
పశువుల దాణా కూడా దోచుకున్నారు
భాగల్పూర్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం
పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేసిన మోదీ
భాగల్పూర్: బిహార్‌లో విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తోపాటు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆర్జేడీ పాలనలో బిహార్‌లో ఆటవిక రాజ్యం నడిచిందని, పశువుల దాణాను కూడా వదిలిపెట్టకుండా దోచుకున్నారని ధ్వజమెత్తారు. బిహార్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రధాని మోదీ సోమవారం బిహార్‌లోని భాగల్పూర్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. ‘ప్రధానమంత్రి–కిసాన్ సమ్మాన్ నిధి’19వ విడత సొమ్మును విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.22,000 కోట్లకుపైగా సొమ్ము జమచేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. తొలుత ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా సభావేదికవద్దకు చేరుకున్నారు. సభలో దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడారు. ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్‌ల పేర్లు నేరుగా ప్రస్తావించకుండానే ఆరోపణలు గుప్పించారు.
జంగిల్‌రాజ్‌వాలా మన విశ్వాసాలను కించపరుస్తున్నారని, సమాజంలో విద్వేషాలు సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. భారతదేశ అతిపెద్ద ఐక్యతా వేడుక అయిన మహాకుంభమేళాను సైతం దూషిస్తుండడం దారుణమని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సైతం జంగిల్‌రాజ్‌వాలా వ్యతిరేకించారని విమర్శించారు. అలాంటి వారిని బిహార్ ప్రజలు క్షమించరని తేల్చిచెప్పారు. బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ పాలనలో విధ్వంసమే జరిగింది తప్ప అభివృద్ధి మచ్చుకైనా లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాతే అభివృద్ధి వేగం పుంజుకుందని వివరించారు.
శరవేగంగా వ్యవసాయ రంగ వృద్ధి
తమ ప్రభుత్వం గత పదేళ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న చర్యలతో దేశంలో వ్యవసాయ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. పీఎం–కిసాన్ సమ్మన్ నిధి కింద ఇప్పటిదాకా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.3.5 లక్షల కోట్లు జమ చేశామని వివరించారు. ఈ పథకం అమల్లోకి వచ్చి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రభుత్వ కృషితో అన్నదాతల గౌరవ ప్రతిష్టలు పెరిగాయని, వారికి నూతన శక్తి లభించిందని పేర్కొ న్నారు. కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయంతో కోట్లాది మంది రైతన్నలు లబ్ధి పొందుతున్నారని, వారికి మార్కెట్ సదుపాయం మరింతగా అందుబాటులోకి వస్తోందని, తద్వారా ఆదాయం పెరుగుతోందని మోదీ ఉద్ఘాటించారు. మన అన్నదాతలను చూసి ప్రభుత్వం గరి్వస్తోందని వ్యాఖ్యానించారు. వారి జీవితాలను మరింత మెరుగుపర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
మఖానా సూపర్ ఫుడ్
మన దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని, దాంతో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బిహార్‌లో సాగవుతున్న మఖానాకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు. మఖానా సూపర్ ఫుడ్ అని చెప్పాను. తాను మఖానాను విరివిగా స్వీకరిస్తున్నానని తెలిపారు. సంవత్సరంలో కనీసం 300 రోజులు మఖానా తింటుంటానని అన్నారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించామని గుర్తుచేశారు. భాగల్పూర్ సభలో మఖానాలతో రూపొందించిన దండను అభిమానులు మోదీకి బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment