దాణా స్కాం దోషి లాలూ!
దాణా స్కాం దోషి లాలూ!
Published Wed, Oct 2 2013 12:18 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
పదిహేడేళ్ల సుదీర్ఘ కాలం విచారణ తర్వాత బీహార్ దాణా కుంభకోణంలో ఎట్టకేలకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఆయన, ఆ రాష్ట్రానికి చెందిన మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌మిశ్రా, జేడీ(యూ)కి చెందిన ఎంపీ జగదీష్‌శర్మ, ఆయన కుమారుడు ఎమ్మెల్యే రాహుల్‌సహా 45 మందికి ఈ కేసులో ఎన్నేళ్లు శిక్ష విధించబోతున్నదీ కోర్టు గురువారం తీర్పు చెబుతుంది. దోషులుగా నిర్ధారణ కావడంతో లాలూతోసహా వీరంతా జైలుకు పోవాల్సివచ్చింది. ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్న అంశంతో నిమిత్తంలేకుండా దాదాపు 20 ఏళ్లపాటు కొనసాగిన ఈ కుంభకోణంలో... చివరకు బడా రాజకీయ నాయకులు దోషులని తేలడానికి కూడా ఇంచుమించు అంతే సమయం పట్టింది.
ఈ స్కాంలో దాఖలైన ఇతర కేసుల్లో కొందరు అధికారులకూ, మరికొందరు రాజకీయనాయకులకూ ఇంతకుముందే శిక్షలు పడ్డాయి. ఎన్నడో 1985లో అప్పటి కాగ్ టీఎన్ చతుర్వేది పశు సంవర్ధక శాఖలో నిధులు స్వాహా అవుతున్నాయని గుర్తించి అప్పటి సీఎం చంద్రశేఖర్‌సింగ్‌ను తొలిసారి అప్రమత్తం చేశారు. దాదాపు 1975 ప్రాంతంలో మొదలైన ఈ స్కాంలో భారీయెత్తున నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆయన గమనించారు. కానీ, చతుర్వేది సలహాను పట్టించుకోక పోవడంవల్ల అటు తర్వాతకూడా ఇది కొనసాగింది. చివరకు పశుసంవర్ధక శాఖ అధికారి అమిత్ ఖరే రూ. 37.70 కోట్ల నిధుల స్వాహాపై 1996లో ఇచ్చిన ఫిర్యాదుతో తొలి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఆ కేసులోనే లాలూ, జగన్నాథ్ మిశ్రాలు దోషులుగా నిర్ధారణ అయ్యారు. ఇదే స్కాంకు సంబంధించిన మరో కేసులో లాలూ లోగడ నిర్దోషిగా బయటపడ్డారు.
2000 సంవత్సరంలో బీహార్‌నుంచి విడివడి ఏర్పడిన జార్ఖండ్‌లో కూడా దాణా స్కాం కేసులు నడుస్తున్నాయి. అక్కడ లాలూ, మిశ్రాలపై మరో నాలుగు కేసులు విచారణలో ఉన్నాయి. ఆయన వచ్చిన గ్రామీణ నేపథ్యంవల్ల కావొచ్చు...ఆయన స్వభావంవల్ల కావొచ్చు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఆయనను జోకర్‌గా చిత్రించే ప్రయత్నాలు జరిగాయి. కానీ, లాలూ ఎంతో పేదరికంలో పుట్టి, కష్టపడి ఎదిగారు. ప్రభుత్వాల అవినీతి విధానాలకు వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ప్రారంభమైన విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న యువ విద్యార్థి నాయకుడాయన. అయితే, అలాంటి వ్యక్తి రాజకీయ రంగ ప్రవేశం చేసి, ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి, అప్పటికే పుట్టి కొనసాగుతున్న అవినీతిలో భాగస్వామిగా మారి, చివరకు ఆ కేసులోనే దోషిగా నిర్ధారణకావడం ఒక వైచిత్రి. ఆదర్శవంతమైన సమాజాన్ని కాంక్షించి ఉవ్వెత్తున లేచిన ఉద్యమంనుంచి ఎదిగిన నాయకుడొకరు చివరకు కుంభకోణంలో చిక్కుకుంటారన్నది అప్పట్లో ఊహకైనా అందని విషయం. తన నేపథ్యంరీత్యా ఈ స్కాంను తానే బయట పెట్టివుంటే లాలూ చరిత్రలో నిలిచిపోయేవారు. కానీ, ఆయన భిన్నమైన దోవను ఎంచుకున్నారు. ఇదే కేసులో కనీసం కొన్నేళ్లక్రితం తీర్పువచ్చి వున్నా పరిస్థితి వేరుగా ఉండేది. ఆయన శిక్షకు గురైనా అప్పీల్ చేసుకుని పార్లమెంటు సభ్యుడిగా కొనసాగేవారు. మరికొన్నాళ్లలో జరగబోయే ఎన్నికల్లో పాల్గొనేవారు. కానీ, మొన్న జూలై 10న నేర చరితులైన చట్టసభల సభ్యులపై కొరడా ఝళిపిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పువల్ల అది అసాధ్యంగా మారింది.
ఈ తీర్పును వమ్ముచేస్తూ కేంద్రం జారీచేసిన ఆర్డినెన్‌స కాస్తా వివాదంలో చిక్కుకోవడంవల్ల లాలూకు వెసులుబాటు దొరకలేదు. ఇప్పుడు ఆయనకు రెండేళ్లకుమించి శిక్షపడినట్టయితే, వెనువెంటనే పార్లమెంటు సభ్యత్వం రద్దుకావడంతోపాటు ఆరేళ్లవరకూ ఎన్నికల్లో పోటీచేసేందుకు కూడా అవకాశం ఉండదు. అప్పీల్‌లో నిర్దోషిగా నిర్ధారణ అయితే అది వేరే సంగతి. ఈ స్కాం విస్తృతిరీత్యా చాలా పెద్దది. దాదాపు 20 ఏళ్లపాటు సాగిన కుంభకోణంలో రూ.950 కోట్లమేర ఖజానాను కొల్లగొట్టారన్నది నిందితులపై అభియోగం. ఈ స్కాంకు సంబంధించి నమోదైన 55 కేసుల్లో జార్ఖండ్‌లోనే 53 కేసులున్నాయి. మొత్తం 46 కేసుల్లో 550 మందికి శిక్షలుపడగా 9 కేసుల్లో మరో 50 మంది విచారణను ఎదుర్కొంటున్నారు. అధికారపక్షంతోపాటు విపక్ష నాయకులు కూడా ఇందులో నిందితులు కావడం ఈ స్కాం విలక్షణత. దాణా స్కాం పర్యవసానంగా లాలూపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కూడా నమోదుచేయగా 2006లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆ కేసును కొట్టేసింది. దానిపై సీబీఐ అప్పీల్‌కు వెళ్లకపోవడంతో బీహార్ ప్రభుత్వమే 2007లో పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దాంతో కేసు కొనసాగించమని హైకోర్టు ఆదేశించింది.
అయితే, లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఈ కేసులో అప్పీల్‌కి వెళ్లే అధికారం సీబీఐకి మాత్రమే ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెబుతూ కేసు కొట్టేసింది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వానికి లాలూ మద్దతు అవసరం కావడంవల్లే ఆ కేసులో సీబీఐ అప్పీల్‌కు వెళ్లలేదన్నది బహిరంగ రహస్యం. బీహార్‌లో కొన్నాళ్లక్రితం అధికార జేడీ(యూ)-బీజేపీలమధ్య విభేదాలు తలెత్తి నూతన రాజకీయ పరిణామాలు సంభవించాక తన భవిష్యత్తుపై లాలూ ప్రసాద్ యాదవ్ బాగా ఆశలు పెట్టుకున్నారు. తాను చాస్తున్న స్నేహ హస్తాన్ని తిరస్కరించి, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌వైపే కాంగ్రెస్ చూస్తున్నా తాజా పరిణామాలు తనకు అనుకూలంగా మారబోతున్నాయని ఆయన విశ్వసించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో స్థానాలు సంపాదించి, కేంద్రంలో చక్రం తిప్పవచ్చునని అంచనా వేశారు. కానీ, ఈ తీర్పు పర్యవసానంగా అంతా తారుమారైంది. ఇన్నాళ్లూ ఆయన పార్టీని వెన్నంటి ఉన్న భిన్న వర్గాలు వేరే దారి చూసుకుంటాయా లేక ఆయనకు అండగా నిలబడతాయా అన్నది రాగల ఎన్నికల్లో తేలిపోతుంది.
Advertisement