లాలూ ఎంపీ పదవి కృష్ణార్పణం!!
సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బీహార్లో లాలూ ఉంటాడని బీరాలు పలికిన రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్.. ఇక ఎంపీ పదవిని వదులుకోవాల్సిందే!! ఎప్పుడో 17 ఏళ్లనాటి పశువుల దాణా స్కాంలో దోషిగా తేలిన ఆయనకు రాంచీ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీంతోపాటే ఆయన లోక్ సభ సభ్యత్వం కూడా రద్దయిపోయింది. దీన్ని బట్టి.. దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన నాయకుల్లో ఒకరైన లాలూ రాజకీయ భవితవ్యం మసకబారిపోయింది.
లాలూతో పాటు దోషులుగా తేలిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్ర, జేడీయూ నేత జగదీశ్ శర్మలకు నాలుగేసి సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ప్రవస్ కుమార్ సింగ్ తీర్పుచెప్పారు. ఈ స్కాంలో మొత్తం 45 మందిని దోషులుగా తేల్చగా, వారిలో 37 మందికి సంబంధించి మాత్రమే గురువారం తీర్పు వెలువరించారు.
బుధవారంనాడే బాత్రూంలో కాలుజారి పడి ఆస్పత్రిలో చేరిన జగన్నాథ మిశ్రాకు 2 లక్షల రూపాయల జరిమానా పడింది. శర్మకు 5 లక్షలు వడ్డించారు. రాష్ట్రీయ జనతాదళ్ వ్యవస్థాపకుడైన లాలూ ప్రసాద్ (67).. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తీర్పు వినగానే ఒక్కసారిగా హతాశుడయ్యారు. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉన్నారు. లాలూ ప్రసాద్ చాలా గౌరవనీయుడైన వ్యక్తి అని, సమాజంలో చాలా ఉన్నతస్థానంలో ఉన్నారని అంతకుముందు లాలూ న్యాయవాది సురేందర్ సింగ్ వాదించారు.