రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (బీహార్) గురించి తెలియనివారెవరూ ఉండరు. ఆయన కుమార్తె, సారణ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన రోహిణి ఆచార్య ఇప్పుడు వార్తల్లో ప్రధానంగా కనిపిస్తున్నారు. మహాకూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆమె తన అఫిడవిట్‌లో తనకు రూ.15.82 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే తన భర్తకు రూ.19.86 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయని తెలియజేశారు.
వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె వివాహం తర్వాత సింగపూర్ షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడామె భారత్‌కు తిరిగివచ్చారు. ఆమె తన వద్ద రూ.2.99 కోట్ల చరాస్తులు, రూ.12.82 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భర్త దగ్గర రూ.6.92 కోట్ల చరాస్తులు, రూ.12.94 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. అలాగే తన వద్ద రూ.20 లక్షల నగదు, భర్త వద్ద రూ.10 లక్షల నగదు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం ఆమె దగ్గరున్న స్థిరాస్తులలో పట్నాలో రూ.68.62 లక్షల విలువైన వాణిజ్య పరమైన ఆస్తి కూడా ఉంది. రోహిణి ఆచార్య గతంలో తన తండ్రి లాలూ ప్రసాద్‌కు కిడ్నీ దానం చేసి, వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా ఉంటారు. మే 20న ఐదవ దశ లోక్‌సభ ఎన్నికల్లో సారణ్‌లో ఓటింగ్ జరగనుంది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీపై ఆమె పోటీ చేస్తున్నారు. రోహణి ఆచార్య .. లాలూ ప్రసాద్, రబ్రీ దేవిలకు నాల్గవ సంతానం. గతంలో లాలూ ప్రసాద్ సారణ్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment