Rashtriya Janata Dal
-
ఆర్జేడీ పాలనలో జంగిల్‌రాజ్
భాగల్పూర్: బిహార్‌లో విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తోపాటు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆర్జేడీ పాలనలో బిహార్‌లో ఆటవిక రాజ్యం నడిచిందని, పశువుల దాణాను కూడా వదిలిపెట్టకుండా దోచుకున్నారని ధ్వజమెత్తారు. బిహార్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రధాని మోదీ సోమవారం బిహార్‌లోని భాగల్పూర్లో పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. ‘ప్రధానమంత్రి–కిసాన్ సమ్మాన్ నిధి’19వ విడత సొమ్మును విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.22,000 కోట్లకుపైగా సొమ్ము జమచేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. తొలుత ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా సభావేదికవద్దకు చేరుకున్నారు. సభలో దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడారు. ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్‌ల పేర్లు నేరుగా ప్రస్తావించకుండానే ఆరోపణలు గుప్పించారు. జంగిల్‌రాజ్‌వాలా మన విశ్వాసాలను కించపరుస్తున్నారని, సమాజంలో విద్వేషాలు సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. భారతదేశ అతిపెద్ద ఐక్యతా వేడుక అయిన మహాకుంభమేళాను సైతం దూషిస్తుండడం దారుణమని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సైతం జంగిల్‌రాజ్‌వాలా వ్యతిరేకించారని విమర్శించారు. అలాంటి వారిని బిహార్ ప్రజలు క్షమించరని తేల్చిచెప్పారు. బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ పాలనలో విధ్వంసమే జరిగింది తప్ప అభివృద్ధి మచ్చుకైనా లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాతే అభివృద్ధి వేగం పుంజుకుందని వివరించారు. శరవేగంగా వ్యవసాయ రంగ వృద్ధి తమ ప్రభుత్వం గత పదేళ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న చర్యలతో దేశంలో వ్యవసాయ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. పీఎం–కిసాన్ సమ్మన్ నిధి కింద ఇప్పటిదాకా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.3.5 లక్షల కోట్లు జమ చేశామని వివరించారు. ఈ పథకం అమల్లోకి వచ్చి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రభుత్వ కృషితో అన్నదాతల గౌరవ ప్రతిష్టలు పెరిగాయని, వారికి నూతన శక్తి లభించిందని పేర్కొ న్నారు. కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయంతో కోట్లాది మంది రైతన్నలు లబ్ధి పొందుతున్నారని, వారికి మార్కెట్ సదుపాయం మరింతగా అందుబాటులోకి వస్తోందని, తద్వారా ఆదాయం పెరుగుతోందని మోదీ ఉద్ఘాటించారు. మన అన్నదాతలను చూసి ప్రభుత్వం గరి్వస్తోందని వ్యాఖ్యానించారు. వారి జీవితాలను మరింత మెరుగుపర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. మఖానా సూపర్ ఫుడ్ మన దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని, దాంతో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బిహార్‌లో సాగవుతున్న మఖానాకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు. మఖానా సూపర్ ఫుడ్ అని చెప్పాను. తాను మఖానాను విరివిగా స్వీకరిస్తున్నానని తెలిపారు. సంవత్సరంలో కనీసం 300 రోజులు మఖానా తింటుంటానని అన్నారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించామని గుర్తుచేశారు. భాగల్పూర్ సభలో మఖానాలతో రూపొందించిన దండను అభిమానులు మోదీకి బహూకరించారు. -
అసెంబ్లీ ఎన్నికలు : ఆర్జేడీకి భారీ షాక్
పట్నా : అసెంబ్లీ ఎన్నికల ముందు బిహార్‌లో ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ రాజీనామా చేశారు. గురువారం ఆయన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు పంపారు. అయితే రాజీనామాకు మాత్రం సరైన కారణాలు వెల్లడించలేదు. ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్‌తో ఆయనకు ఉన్న విభేదాల కారణంగానే పార్టీ నుంచి వైదొలిగనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం ఉంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు సీనియర్ నేత రాజీనామా ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రఘువంశ్ ప్రసాద్ గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్జేడీలో లాలూ ప్రసాద్ యాదవ్ తరువాత అత్యంత సీనియర్ నేతగా, పార్టీ ఉపాధ్యక్షుడిగా గుర్తింపుపొందారు. కాగా ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. (దేశంలో మరో ఎన్నికల సమరం) -
జీవితకాల నిషేధమే సరైన శిక్ష
రాంచి: రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులపై ఎన్నిల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రకమైన నిర్ణయం తీసుకుంటే అందరూ హర్షిస్తారని.. ఇది నిష్పాక్షికంగా ఉంటుందని ఆయన చెప్పారు. శిక్ష ఖరారైన ప్రజాప్రతినిధులను ఎన్నికల్లో పాల్గొనకుండా జీవిత కాల నిషేధాన్ని విధించాలని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును కోరిన గంటల వ్యవధిలోనే లాలూ ప్రసాద్ యాదవ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ సభ్యులు, శాసనభ్యులపై నమోదైన కేసులను త్వరతగతిన విచారించేందుకు ప్రత్యేక, ఫాస్ట్ ట్రాక్ కోర్టులును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు.. కేంద్రప్రభుత్వాన్ని కోరింది. శిక్ష పడిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధాన్ని విధించే అంశంపై న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘంను సంప్రదించి సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
లాలూజీ మాటలకు అర్థాలే వేరులే..!
పట్నా: గంగానది వరద తాకిడికి బిహార్ అతలాకుతలమైంది. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. కొన్ని జిల్లాల్లో ఇళ్లు నీటమునిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. వరద పరిస్థితిని చూసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చలించిపోయారు. అయితే మిత్రపక్షమైన ఆర్జేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ తన కొడుకు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌తో కలసి వరద ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లినపుడు చేసిన వ్యాఖ్యలు వరద బాధితులను ఆయోమయానికి గురిచేశాయి. గంగ మీ ఇళ్లకు రావడం అదృష్టమంటూ వరద బాధితులను ఉద్దేశించి లాలు వ్యాఖ్యానించారు. 'చాలా సందర్భాల్లో మీరే గంగానది దగ్గరకు వెళ్తారు. అలాంటిది గంగ మీ ఇళ్లకు రావడం మీ అదృష్టం. ఇది ఎప్పుడో కానీ జరగదు' అంటూ తన స్టయిల్లో లాలు అన్నారు. లాలు అంతటితో వదిలిపెట్టకుంగా గంగా నది స్వచ్ఛత గురించి సెలవిచ్చారు. 'పవిత్రమైన గంగా జలం ఈ రోజుల్లో ఎక్కడు దొరుకుతోంది? గత దశాబ్దంకాలంగా గంగ మన నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఇన్నాళ్లకు మళ్లీ మనదగ్గరకు వచ్చింది' అని చెప్పారు. పోస్టు ద్వారా గంగజలాన్ని ఇంటికి పంపే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడాన్ని దృష్టిలో ఉంచుకుని లాలు ఇలా వ్యాఖ్యానించారేమో కానీ.. ఆయన మాటలకు మీడియా ప్రతినిధులు, వరద బాధితులు అవాక్కయ్యారు. 1975 వచ్చిన వరదల కంటే ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వరద బాధితులను ఆదుకుంటామని లాలు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నితీష్‌తో మాట్లాడి పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని చెప్పారు. అలాగే బోట్లు కొట్టుకుపోయిన మత్స్య కారులను ఆదుకుంటామని చెప్పారు. -
మరో వారసురాలు వచ్చేసింది..
పట్నా: బిహార్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. లాలు కుటుంబం నుంచి రాజకీయవారసులుగా వచ్చినట్టుగా, చట్టసభ ప్రతినిధులుగా ఎన్నికైనట్టుగా ఆ రాష్ట్రం నుంచి మరే కుటుంబం నుంచి రాలేదు. లాలు ప్రసాద్ దాదాపు ఎనిమిదేళ్లు బిహార్ సీఎంగా ఉన్నారు. దాణా కుంభకోణంలో ఆయనపై ఆరోపణలు రావడంతో భార్య రబ్రీదేవిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఆ తర్వాత లాలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయ్యారు. మధ్యలో కొన్నాళ్లు అధికారానికి దూరమైనా.. గతేడాది జరిగిన బిహార్ ఎన్నికల్లో జేడీయూతో పొత్తుపెట్టుకుని మళ్లీ పూర్వవైభవం సాధించారు. లాలు ఈసారి వారసులను తెరపైకి తెచ్చారు. లాలు పుత్రరత్నాల్లో తేజస్వి యాదవ్ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాగా, తేజ్ ప్రతాప్ యాదవ్ రాష్ట్ర మంత్రి అయిన సంగతి తెలిసిందే. తాజాగా లాలు కుటుంబం నుంచి మరో వారసురాలు చట్టసభకు ఎన్నికయ్యారు. లాలు పెద్ద కూతురు మీసా భారతి ఆర్జేడీ తరపున రాజ్యసభ సభ్యురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె ఇంతకుమందే రాజకీయాల్లో అరంగేట్రం చేసినా 2014 లోక్‌సభ ఎన్నికల్లో నిరాశ ఎదురైంది. పాటలీపుత్ర నియోజవర్గం నుంచి పోటీచేసిన భారతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో ఆమె లోక్‌సభ మెట్లు ఎక్కలేకపోయారు. లాలు ఇప్పుడు తన ముద్దుల తనయను రాజ్యసభకు పంపి ఆమె ముచ్చట తీర్చారు. రాజ్యసభ టికెట్ రేసులో స్వయంగా లాలు భార్య రబ్రీదేవి పోటీకి వచ్చినా.. ఆయన కూతురుకే ఓటేశారు. ఈ విషయంలో తేజ్ ప్రతాప్, తేజస్విలు సోదరికే మద్దతుగా నిలిచారు. ఏమైతేనేం లాలు కుటుంబం నుంచి మరొకరు చట్టసభ సభ్యులయ్యారు. మీసా భారతికి 1999లో వివాహమైంది. ఆమె భర్త పేరు శైలేష్ కుమార్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. లాలు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఇప్పుడు కుమార్తె, వీరితో పాటు బావమరుదులు.. రాజకీయాల్లో లాలూ ఫ్యామిలీయా మాజాకానా..! -
లాలూ ఫేస్ బుక్ హ్యాక్.. యువకుడు అరెస్ట్
ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేసిన వ్యక్తిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ అకౌంట్‌ని హ్యాక్ చేయడానికి ఉపయోగించిన 2 ఫోన్లను నిందితుని నుంచి స్వాధీనం చేసుకున్నారు. వైశాలిలోని మెహ్మదాబాద్ గ్రామానికి చెందిన దివ్యాన్షు కుమార్ అలియాస్ గోలు లాలూ ఫేస్ బుక్ అకౌంట్‌ని హ్యాక్ చేశాడని పోలీసులు తెలిపారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లపై అవగాహన ఉన్న దివ్యాన్షుకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉందని పోలీసులు పేర్కొన్నారు. మార్చి 8, 11న లాలూ ఫేస్ బుక్ అకౌంట్‌ని హ్యాక్ చేసిన దివ్యాన్షు, అనుచితమైన కమెంట్లను పోస్ట్ చేశాడు. వీటిని గమనించిన లాలూ కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ వెంటనే ఆ కామెంట్లను తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
'ఆయనకు సూపర్ సీఎం హోదా ఇవ్వండి'
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ఓ కార్యక్రమంలో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. పట్నాలో జరిగిన హోమియోపతి సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు లాలు కొడుకు, బిహార్ ఆరోగ్య మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆహ్వానించగా, అతనికి బదులుగా లాలు ప్రత్యక్షమయ్యారు. తద్వారా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీజేపీ లక్ష్యంగా చేసుకునేందుకు లాలు ఆస్కారమిచ్చారు. ఈ చర్య ద్వారా ఆరోగ్య శాఖను, బిహార్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో తెలుస్తోందని బీజేపీ నేత, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి నంద్ కిశోర్ యాదవ్ ఆరోపణలు సంధించారు. నితీశ్.. లాలుకు అధికారికంగా 'సూపర్ చీఫ్ మినిస్టర్' హోదా ఇవ్వాలని వ్యాఖ్యానించారు. బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను లాలు తరచూ తనిఖీలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి చేయాల్సిన విధులను లాలు చేపట్టడంపై ప్రతిపక్షలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. లాలు ఎమ్మెల్యే లేదా ఎంపీ కూడా కాదని, దాణా కుంభకోణం కేసులో బెయిల్‌పై ఉన్నారని, ఏ హోదాతో అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ప్రశ్నించారు. బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాకూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. నితీశ్ కేబినెట్లో లాలు ఇద్దరు కుమారులకు బెర్తులు దక్కాయి. -
కుటుంబానికి న్యాయం చేయడంలో లాలూ మహాదిట్ట
కుటుంబానికి న్యాయం చేయడంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మహా దిట్ట అని ఆ పార్టీ నుంచి ఇటీవలే బయటకు వచ్చిన రాం కృపాల్ యాదవ్ ఆరోపించారు. కుమార్తె మీసా భారతికి పాటలీపుత్ర లోక్‌సభ స్థానాన్ని కేటాయించి మరోసారి రుజువు చేసుకున్నారన్నారు. బుధవారం న్యూఢిల్లీలో రాం కృపాల్ యాదవ్ బీజేపీ చేరారు. అనంతరం అనంతరం కృపాల్ యాదవ్ మాట్లాడుతూ... దాదాపు మూడు శతాబ్దాలుగా తాను, లాలూ స్నేహం కొనసాగిందన్నారు. అయితే తాను ఆశించిన పాటలీపుత్ర లోక్‌సభ స్థానాన్ని తన కుమార్తె మీసా భారతికి కేటాయించడం పట్ల తీవ్ర ఆవేదన చెందానన్నారు. పార్టీలో తన పరిస్థితే ఈ విధంగా ఉంటే సామాన్య కార్యకర్త పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఆందోళనగా ఉందన్నారు. అంతకుముందు కృపాల్ యాదవ్‌ను బీజేపీలోకి ఆ పార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా కృపాల్ యాదవ్ మాట్లాడుతూ... గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని దేశ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. కృపాల్ యాదవ్ బీజేపీలో చేరడంతో న్యూఢీల్లోని బీజేపీ కేంద్ర కార్యాలయం సందడిగా మరింది. తన కుమార్తె మీసా భారతికి పాటలీపుత్ర లోక్‌సభ స్థానాన్ని కేటాయిస్తున్నట్లు గత వారం లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఆ ప్రకటనపై రాం కృపాల్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆర్జేడీని విడుతున్నట్లు ప్రకటించారు. దాంతో గత వారం లాలూ కుమార్తె మీసా భారతి కృపాల్ యాదవ్‌ను కలిసే చర్చించేందుకు శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లింది. అయితే ఆ సమయంలో కృపాల్ యాదవ్ ఇంట్లో అందుబాటులో లేకుండా పోయారు. అనంతరం మీసా మీడియాతో మాట్లాడుతూ... తానకు కృపాల్ యాదవ్ మావయ్యతో సమానమన్నారు. మామయ్యకు, మేనకోడలికి మధ్య యుద్దం ఉండదని మీసా ఈ సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. -
లాలూ ఎంపీ పదవి కృష్ణార్పణం!!
సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బీహార్‌లో లాలూ ఉంటాడని బీరాలు పలికిన రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్.. ఇక ఎంపీ పదవిని వదులుకోవాల్సిందే!! ఎప్పుడో 17 ఏళ్లనాటి పశువుల దాణా స్కాంలో దోషిగా తేలిన ఆయనకు రాంచీ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీంతోపాటే ఆయన లోక్ సభ సభ్యత్వం కూడా రద్దయిపోయింది. దీన్ని బట్టి.. దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన నాయకుల్లో ఒకరైన లాలూ రాజకీయ భవితవ్యం మసకబారిపోయింది. లాలూతో పాటు దోషులుగా తేలిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్ర, జేడీయూ నేత జగదీశ్ శర్మలకు నాలుగేసి సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ప్రవస్ కుమార్ సింగ్ తీర్పుచెప్పారు. ఈ స్కాంలో మొత్తం 45 మందిని దోషులుగా తేల్చగా, వారిలో 37 మందికి సంబంధించి మాత్రమే గురువారం తీర్పు వెలువరించారు. బుధవారంనాడే బాత్రూంలో కాలుజారి పడి ఆస్పత్రిలో చేరిన జగన్నాథ మిశ్రాకు 2 లక్షల రూపాయల జరిమానా పడింది. శర్మకు 5 లక్షలు వడ్డించారు. రాష్ట్రీయ జనతాదళ్ వ్యవస్థాపకుడైన లాలూ ప్రసాద్ (67).. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తీర్పు వినగానే ఒక్కసారిగా హతాశుడయ్యారు. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉన్నారు. లాలూ ప్రసాద్ చాలా గౌరవనీయుడైన వ్యక్తి అని, సమాజంలో చాలా ఉన్నతస్థానంలో ఉన్నారని అంతకుముందు లాలూ న్యాయవాది సురేందర్ సింగ్ వాదించారు. -
లాలూకు ఐదేళ్లు.. జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల శిక్ష
-
లాలూకు ఐదేళ్లు.. జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల శిక్ష
రాంచీ : దాణా స్కాంలో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌కు ఐదేళ్లు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. లాలూకు 25 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. దీంతో ఎంపీ పదవికి ఆయన అనర్హుడయ్యారు. వీరిద్దరు సహా, మరికొందరు దోషులపై దాణా స్కాంలో శిక్ష విధించడంపై వాదనలు ఉదయం 11 గంటలకు మొదలయ్యాయి. రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ వాదనలు కొనసాగాయి. దోషులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి ఈ తీర్పును వారికి కూడా వినిపించారు. జడ్జి ప్రవస్ కుమార్ సింగ్ ఈ తీర్పు వెలువరించారు. లాలూ ప్రసాద్‌కు దాదాపు నాలుగు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు ముందుగానే అంచనా వేశారు. -
లాలూకు శిక్షపై మొదలైన వాదనలు.. మధ్యాహ్నానికి తీర్పు!
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా, మరికొందరు దోషులపై దాణా స్కాంలో శిక్ష విధించడంపై వాదనలు ఉదయం 11 గంటలకు మొదలయ్యాయి. రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ వాదనలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2.30 తర్వాత శిక్షపై తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. దోషులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి ఈ తీర్పును వారికి కూడా వినిపిస్తారు. జడ్జి ప్రవస్ కుమార్ సింగ్ ఎదుట ఈ వాదనలు కొనసాగుతున్నాయి. లాలూ ప్రసాద్‌కు దాదాపు నాలుగు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. పశువుల దాణా స్కాంలో లాలూ ప్రసాద్, జగన్నాథ మిశ్రాలతో పాటు మరో 43 మందిని దోషులుగా ఇప్పటికే నిర్ధరించారు. -
దాణా స్కాం దోషి లాలూ!
పదిహేడేళ్ల సుదీర్ఘ కాలం విచారణ తర్వాత బీహార్ దాణా కుంభకోణంలో ఎట్టకేలకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఆయన, ఆ రాష్ట్రానికి చెందిన మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌మిశ్రా, జేడీ(యూ)కి చెందిన ఎంపీ జగదీష్‌శర్మ, ఆయన కుమారుడు ఎమ్మెల్యే రాహుల్‌సహా 45 మందికి ఈ కేసులో ఎన్నేళ్లు శిక్ష విధించబోతున్నదీ కోర్టు గురువారం తీర్పు చెబుతుంది. దోషులుగా నిర్ధారణ కావడంతో లాలూతోసహా వీరంతా జైలుకు పోవాల్సివచ్చింది. ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్న అంశంతో నిమిత్తంలేకుండా దాదాపు 20 ఏళ్లపాటు కొనసాగిన ఈ కుంభకోణంలో... చివరకు బడా రాజకీయ నాయకులు దోషులని తేలడానికి కూడా ఇంచుమించు అంతే సమయం పట్టింది. ఈ స్కాంలో దాఖలైన ఇతర కేసుల్లో కొందరు అధికారులకూ, మరికొందరు రాజకీయనాయకులకూ ఇంతకుముందే శిక్షలు పడ్డాయి. ఎన్నడో 1985లో అప్పటి కాగ్ టీఎన్ చతుర్వేది పశు సంవర్ధక శాఖలో నిధులు స్వాహా అవుతున్నాయని గుర్తించి అప్పటి సీఎం చంద్రశేఖర్సింగ్ను తొలిసారి అప్రమత్తం చేశారు. దాదాపు 1975 ప్రాంతంలో మొదలైన ఈ స్కాంలో భారీయెత్తున నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆయన గమనించారు. కానీ, చతుర్వేది సలహాను పట్టించుకోక పోవడంవల్ల అటు తర్వాతకూడా ఇది కొనసాగింది. చివరకు పశుసంవర్ధక శాఖ అధికారి అమిత్ ఖరే రూ. 37.70 కోట్ల నిధుల స్వాహాపై 1996లో ఇచ్చిన ఫిర్యాదుతో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఆ కేసులోనే లాలూ, జగన్నాథ్ మిశ్రాలు దోషులుగా నిర్ధారణ అయ్యారు. ఇదే స్కాంకు సంబంధించిన మరో కేసులో లాలూ లోగడ నిర్దోషిగా బయటపడ్డారు. 2000 సంవత్సరంలో బీహార్నుంచి విడివడి ఏర్పడిన జార్ఖండ్‌లో కూడా దాణా స్కాం కేసులు నడుస్తున్నాయి. అక్కడ లాలూ, మిశ్రాలపై మరో నాలుగు కేసులు విచారణలో ఉన్నాయి. ఆయన వచ్చిన గ్రామీణ నేపథ్యంవల్ల కావొచ్చు...ఆయన స్వభావంవల్ల కావొచ్చు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఆయనను జోకర్‌గా చిత్రించే ప్రయత్నాలు జరిగాయి. కానీ, లాలూ ఎంతో పేదరికంలో పుట్టి, కష్టపడి ఎదిగారు. ప్రభుత్వాల అవినీతి విధానాలకు వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ప్రారంభమైన విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న యువ విద్యార్థి నాయకుడాయన. అయితే, అలాంటి వ్యక్తి రాజకీయ రంగ ప్రవేశం చేసి, ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి, అప్పటికే పుట్టి కొనసాగుతున్న అవినీతిలో భాగస్వామిగా మారి, చివరకు ఆ కేసులోనే దోషిగా నిర్ధారణకావడం ఒక వైచిత్రి. ఆదర్శవంతమైన సమాజాన్ని కాంక్షించి ఉవ్వెత్తున లేచిన ఉద్యమంనుంచి ఎదిగిన నాయకుడొకరు చివరకు కుంభకోణంలో చిక్కుకుంటారన్నది అప్పట్లో ఊహకైనా అందని విషయం. తన నేపథ్యంరీత్యా ఈ స్కాంను తానే బయట పెట్టివుంటే లాలూ చరిత్రలో నిలిచిపోయేవారు. కానీ, ఆయన భిన్నమైన దోవను ఎంచుకున్నారు. ఇదే కేసులో కనీసం కొన్నేళ్లక్రితం తీర్పువచ్చి వున్నా పరిస్థితి వేరుగా ఉండేది. ఆయన శిక్షకు గురైనా అప్పీల్ చేసుకుని పార్లమెంటు సభ్యుడిగా కొనసాగేవారు. మరికొన్నాళ్లలో జరగబోయే ఎన్నికల్లో పాల్గొనేవారు. కానీ, మొన్న జూలై 10న నేర చరితులైన చట్టసభల సభ్యులపై కొరడా ఝళిపిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పువల్ల అది అసాధ్యంగా మారింది. ఈ తీర్పును వమ్ముచేస్తూ కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స కాస్తా వివాదంలో చిక్కుకోవడంవల్ల లాలూకు వెసులుబాటు దొరకలేదు. ఇప్పుడు ఆయనకు రెండేళ్లకుమించి శిక్షపడినట్టయితే, వెనువెంటనే పార్లమెంటు సభ్యత్వం రద్దుకావడంతోపాటు ఆరేళ్లవరకూ ఎన్నికల్లో పోటీచేసేందుకు కూడా అవకాశం ఉండదు. అప్పీల్లో నిర్దోషిగా నిర్ధారణ అయితే అది వేరే సంగతి. ఈ స్కాం విస్తృతిరీత్యా చాలా పెద్దది. దాదాపు 20 ఏళ్లపాటు సాగిన కుంభకోణంలో రూ.950 కోట్లమేర ఖజానాను కొల్లగొట్టారన్నది నిందితులపై అభియోగం. ఈ స్కాంకు సంబంధించి నమోదైన 55 కేసుల్లో జార్ఖండ్‌లోనే 53 కేసులున్నాయి. మొత్తం 46 కేసుల్లో 550 మందికి శిక్షలుపడగా 9 కేసుల్లో మరో 50 మంది విచారణను ఎదుర్కొంటున్నారు. అధికారపక్షంతోపాటు విపక్ష నాయకులు కూడా ఇందులో నిందితులు కావడం ఈ స్కాం విలక్షణత. దాణా స్కాం పర్యవసానంగా లాలూపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కూడా నమోదుచేయగా 2006లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆ కేసును కొట్టేసింది. దానిపై సీబీఐ అప్పీల్‌కు వెళ్లకపోవడంతో బీహార్ ప్రభుత్వమే 2007లో పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దాంతో కేసు కొనసాగించమని హైకోర్టు ఆదేశించింది. అయితే, లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఈ కేసులో అప్పీల్‌కి వెళ్లే అధికారం సీబీఐకి మాత్రమే ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెబుతూ కేసు కొట్టేసింది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వానికి లాలూ మద్దతు అవసరం కావడంవల్లే ఆ కేసులో సీబీఐ అప్పీల్‌కు వెళ్లలేదన్నది బహిరంగ రహస్యం. బీహార్‌లో కొన్నాళ్లక్రితం అధికార జేడీ(యూ)-బీజేపీలమధ్య విభేదాలు తలెత్తి నూతన రాజకీయ పరిణామాలు సంభవించాక తన భవిష్యత్తుపై లాలూ ప్రసాద్ యాదవ్ బాగా ఆశలు పెట్టుకున్నారు. తాను చాస్తున్న స్నేహ హస్తాన్ని తిరస్కరించి, ముఖ్యమంత్రి నితీష్కుమార్వైపే కాంగ్రెస్ చూస్తున్నా తాజా పరిణామాలు తనకు అనుకూలంగా మారబోతున్నాయని ఆయన విశ్వసించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో స్థానాలు సంపాదించి, కేంద్రంలో చక్రం తిప్పవచ్చునని అంచనా వేశారు. కానీ, ఈ తీర్పు పర్యవసానంగా అంతా తారుమారైంది. ఇన్నాళ్లూ ఆయన పార్టీని వెన్నంటి ఉన్న భిన్న వర్గాలు వేరే దారి చూసుకుంటాయా లేక ఆయనకు అండగా నిలబడతాయా అన్నది రాగల ఎన్నికల్లో తేలిపోతుంది. -
నేడు తేలనున్న లాలూ ప్రసాద్ భవితవ్యం
రాంచీ : ఆర్జేడీ అధ్యక్షుడు, యూపీఏ కీలక భాగస్వామి లాలూప్రసాద్ యాదవ్ భవితవ్యం ఇవాళ తేలనుంది. దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి పీకే సింగ్ సోమవారం తుది తీర్పు వెలువరించనున్నారు. ఈ కేసులో లాలు దోషిగా నిరూపితమైతే ఆయనకు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని సమాచారం. అదే జరిగితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం లాలూపై అనర్హత వేటు పడే ప్రమాదముంది. లాలూ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కుంభకోణం వెలుగుచూసింది. ఈ స్కాంలో లాలూ, అప్పటి మంత్రి జగన్నాధ్‌మిశ్రా, ఇద్దరు ఐఏఎస్ అధికారులు సహా పలువురు వ్యక్తులు... దాదాపు 38 కోట్లు స్వాహా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చైబాస జిల్లా ట్రెజరీ నుంచి ఈ భారీ మొత్తాన్ని డ్రా చేశారని వాదనలు వినపించాయి. ఈ కుంభకోణంపై సీబీఐకేసు నమోదు చేయడంతో లాలూ 1997లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో మొత్తం 56మందిని నిందితులుగా పేర్కొనగా విచారణ సమయంలో ఏడుగురు మరణించారు. ఇద్దరు అప్రూవర్‌గా మారగా.... ఒకరికి కేసు నుంచి విముక్తి లభించింది.