'ఆయనకు సూపర్ సీఎం హోదా ఇవ్వండి'
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ఓ కార్యక్రమంలో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. పట్నాలో జరిగిన హోమియోపతి సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు లాలు కొడుకు, బిహార్ ఆరోగ్య మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ను ఆహ్వానించగా, అతనికి బదులుగా లాలు ప్రత్యక్షమయ్యారు. తద్వారా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీజేపీ లక్ష్యంగా చేసుకునేందుకు లాలు ఆస్కారమిచ్చారు. ఈ చర్య ద్వారా ఆరోగ్య శాఖను, బిహార్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో తెలుస్తోందని బీజేపీ నేత, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి నంద్ కిశోర్ యాదవ్ ఆరోపణలు సంధించారు. నితీశ్.. లాలుకు అధికారికంగా 'సూపర్ చీఫ్ మినిస్టర్' హోదా ఇవ్వాలని వ్యాఖ్యానించారు.
బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను లాలు తరచూ తనిఖీలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి చేయాల్సిన విధులను లాలు చేపట్టడంపై ప్రతిపక్షలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. లాలు ఎమ్మెల్యే లేదా ఎంపీ కూడా కాదని, దాణా కుంభకోణం కేసులో బెయిల్పై ఉన్నారని, ఏ హోదాతో అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ప్రశ్నించారు. బిహార్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాకూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. నితీశ్ కేబినెట్లో లాలు ఇద్దరు కుమారులకు బెర్తులు దక్కాయి.