Jagannath Mishra
-
మాజీ సీఎం అంత్యక్రియల్లో అపశ్రుతి
పట్నా : బిహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా అంత్యక్రియలను జేడీయూ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 82 ఏళ్ల మిశ్రా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. సుపోల్ జిల్లాలోని ఆయన స్వగ్రామంలో బుధవారం అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. అయితే జగన్నాథ మిశ్రా అంత్యక్రియల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన పార్దివదేహానికి అంత్యక్రియలు నిర్వహించేటపుడు 22 మంది పోలీసులు గౌరవ వందనం సమర్పించవలసి ఉంది. వీరు తుపాకులను పేల్చినప్పుడు, కనీసం ఒక్క తూటా అయినా పేలలేదు. తుపాకులు మొరాయించడంతో చేసేదేమి లేక మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీనిపై ఆర్జేడీ ఎమ్మెల్యే యద్వంశ్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది మిశ్రాను అవమానించినట్టేనని, దీనిపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
బిహార్ మాజీ సీఎం కన్నుమూత
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కన్నమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. బిహార్‌కు ఆయన మూడు దఫాలు సీఎంగా పనిచేశారు. దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన బిహార్ పశుదాణా కుంభకోణంలో జగన్నాథ్ మిశ్రా కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాంచీ కోర్టు ఆయనను ఇటీవల నిర్ధోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖలు తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఆయనకు నివాళిగా బిహార్ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఏపీ గవర్నర్ సంతాపం.. సాక్షి, అమరావతి : బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిహార్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. మిశ్రా కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వైఎస్ జగన్ సంతాపం.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. మిశ్రా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
సీబీఐ కోర్టు మెట్లెక్కిన లాలూ
పాట్నా: దాణా కుంభకోణం కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. బిహార్ మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కూడా సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి దేవ్‌రాజ్ త్రిపాఠి కూడా కోర్టుకు వచ్చారు. దాణా పంపిణీకి సంబంధించి కోట్లలో కుంభకోణం జరిగినట్లు బయటపడటంతో 45మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు చనిపోగా.. ప్రస్తుతం 27మంది విచారణను ఎదుర్కొంటున్నారు. గతంలో జార్కండ్ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌పై నమోదైన కుట్రపూరిత ఆరోపణలన్నింటిని కొట్టి వేయగా.. ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు లాలూ విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించిన విషయం తెలిసిందే. -
ముగిసిన ప్రచార హోరు
పట్నా: బిహార్ శాసనసభ తొలి దశ ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం ఐదు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా సోమవారం సమస్తిపూర్, బేగుసరాయ్, భాగల్పూర్, బాంకా, ఖగారియా, ముంగేర్, లఖీసరాయ్, షేక్‌పురా, నవద, జాముయ్ జిల్లాల్లోని 49 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ- జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహాకూటములు పరస్పర విమర్శలతో ప్రారంభించిన ప్రచారం.. ఆరంభంలో అభివృద్ధి అంశంపై కేంద్రీకరించినప్పటికీ.. ఆ తర్వాత అగ్రనేతలపై వ్యక్తిగత విమర్శలకు, ఆపై దూషణల పర్వానికి నాంది పలికింది. రెండు కూటముల్లోని అగ్ర నేతలు సభల్లో ప్రత్యర్థి నేతలపై పరుష పదజాలం వాడడంతో ప్రచారం వేడెక్కిపోయింది. ఒకరు ‘సైతాన్’ అంటే.. మరొకరు ‘బ్రహ్మ పిశాచి’ అన్నారు. ఒకరు ‘దాణా దొంగ’ అంటే.. ఇంకొకరు ‘నరభక్షకుడు’ అని అభివర్ణించారు. దీంతో కేసులు పెరిగాయి. ఒకరిని మించి మరొకరు... రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలంటూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను చూపుతూ.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కుల ప్రాతిపదికపై రిజర్వేషన్లను రద్దు చేయాలని యోచిస్తోందన్న మాటను జేడీయూ, ఆర్జేడీ అగ్రనేతలు లాలూ ప్రసాద్, నితీశ్‌కుమార్‌లు తమ ప్రచారంలో ప్రధానాంశంగా చేశాయి. దాద్రీలో బీఫ్ తిన్నాడన్న అనుమానంతో ఒక వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై స్పందిస్తూ.. హిందువులు కూడా బీఫ్ తింటారని లాలు చేసిన వ్యాఖ్యలను ఆయనపైనే తిప్పికొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవకాశంగా మలచుకున్నారు. లాలూ తన సొంత కులమైన యాదవులను, తనను అధికారంలోకి తీసుకువచ్చిన యదువంశీయులను, బిహార్‌ను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై సీఎం నితీశ్ స్పందిస్తూ.. బిహార్ ఎన్నికలకు మతం రంగు పులిమేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, అసలు మోదీ ఇప్పుడు కనిపిస్తున్నారని అభివర్ణించారు. అయితే.. హేయమైన దాద్రీ ఘటనపై మాత్రం మోదీ కఠోరమైన మౌనం పాటిస్తున్నారని ఎండగట్టారు. లాలూ, నితీశ్ కూటమి గెలిస్తే.. మళ్లీ ‘ఆటవిక రాజ్యం’ వస్తుందంటూ నాటి ఆర్జేడీ పాలనపై గల విమర్శలను ప్రస్తావిస్తూ మోదీ, అమిత్‌షా సహా ఎన్డీఏ నేతలు ప్రచారం నిర్వహించారు. పరస్పర ఆరోపణల పర్వంలో.. అమిత్‌షా, లాలు, శరద్‌యాదవ్, అక్బరుద్దీన్ ఒవైసీలపై ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ప్రచారానికి అగ్రనేతల సారథ్యం... ఎన్డీఏ ఎన్నికల ప్రచారానికి మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలు సారథ్యం వహించారు. మిత్రపక్షాల నేతలు రామ్‌విలాస్ పాశ్వాన్(ఎల్జేపీ), జితన్‌రామ్‌మాంఝీ (హిందుస్తానీ అవామీ మోర్చా), ఉపేంద్రకుష్వహ (రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ)లు కూడా మోదీ సభల్లో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్‌తో కూడిన మహా కూటమి ప్రచారానికి లాలు, నితీశ్‌లు నేతృత్వం వహించగా.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు చెరొక రోజు పాటు ప్రచారం నిర్వహించారు. ఇక పార్టీ నేతలు, హిందీ సినీ తారలు హేమమాలిని, స్మృతి ఇరానీ, మనోజ్ తివారితో పాటు నటుడు అజయ్ దేవగన్‌ను కూడా బీజేపీ ప్రచారంలోకి దించింది. బీజేపీకి జగన్నాథ్ మద్దతు బిహార్ మాజీ సీఎం జగన్నాథ్‌మిశ్రా తన పార్టీ భారతీయ జన్ కాంగ్రెస్ (రాష్ట్రీయ)ను శనివారం పునరుద్ధరించారు. రాష్ట్రంలో బీజేపీ సారథ్యంలోని కూటమి గెలుపుకోసం తాను కృషి చేస్తానని ప్రకటించారు. ఆరంభం నుంచి కాంగ్రెస్‌లో కొనసాగిన మిశ్రా ఆ పార్టీ నుంచి మూడు సార్లు సీఎం పదవి చేపట్టారు. ఒకసారి కేంద్రమంత్రి కూడా అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడి నితీశ్‌కు మద్దతు తెలిపారు. మిశ్రా కుమారుడు నితీశ్‌మిశ్రా మొన్నటి వరకూ నితీశ్ కేబినెట్లో మంత్రి. ఆయన ఇటీవల జితన్రామ్ప్రసాద్కు మద్దతు తెలిపి.. ఇప్పుడు బీజేపీ టికెట్‌పై పోటీచేస్తున్నారు. ‘రుషులూ గోమాంసం తినేవారు!’ పట్నా: హిందువులు కూడా బీఫ్ తింటారంటూ ఆర్జేడీ చీఫ్ లాలూ వ్యాఖ్యానించగా, ఆ పార్టీ సీనియర్ నేత రఘువంశ్సింగ్ ‘రుషులు, మహర్షులూ గోమాంసం తిన్నార’ంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రుషులు, మహర్షులు గోమాంసం తినేవారని వేదాల్లోనే రాసి ఉంది. దీనిపై ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరమేమీ లేదు’ అని ఓ కార్యక్రమంలో అన్నారు. ఈ ఈ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని రాంబిహారీ, దర్భంగాలోని కోర్టుల్లో ప్రైవేటు ఫిర్యాదులు దాఖలయ్యాయి. -
దాణా స్కాం దోషి లాలూ!
పదిహేడేళ్ల సుదీర్ఘ కాలం విచారణ తర్వాత బీహార్ దాణా కుంభకోణంలో ఎట్టకేలకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఆయన, ఆ రాష్ట్రానికి చెందిన మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌మిశ్రా, జేడీ(యూ)కి చెందిన ఎంపీ జగదీష్‌శర్మ, ఆయన కుమారుడు ఎమ్మెల్యే రాహుల్‌సహా 45 మందికి ఈ కేసులో ఎన్నేళ్లు శిక్ష విధించబోతున్నదీ కోర్టు గురువారం తీర్పు చెబుతుంది. దోషులుగా నిర్ధారణ కావడంతో లాలూతోసహా వీరంతా జైలుకు పోవాల్సివచ్చింది. ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్న అంశంతో నిమిత్తంలేకుండా దాదాపు 20 ఏళ్లపాటు కొనసాగిన ఈ కుంభకోణంలో... చివరకు బడా రాజకీయ నాయకులు దోషులని తేలడానికి కూడా ఇంచుమించు అంతే సమయం పట్టింది. ఈ స్కాంలో దాఖలైన ఇతర కేసుల్లో కొందరు అధికారులకూ, మరికొందరు రాజకీయనాయకులకూ ఇంతకుముందే శిక్షలు పడ్డాయి. ఎన్నడో 1985లో అప్పటి కాగ్ టీఎన్ చతుర్వేది పశు సంవర్ధక శాఖలో నిధులు స్వాహా అవుతున్నాయని గుర్తించి అప్పటి సీఎం చంద్రశేఖర్సింగ్ను తొలిసారి అప్రమత్తం చేశారు. దాదాపు 1975 ప్రాంతంలో మొదలైన ఈ స్కాంలో భారీయెత్తున నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆయన గమనించారు. కానీ, చతుర్వేది సలహాను పట్టించుకోక పోవడంవల్ల అటు తర్వాతకూడా ఇది కొనసాగింది. చివరకు పశుసంవర్ధక శాఖ అధికారి అమిత్ ఖరే రూ. 37.70 కోట్ల నిధుల స్వాహాపై 1996లో ఇచ్చిన ఫిర్యాదుతో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఆ కేసులోనే లాలూ, జగన్నాథ్ మిశ్రాలు దోషులుగా నిర్ధారణ అయ్యారు. ఇదే స్కాంకు సంబంధించిన మరో కేసులో లాలూ లోగడ నిర్దోషిగా బయటపడ్డారు. 2000 సంవత్సరంలో బీహార్నుంచి విడివడి ఏర్పడిన జార్ఖండ్‌లో కూడా దాణా స్కాం కేసులు నడుస్తున్నాయి. అక్కడ లాలూ, మిశ్రాలపై మరో నాలుగు కేసులు విచారణలో ఉన్నాయి. ఆయన వచ్చిన గ్రామీణ నేపథ్యంవల్ల కావొచ్చు...ఆయన స్వభావంవల్ల కావొచ్చు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఆయనను జోకర్‌గా చిత్రించే ప్రయత్నాలు జరిగాయి. కానీ, లాలూ ఎంతో పేదరికంలో పుట్టి, కష్టపడి ఎదిగారు. ప్రభుత్వాల అవినీతి విధానాలకు వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ప్రారంభమైన విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న యువ విద్యార్థి నాయకుడాయన. అయితే, అలాంటి వ్యక్తి రాజకీయ రంగ ప్రవేశం చేసి, ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి, అప్పటికే పుట్టి కొనసాగుతున్న అవినీతిలో భాగస్వామిగా మారి, చివరకు ఆ కేసులోనే దోషిగా నిర్ధారణకావడం ఒక వైచిత్రి. ఆదర్శవంతమైన సమాజాన్ని కాంక్షించి ఉవ్వెత్తున లేచిన ఉద్యమంనుంచి ఎదిగిన నాయకుడొకరు చివరకు కుంభకోణంలో చిక్కుకుంటారన్నది అప్పట్లో ఊహకైనా అందని విషయం. తన నేపథ్యంరీత్యా ఈ స్కాంను తానే బయట పెట్టివుంటే లాలూ చరిత్రలో నిలిచిపోయేవారు. కానీ, ఆయన భిన్నమైన దోవను ఎంచుకున్నారు. ఇదే కేసులో కనీసం కొన్నేళ్లక్రితం తీర్పువచ్చి వున్నా పరిస్థితి వేరుగా ఉండేది. ఆయన శిక్షకు గురైనా అప్పీల్ చేసుకుని పార్లమెంటు సభ్యుడిగా కొనసాగేవారు. మరికొన్నాళ్లలో జరగబోయే ఎన్నికల్లో పాల్గొనేవారు. కానీ, మొన్న జూలై 10న నేర చరితులైన చట్టసభల సభ్యులపై కొరడా ఝళిపిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పువల్ల అది అసాధ్యంగా మారింది. ఈ తీర్పును వమ్ముచేస్తూ కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స కాస్తా వివాదంలో చిక్కుకోవడంవల్ల లాలూకు వెసులుబాటు దొరకలేదు. ఇప్పుడు ఆయనకు రెండేళ్లకుమించి శిక్షపడినట్టయితే, వెనువెంటనే పార్లమెంటు సభ్యత్వం రద్దుకావడంతోపాటు ఆరేళ్లవరకూ ఎన్నికల్లో పోటీచేసేందుకు కూడా అవకాశం ఉండదు. అప్పీల్లో నిర్దోషిగా నిర్ధారణ అయితే అది వేరే సంగతి. ఈ స్కాం విస్తృతిరీత్యా చాలా పెద్దది. దాదాపు 20 ఏళ్లపాటు సాగిన కుంభకోణంలో రూ.950 కోట్లమేర ఖజానాను కొల్లగొట్టారన్నది నిందితులపై అభియోగం. ఈ స్కాంకు సంబంధించి నమోదైన 55 కేసుల్లో జార్ఖండ్‌లోనే 53 కేసులున్నాయి. మొత్తం 46 కేసుల్లో 550 మందికి శిక్షలుపడగా 9 కేసుల్లో మరో 50 మంది విచారణను ఎదుర్కొంటున్నారు. అధికారపక్షంతోపాటు విపక్ష నాయకులు కూడా ఇందులో నిందితులు కావడం ఈ స్కాం విలక్షణత. దాణా స్కాం పర్యవసానంగా లాలూపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కూడా నమోదుచేయగా 2006లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆ కేసును కొట్టేసింది. దానిపై సీబీఐ అప్పీల్‌కు వెళ్లకపోవడంతో బీహార్ ప్రభుత్వమే 2007లో పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దాంతో కేసు కొనసాగించమని హైకోర్టు ఆదేశించింది. అయితే, లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఈ కేసులో అప్పీల్‌కి వెళ్లే అధికారం సీబీఐకి మాత్రమే ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెబుతూ కేసు కొట్టేసింది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వానికి లాలూ మద్దతు అవసరం కావడంవల్లే ఆ కేసులో సీబీఐ అప్పీల్‌కు వెళ్లలేదన్నది బహిరంగ రహస్యం. బీహార్‌లో కొన్నాళ్లక్రితం అధికార జేడీ(యూ)-బీజేపీలమధ్య విభేదాలు తలెత్తి నూతన రాజకీయ పరిణామాలు సంభవించాక తన భవిష్యత్తుపై లాలూ ప్రసాద్ యాదవ్ బాగా ఆశలు పెట్టుకున్నారు. తాను చాస్తున్న స్నేహ హస్తాన్ని తిరస్కరించి, ముఖ్యమంత్రి నితీష్కుమార్వైపే కాంగ్రెస్ చూస్తున్నా తాజా పరిణామాలు తనకు అనుకూలంగా మారబోతున్నాయని ఆయన విశ్వసించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో స్థానాలు సంపాదించి, కేంద్రంలో చక్రం తిప్పవచ్చునని అంచనా వేశారు. కానీ, ఈ తీర్పు పర్యవసానంగా అంతా తారుమారైంది. ఇన్నాళ్లూ ఆయన పార్టీని వెన్నంటి ఉన్న భిన్న వర్గాలు వేరే దారి చూసుకుంటాయా లేక ఆయనకు అండగా నిలబడతాయా అన్నది రాగల ఎన్నికల్లో తేలిపోతుంది. -
దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ దోషే : సీబీఐ కోర్టు
రూ. 950 కోట్ల గడ్డి స్కాంలో సీబీఐ కోర్టు తీర్పు జైలుకు తరలింపు.. 3న శిక్ష ఖరారు తక్షణం లోక్‌సభ సభ్యత్వం రద్దు! దోషుల్లో జేడీ(యూ) ఎంపీ జగదీశ్ శర్మ ఆయన లోక్‌సభ సభ్యత్వంపైనా కత్తి మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా సహా 45 మంది దోషులే ఐఏఎస్ ఆర్ముగంతోపాటు ఎనిమిది మందికి శిక్షలు ఖరారు దాణా కుంభకోణంగా పేరొందిన 1996 నాటి పశు సంవర్ధక శాఖ కుంభకోణం లాలూ రాజకీయ జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన దీని దెబ్బకు 1997లో పదవిని కోల్పోయారు. అయితే తన భార్య రబ్రీదేవిని సీఎం పీఠంపై కూర్చోబెట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దాణా కేసులో మొత్తం 56 మంది నిందితులుండగా వారిలో ఏడుగురు విచారణ సందర్భంగా మరణించారు. ఇద్దరు అప్రూవర్లుగా మారారు. మరొకరు నేరాన్ని అంగీకరించగా ఇంకొకరిని కోర్టు విడిచిపెట్టింది. రాంచీ/కోయంబత్తూరు: బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(65)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లాలూ రాజకీయ జీవితంలో పెను మచ్చగా మిగిలిన 17 ఏళ్ల నాటి దాణా కుంభకోణంలో ఆయన దోషేనని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ప్రకటించింది. దాంతో ఆయన లోక్‌సభ సభ్యత్వానికి కూడా ఎసరొచ్చింది. రూ.950 కోట్ల దాణా కుంభకోణంలో లాలూతో పాటు మరో 44 మంది నిందితులను కూడా ఐపీసీ సెక్షన్లు 120బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 467 (ఫోర్జరీ), 468, 477ఎ లతో పాటు అవినీతి నిరోధక చట్టం (1988) కింద కూడా దోషులుగా కోర్టు నిర్ధారించింది. జేడీ(యూ) ఎంపీ జగదీశ్ శర్మ, బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాతో పాటు మరో ఐదుగురు రాజకీయ నాయకులు, నలుగురు ఐఏఎస్ అధికారులు మహేశ్‌ప్రసాద్, పూల్‌చంద్ సింగ్; బెక్ జులెస్, కె.ఆర్ముగం, ఆదాయ పన్ను అధికారి ఏసీ చౌదరి, పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు వీరిలో ఉన్నారు. పశు సంవర్ధక శాఖకు సంబంధించిన రూ.37.7 కోట్లను చైబాసా జిల్లా బొక్కసం నుంచి అక్రమంగా డ్రా చేశారంటూ వీరిపై నమోదైన అభియోగాలను సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ప్రవాస్‌కుమార్ సింగ్ ధ్రువీకరించారు. దోషులుగా పేర్కొన్న వారిలో పశు సంవర్ధక శాఖ మాజీ కార్యదర్శి అయిన ఐఏఎస్ అధికారి అర్ముగం, బీహార్ మాజీ పశు సంవర్ధక, కార్మిక మంత్రి విద్యాసాగర్ నిషాద్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధ్రువ్ భగత్, ఐదుగురు దాణా సరఫరాదారులు మధు మెహతా, బిమలా శర్మ, ఎస్కే సిన్హా, శివ్కుమారి, రాజేశ్ వర్మలకు శిక్షను సోమవారమే ఆయన ఖరారు చేశారు. వారందరికీ మూడేళ్ల దాకా కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల దాకా జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అయితే తీర్పు అనంతరం వారందరికీ బెయిల్ కూడా మంజూరు చేశారు. లాలూ సహా మిగతా 37 మందికి అక్టోబర్ 3న శిక్షను ఖరారు చేయనున్నారు. పదవికీ ఎసరు! లోక్‌సభ సభ్యులైన లాలూ (సరన్), జగదీశ్ శర్మల పదవి తీర్పు నేపథ్యంలో ప్రమాదంలో పడింది. రెండేళ్లకు పైబడి శిక్ష పడితే వారి సభ్యత్వం తక్షణం రద్దవుతుంది. అంతేగాక కనీసం ఆరేళ్లపాటు ఎన్నికల బరిలో దిగడానికీ వీలుండదు. ఎందుకంటే రెండేళ్లు, లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడ్డ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీర్పుపై స్టే తెచ్చుకుంటే వారి సభ్యత్వం రద్దు కాబోదన్న ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనను గత ఆగస్టులో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ చరిత్రాత్మక తీర్పును నిర్వీర్యం చేసేందుకు యూపీఏ సర్కారు ప్రతిపాదించిన ఆర్డినెన్స అర్థరహితమంటూ రాహుల్‌గాంధీ కూడా తాజాగా తూర్పారబట్టడంతో దాని కథ కంచికి చేరినట్టేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాలూ, శర్మల లోక్‌సభ సభ్యత్వం రద్దుపై కోర్టు తీర్పును పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ మీరాకుమార్ కోయంబత్తూరులో చెప్పారు. ముభావంగా లాలూ: కోర్టు తీర్పు వెలువడగానే లాలూను రాంచీ శివార్లలోని బిర్సా ముండా కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ సందర్భంగా కోర్టు బయట తనను చుట్టుముట్టిన విలేకరులతో మాట్లాడేందుకు లాలూ నిరాకరించారు. అంతకుముందు కోర్టుకు వెళ్లే ముందు రాంచీలోని దుర్గా ఆలయంలో పూజలు జరిపారు. అనంతరం పెద్ద కొడుకు తేజస్వితో కలిసి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు హాల్లో రెండో వరుసలో కూర్చున్న లాలూ, తీర్పు సందర్భంగా మౌనంగా కన్పించారు. పాట్నాలోని రబ్రీ నివాసంలో కూడా తీర్పు తర్వాత విషాద వాతావరణం నెలకొంది. మీడియాతో పాటు ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఈ తీర్పును ఆర్జేడీకి అతి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. దీన్ని హైకోర్టులో సవాలు చేస్తామని ఆర్జేడీ ప్రకటించింది. లాలూ గైర్హాజరీలో పార్టీని ఆయన భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్ నడిపిస్తారని పేర్కొంది.