లాలూజీ మాటలకు అర్థాలే వేరులే..!
పట్నా: గంగానది వరద తాకిడికి బిహార్ అతలాకుతలమైంది. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. కొన్ని జిల్లాల్లో ఇళ్లు నీటమునిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. వరద పరిస్థితిని చూసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చలించిపోయారు. అయితే మిత్రపక్షమైన ఆర్జేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ తన కొడుకు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్తో కలసి వరద ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లినపుడు చేసిన వ్యాఖ్యలు వరద బాధితులను ఆయోమయానికి గురిచేశాయి.
గంగ మీ ఇళ్లకు రావడం అదృష్టమంటూ వరద బాధితులను ఉద్దేశించి లాలు వ్యాఖ్యానించారు. 'చాలా సందర్భాల్లో మీరే గంగానది దగ్గరకు వెళ్తారు. అలాంటిది గంగ మీ ఇళ్లకు రావడం మీ అదృష్టం. ఇది ఎప్పుడో కానీ జరగదు' అంటూ తన స్టయిల్లో లాలు అన్నారు. లాలు అంతటితో వదిలిపెట్టకుంగా గంగా నది స్వచ్ఛత గురించి సెలవిచ్చారు. 'పవిత్రమైన గంగా జలం ఈ రోజుల్లో ఎక్కడు దొరుకుతోంది? గత దశాబ్దంకాలంగా గంగ మన నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఇన్నాళ్లకు మళ్లీ మనదగ్గరకు వచ్చింది' అని చెప్పారు. పోస్టు ద్వారా గంగజలాన్ని ఇంటికి పంపే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడాన్ని దృష్టిలో ఉంచుకుని లాలు ఇలా వ్యాఖ్యానించారేమో కానీ.. ఆయన మాటలకు మీడియా ప్రతినిధులు, వరద బాధితులు అవాక్కయ్యారు.
1975 వచ్చిన వరదల కంటే ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వరద బాధితులను ఆదుకుంటామని లాలు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నితీష్తో మాట్లాడి పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని చెప్పారు. అలాగే బోట్లు కొట్టుకుపోయిన మత్స్య కారులను ఆదుకుంటామని చెప్పారు.