ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో పోరు ఆసక్తికరంగా మారింది. బీహార్‌లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య పోటీ చేస్తున్నారు. దీంతో వీరి గురించిన చర్చలు సోషల్ మీడియాలో విరివిగా సాగుతున్నాయి. వీరికి ఈ పేర్లను లాలూ యాదవ్ ఎందుకు పెట్టారని పలువురు ఇంటర్నెట్‌లో శోధిస్తున్నారు.
అది.. 1976.. దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నాటి ప్రభుత్వం పలువురు నేతలను జైల్లో పెట్టింది. వారిలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నేతలను, కార్యకర్తలను జైలులో పెట్టే చట్టాన్ని అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (మీసా) అని పిలుస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య రబ్రీదేవి కుమార్తెకు జన్మనిచ్చింది. దీంతో తానున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ లాలూ తన తొలి కుమార్తెకు ‘మీసా భారతి’ అని పేరు పెట్టారు.
ఇక రోహణి ఆచార్యకు ఆ పేరు ఎలా వచ్చిందన్న విషయానికొస్తే.. లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి 1979లో మరోసారి తల్లి అయ్యారు. ఆమెకు డెలివరీకి ముందు తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆపరేషన్ గురించి తెలియగానే అప్పట్లో లాలూ యాదవ్ భయపడ్డారట. పట్నాకు చెందిన నాటి ప్రముఖ మహిళా వైద్యురాలు కమలా ఆచార్య.. లాలూ భార్య రబ్రీ దేవికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
అయితే ఆమె ఆపరేషన్‌కు అయిన ఖర్చును లాలూ నుంచి తీసుకునేందుకు నిరాకరించాట. లాలూ యాదవ్‌కు రెండో కుమార్తె పుట్టిన సమయంలో రోహిణి నక్షత్రం ఉందట. దీంతో లాలూ తన కుమార్తెకు రోహిణి ఆచార్య అని పేరు పెట్టారు. అంటే కుమార్తె పేరుకు వైద్యురాలి పేరును జత చేశారన్నమాట. ప్రస్తుతం మిసా భారతి పాటలీపుత్ర నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. రోహిణి ఆచార్య బీహార్‌లోని సారణ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్‌పై పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment