ముగిసిన ప్రచార హోరు
పట్నా: బిహార్ శాసనసభ తొలి దశ ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం ఐదు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా సోమవారం సమస్తిపూర్, బేగుసరాయ్, భాగల్పూర్, బాంకా, ఖగారియా, ముంగేర్, లఖీసరాయ్, షేక్‌పురా, నవద, జాముయ్ జిల్లాల్లోని 49 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ- జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహాకూటములు పరస్పర విమర్శలతో ప్రారంభించిన ప్రచారం.. ఆరంభంలో అభివృద్ధి అంశంపై కేంద్రీకరించినప్పటికీ.. ఆ తర్వాత అగ్రనేతలపై వ్యక్తిగత విమర్శలకు, ఆపై దూషణల పర్వానికి నాంది పలికింది. రెండు కూటముల్లోని అగ్ర నేతలు సభల్లో ప్రత్యర్థి నేతలపై పరుష పదజాలం వాడడంతో ప్రచారం వేడెక్కిపోయింది. ఒకరు ‘సైతాన్’ అంటే.. మరొకరు ‘బ్రహ్మ పిశాచి’ అన్నారు. ఒకరు ‘దాణా దొంగ’ అంటే.. ఇంకొకరు ‘నరభక్షకుడు’ అని అభివర్ణించారు. దీంతో కేసులు పెరిగాయి.
ఒకరిని మించి మరొకరు... రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను చూపుతూ.. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కుల ప్రాతిపదికపై రిజర్వేషన్లను రద్దు చేయాలని యోచిస్తోందన్న మాటను జేడీయూ, ఆర్‌జేడీ అగ్రనేతలు లాలూ ప్రసాద్, నితీశ్‌కుమార్‌లు తమ ప్రచారంలో ప్రధానాంశంగా చేశాయి. దాద్రీలో బీఫ్ తిన్నాడన్న అనుమానంతో ఒక వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై స్పందిస్తూ.. హిందువులు కూడా బీఫ్ తింటారని లాలు చేసిన వ్యాఖ్యలను ఆయనపైనే తిప్పికొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవకాశంగా మలచుకున్నారు. లాలూ తన సొంత కులమైన యాదవులను, తనను అధికారంలోకి తీసుకువచ్చిన యదువంశీయులను, బిహార్‌ను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు.
దీనిపై సీఎం నితీశ్ స్పందిస్తూ.. బిహార్ ఎన్నికలకు మతం రంగు పులిమేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, అసలు మోదీ ఇప్పుడు కనిపిస్తున్నారని అభివర్ణించారు. అయితే.. హేయమైన దాద్రీ ఘటనపై మాత్రం మోదీ కఠోరమైన మౌనం పాటిస్తున్నారని ఎండగట్టారు. లాలూ, నితీశ్ కూటమి గెలిస్తే.. మళ్లీ ‘ఆటవిక రాజ్యం’ వస్తుందంటూ నాటి ఆర్‌జేడీ పాలనపై గల విమర్శలను ప్రస్తావిస్తూ మోదీ, అమిత్‌షా సహా ఎన్‌డీఏ నేతలు ప్రచారం నిర్వహించారు. పరస్పర ఆరోపణల పర్వంలో.. అమిత్‌షా, లాలు, శరద్‌యాదవ్, అక్బరుద్దీన్ ఒవైసీలపై ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.
ప్రచారానికి అగ్రనేతల సారథ్యం... ఎన్‌డీఏ ఎన్నికల ప్రచారానికి మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలు సారథ్యం వహించారు. మిత్రపక్షాల నేతలు రామ్‌విలాస్ పాశ్వాన్(ఎల్‌జేపీ), జితన్‌రామ్‌మాంఝీ (హిందుస్తానీ అవామీ మోర్చా), ఉపేంద్రకుష్వహ (రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ)లు కూడా మోదీ సభల్లో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్‌తో కూడిన మహా కూటమి ప్రచారానికి లాలు, నితీశ్‌లు నేతృత్వం వహించగా.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు చెరొక రోజు పాటు ప్రచారం నిర్వహించారు. ఇక పార్టీ నేతలు, హిందీ సినీ తారలు హేమమాలిని, స్మృతి ఇరానీ, మనోజ్ తివారితో పాటు నటుడు అజయ్ దేవగన్‌ను కూడా బీజేపీ ప్రచారంలోకి దించింది.
బీజేపీకి జగన్నాథ్ మద్దతు
బిహార్ మాజీ సీఎం జగన్నాథ్‌మిశ్రా తన పార్టీ భారతీయ జన్ కాంగ్రెస్ (రాష్ట్రీయ)ను శనివారం పునరుద్ధరించారు. రాష్ట్రంలో బీజేపీ సారథ్యంలోని కూటమి గెలుపుకోసం తాను కృషి చేస్తానని ప్రకటించారు. ఆరంభం నుంచి కాంగ్రెస్‌లో కొనసాగిన మిశ్రా ఆ పార్టీ నుంచి మూడు సార్లు సీఎం పదవి చేపట్టారు. ఒకసారి కేంద్రమంత్రి కూడా అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడి నితీశ్‌కు మద్దతు తెలిపారు. మిశ్రా కుమారుడు నితీశ్‌మిశ్రా మొన్నటి వరకూ నితీశ్ కేబినెట్‌లో మంత్రి. ఆయన ఇటీవల జితన్‌రామ్‌ప్రసాద్‌కు మద్దతు తెలిపి.. ఇప్పుడు బీజేపీ టికెట్‌పై పోటీచేస్తున్నారు.
‘రుషులూ గోమాంసం తినేవారు!’
పట్నా: హిందువులు కూడా బీఫ్ తింటారంటూ ఆర్జేడీ చీఫ్ లాలూ వ్యాఖ్యానించగా, ఆ పార్టీ సీనియర్ నేత రఘువంశ్‌సింగ్ ‘రుషులు, మహర్షులూ గోమాంసం తిన్నార’ంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రుషులు, మహర్షులు గోమాంసం తినేవారని వేదాల్లోనే రాసి ఉంది. దీనిపై ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరమేమీ లేదు’ అని ఓ కార్యక్రమంలో అన్నారు. ఈ ఈ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని రాంబిహారీ, దర్భంగాలోని కోర్టుల్లో ప్రైవేటు ఫిర్యాదులు దాఖలయ్యాయి.