచ్చటేసింది. అయితే అవినీతి కేసులో ఇప్పటికే దోషిగా తేలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అర్హత కోల్పోయిన లాలూ ప్రసాద్ యాదవ్ వేదికపై చేసిన హంగామా నచ్చలేదు. అవినీతిని కూకటి వేళ్లతో సహా నిర్మూలిస్తామని శపథం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాలూను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం అంతకన్నా నచ్చలేదు. దీనిపై సోషల్ వెబ్‌సైట్లలో, ముఖ్యంగా ట్విట్టర్‌లో ఎవరికి వారు తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. వ్యంగ్యోక్తులు విసిరారు.
‘అవినీతిని నీతి కౌగిలించుకున్న వేళ....లాలూను కేజ్రీవాల్ కౌగలించుకున్నారు. ఇక దేశం అవినీతి అనేది సమస్సే కాదు...అవకాశవాదానికి హద్దులు లేవు....అత్మవంచనకు పరాకాష్ట....కేజ్రివాల్ మెదడుకు ఇన్‌ఫెక్షన్ సోకినా ఆప్ కార్యకర్తలు ఇప్పటికీ ఆయన్ని ప్రేమిస్తారు....దాణా కేసులో కోట్లు కూడబెట్టి పాతిక లక్షల ఫైన్, కొన్నేళ్లు జైలు శిక్షతో సరిపెట్టుకున్న లాలూ ఇది మంచి డీల్....అవినీతి భరితమైన వ్యవస్థ దానంతట అదే ప్రక్షాళన అవుతుంది. కాకపోతే మనం కోరుకున్నట్టు కాదు....ఇదేమి వైచిత్రి, భారత రాజకీయాలే అంత...’ సోషల్ వెబ్‌సైట్లలో విమర్శల వర్షం కురిసింది.